AP News: అయ్యప్ప భక్తుడి సాహసయాత్ర..ఒంటికాలితో 750 కి.మీ కాలినడక

వ్యసనాల నుంచి కాపాడటంతోపాటు సమాజంలో వెక్కిరింపుల నుంచి గౌరవప్రదమైన గుర్తింపు వచ్చింది ఆ మణికంఠుడి దయవల్లేనని ఆ దివ్యాంగుడు నమ్మాడు. ఆ స్వామిని

Updated : 05 Jan 2022 10:16 IST

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: వ్యసనాల నుంచి కాపాడటంతోపాటు సమాజంలో వెక్కిరింపుల నుంచి గౌరవప్రదమైన గుర్తింపు వచ్చింది ఆ మణికంఠుడి దయవల్లేనని ఆ దివ్యాంగుడు నమ్మాడు. ఆ స్వామిని దర్శించుకునేందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 750 కి.మీలు నడిచి అయ్యప్పస్వామిని దర్శించుకున్నాడు నెల్లూరు నగరానికి చెందిన అకరపాక సురేష్‌ అనే దివ్యాంగుడు.. గతేడాది సెప్టెంబరు 20వ తేదీ నగరంలోని పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉన్న అమ్మ వారి ఆలయంలో ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరారు. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. ఎన్నో సవాళ్లు, ప్రతికూలతలను ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో మొక్కవోని దీక్షతో మనసంతా అయ్యప్పస్వామిని నింపుకుని, ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి గమ్యాన్ని చేరుకున్నారు. పవిత్రమైన ఇరుముడిని తలపై పెట్టుకుని, ఎవరి సహకారం లేకుండా ఒంటి కాలితో.. ఊతకర్రను సాయంగా చేసుకుని దాదాపు 105 రోజులు నిర్విఘ్నంగా మహాపాదయాత్రను కొనసాగించారు. రెండు రోజుల క్రితం యాత్రను పూర్తి చేసుకున్నారు. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు బయలుదేరి ఎండ పెరిగే సరికి ఏదో ఒక ఆలయానికి చేరుకునేవారు. అక్కడ సేద దీరి భిక్ష చేసిన అనంతరం తిరిగి బయలుదేరేవారు. రాత్రిళ్లు కూడా దగ్గర్లోని ఆలయంలో బస చేసేవారు. ఇప్పటికే పలుమార్లు దీక్ష చేపట్టిన సురేష్‌.. నడిచి వెళ్లడం ఇది రెండోసారని కమిటీ సభ్యులు తెలిపారు. శబరిమల ఆలయ అధికారులు సురేష్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవసరమైన సహాయాన్ని అందించి.. దర్శనాన్ని పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని