ఆరోగ్య మిత్రలకూ నగదు ప్రోత్సాహకాలు

వాలంటీర్ల మాదిరిగానే ఆరోగ్య మిత్రలకూ నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సీఎం మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

Published : 13 Apr 2022 04:03 IST

లక్ష్యాల సాధనను యజ్ఞంలా భావించి పనిచేయాలి
 వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: వాలంటీర్ల మాదిరిగానే ఆరోగ్య మిత్రలకూ నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సీఎం మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద చికిత్సల సంఖ్య పెంపు అవసరమైతే తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ట్రస్టు అనుబంధ ఆస్పత్రుల్లో పనిచేసే ఆరోగ్యమిత్రల్లో ప్రతిభ ఆధారంగా ఎంపికచేసిన వారికి ఏడాదికి ఒకసారి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పన కోసం రాజీ పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు ప్రారంభం కాని వైద్య కళాశాలల భవన నిర్మాణాల పనులను మే 15కల్లా మొదలుపెట్టాలి. వీటికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపైనా ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలి. వైద్య ఆరోగ్యశాఖ తరఫున కొత్తగా చేపట్టిన కొత్త నియామకాలను మే నెలాఖరుకు పూర్తి చేయాలి. ప్రజలకు మెరుగైన చికిత్స అందించే ఉద్దేశంతోనే వైద్యులకు జీతాలు పెంచాం. ఇందులో భాగంగానే వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీసును నిషేధించాం’ అని తెలిపారు.

12-14 ఏళ్ల వారిలో తొలి డోసు 94.47% పూర్తి!
ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 0.13 శాతానికి తగ్గినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 4,30,81,428 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిందని తెలిపారు. 15-17 ఏళ్ల మధ్యవారికి 100% రెండు డోసుల పంపిణీ పూర్తయిందని చెప్పారు. 12-14 ఏళ్ల మధ్యవారిలో 94.47% మందికి మొదటి డోసు పంపిణీ పూర్తయిందని చెప్పారు. పలాస కిడ్నీ ఆస్పత్రి, కడప సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి, గిరిజన ప్రాంతాల్లో స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ ప్రగతి గురించి సీఎంకు అధికారులు వివరించారు. పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, విజయనగరం, అమలాపురం వైద్య కళాశాలల నిర్మాణాల పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో వినయ్‌చంద్‌, ఏపీ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు అనుబంధ ఆస్పత్రుల్లో ఏర్పాటుచేయనున్న సమాచార కియోస్క్‌ నమూనాను సీఎం పరిశీలించారు. వైద్య సేవల వివరాలను సైన్‌బోర్డుల రూపంలో ఆస్పత్రుల్లో ఏర్పాటుచేయాలని సీఎం అధికారులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని