ap news:డిసెంబరుకల్లా టిడ్కో ఇళ్ల పంపిణీ

డిసెంబరు కల్లా టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తవుతుందని, జగనన్న కాలనీల్లో రూ.32,909 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు. శాసనసభలో గురువారం ‘ఇళ్ల స్థలాల పంపిణీ-గృహాల నిర్మాణం’ అనే అంశంపై

Updated : 18 Mar 2022 06:32 IST

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలకు రూ.32,909 కోట్లు

అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటన

కేంద్ర సహకారంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

ఈనాడు, అమరావతి: డిసెంబరు కల్లా టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తవుతుందని, జగనన్న కాలనీల్లో రూ.32,909 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు. శాసనసభలో గురువారం ‘ఇళ్ల స్థలాల పంపిణీ-గృహాల నిర్మాణం’ అనే అంశంపై సీఎం మాట్లాడారు. ‘టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్లను జీప్లస్‌ త్రీ పద్ధతిలో మూడు కేటగిరీల్లో నిర్మిస్తున్నాం. ఇప్పటికే 1,07,814 పూర్తయ్యాయి. 63,305 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయి. గత జనవరిలోనే వీటి పంపిణీ ప్రారంభించాం. వచ్చే డిసెంబరు నాటికి ప్రక్రియ పూర్తవుతుంది. నిర్మాణాల పురోగతిని అనుసరించి బిల్లుల చెల్లింపులు సాగుతున్నాయి’ అని తెలిపారు.

తెదేపావల్లే పంపిణీ ఆగింది....

విశాఖలో భూముల సేకరణకు ఇటీవల హైకోర్టు నుంచి క్లియరెన్స్‌ లభించిందని సీఎం జగన్‌ తెలిపారు. వచ్చేనెలలో అక్కడికి వెళ్లి 1.80 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని, నిర్మాణాల్ని ప్రారంభిస్తామని చెప్పారు. ‘మాకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో రకరకాల కారణాలు చూపుతూ తెదేపా కోర్టులను ఆశ్రయిస్తోంది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులసహా విశాఖలోనూ ఇలాగే జరిగింది. దీనివల్ల ఏడాదిపాటు పట్టాల పంపిణీ ఆగింది. లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 215 చదరపు అడుగులను నిర్మాణానికి నిర్దేశించారు. మా ప్రభుత్వం 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టింది. ప్రభుత్వమే 20 వేల ఇళ్లను స్వయంగా కట్టించి ఆ అనుభవంతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేసి, ముందుకు సాగుతున్నాం. ఇళ్ల నిర్మాణంవల్ల 30 రకాల వృత్తుల వారికి ఉపాధి లభిస్తోంది’ అని వివరించారు. గృహాల నిర్మాణానికి కేంద్రం నుంచి సహకారం లభిస్తోందని సీఎం జగన్‌ వెల్లడించారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి మాట్లాడుతూ... ‘సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల నన్నే కాదు.. మరొకరిని నిల్చోబెట్టినా ఎన్నికల్లో గెలుస్తారు’ అని వ్యాఖ్యానించారు. జగన్‌ పరిపాలనలో ప్రజల కష్టాలు తీరుతున్నాయని జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. 

ఈ నెలాఖరుకు 45 వేల టిడ్కో ఇళ్లిస్తాం

ఈ నెలాఖరుకు మొదటి దశలో 45వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని.. ఇప్పటికే 3,488 గృహాలను ఇచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టిడ్కో గృహాలపై శాసన మండలిలో తెదేపా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ఈ ఏడాది జులైలో 95 వేలు, డిసెంబరులో 1.22 లక్షల ఇళ్లను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో 2018 నుంచి ఇప్పటి వరకు 18 బాల్య వివాహాలు జరిగాయని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. గత మూడేళ్లలో 1,508 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న 1.53 లక్షల క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కొడాలి నాని సమాధానంగా చెప్పారు. నూనెల ధరలను నియంత్రించడానికి రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన 229 మందిపై కేసులు నమోదు చేసి 54,145 మెట్రిక్‌ టన్నుల నూనెలను సీజ్‌ చేశామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని