AP High Court: ఇప్పుడు ప్రచారానికి.. రేపు నామినేషన్‌కా?

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేనిపక్షంలో ఇండియన్‌ పోలీసు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పలమనేరు డీఎస్పీ నోటీసు జారీచేయడంపై.....

Updated : 12 Nov 2021 05:22 IST

కుప్పంలో డీఎస్పీ ‘ముందస్తు అనుమతుల’ నోటీసుపై హైకోర్టు ఆగ్రహం
రాష్ట్రంలో పరిస్థితి అర్థమవుతోందని వ్యాఖ్య
డీఎస్పీ నోటీసుపై స్టే.. నివేదిక ఇవ్వాలని ఎస్పీకి ఆదేశం

ఈనాడు, అమరావతి: కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేనిపక్షంలో ఇండియన్‌ పోలీసు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పలమనేరు డీఎస్పీ నోటీసు జారీచేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘమే (ఎస్‌ఈసీ) షరతు విధించలేదని, అందుకు భిన్నంగా డీఎస్పీ ఎలా వ్యవహరిస్తారని మండిపడింది. ఇప్పుడేమో ఎన్నికల ప్రచారానికి అనుమతి అంటున్నారు.. భవిష్యత్తులో నామినేషన్‌ వేయాలంటే అనుమతి తప్పనిసరి అని పోలీసులు నోటీసులు ఇస్తారేమోనని వ్యాఖ్యానించింది. డీఎస్పీ ఇచ్చిన నోటీసును చూస్తే.. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం అవుతోందని మండిపడింది. సదరు నోటీసుపై స్టే విధించింది. ఈ విషయమై ఆయన నుంచి వివరణ తీసుకొని కోర్టుకు నివేదిక ఇవ్వాలని చిత్తూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. మరోవైపు తెదేపా నేతలు ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నాని, నిమ్మల రామానాయుడు, పీఎస్‌ మునిరత్నం ఎన్నికల ప్రచారం చేసుకోడానికి అనుమతిచ్చింది. వారిని అడ్డుకోవద్దని పోలీసులకు స్పష్టంచేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

కుప్పంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ పలమనేరు డీఎస్పీ ఈ నెల 8న జారీచేసిన నోటీసును సవాలు చేస్తూ తెదేపా తరఫున 15, 16 వార్డులకు కౌన్సిలర్లుగా బరిలో దిగిన వి.జయలక్ష్మి, జి.హర్షధర్మతేజ గురువారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపించారు. ఇలా ముందస్తు అనుమతి తీసుకోవాలనడం చట్టవిరుద్ధం అన్నారు. అధికారపార్టీ నేతలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రచారానికి పోలీసులు వెసులుబాటు ఇస్తున్నారన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. డీఎస్పీ నోటీసుపై స్టే విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని