Andhra News: వృద్ధుడిపై సాక్షి విలేకరి దౌర్జన్యం

సీఎం జగన్‌ నివాసానికి అత్యంత సమీపంలో ఓ వృద్ధుడిపైన, అతని కుటుంబంపైన సాక్షి విలేకరి దౌర్జన్యానికి తెగబడ్డాడు. ‘‘నన్ను చంపొద్దయ్యా’’ అంటూ ఆ వృద్ధుడు... సాక్షి విలేకరి కాళ్లు పట్టుకుని వేడుకున్నా సరే

Updated : 01 May 2022 08:51 IST

‘నన్ను చంపొద్దయ్యా’ అంటూ కాళ్లు పట్టి వేడుకున్నా దాడి

సీఎం జగన్‌ నివాసానికి అత్యంత సమీపంలో ఘటన

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియోలు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తాడేపల్లి: సీఎం జగన్‌ నివాసానికి అత్యంత సమీపంలో ఓ వృద్ధుడిపైన, అతని కుటుంబంపైన సాక్షి విలేకరి దౌర్జన్యానికి తెగబడ్డాడు. ‘‘నన్ను చంపొద్దయ్యా’’ అంటూ ఆ వృద్ధుడు... సాక్షి విలేకరి కాళ్లు పట్టుకుని వేడుకున్నా సరే కనికరించలేదు. ఆ వృద్ధుణ్ని పట్టుకుని బలంగా విసిరేశాడు. కింద పడేలా నెట్టేశాడు. అసభ్యపదజాలంతో దూషించాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. పోలకంపాడు గ్రామానికి చెందిన అట్ల కోటేశ్వరరావు అనే వృద్ధుడికి, సాక్షి విలేకరి నాగిరెడ్డికి మధ్య ఓ ఇంటి స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో  కోటేశ్వరరావుపైన నాగిరెడ్డి దౌర్జన్యానికి, దాడికి పాల్పడ్డాడు. తనపై దాడి జరుగుతున్న సమయంలో కోటేశ్వరరావు ‘‘అయ్యా! చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు.. కాపాడండి’’ అంటూ తీవ్ర ఆక్రందనతో వేడుకున్నాడు.

జగన్‌, ఆర్కే.... మీకు దౌర్జన్యాలు కనిపించట్లేదా?

‘‘అయ్యా! ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... మిమ్మల్ని నమ్మి ఓట్లేశాం. మాకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా చూస్తున్నారేం? ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలు మీకు కనిపించట్లేదా? ఘటన జరిగిన ప్రదేశానికి కేవలం మూడే కిలోమీటర్ల దూరంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది. సాక్షి విలేకరి నాగిరెడ్డి వంటి వారు చేస్తున్న పాపాలు సీఎం దృష్టికి రావట్లేదా? మా లాంటి పేదలు, సామాన్యుల్ని లక్ష్యంగా చేసుకుని భూకబ్జాలకు పాల్పడతారా?.’’ అంటూ బాధితుడు కోటేశ్వరరావు శనివారం వాపోయారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై నాగిరెడ్డి చేసిన దాడి, దౌర్జన్యానికి సంబంధించిన వీడియోల్ని ప్రదర్శించి చూపించారు.  ‘‘నాగిరెడ్డి చేస్తున్న భూకబ్జాను ప్రశ్నించా. వృద్ధుడ్ని అని కూడా కనికరం లేకుండా నా గుండెలపై తన్నాడు. అతని వల్ల నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. అతని బారి నుంచి మమ్మల్ని రక్షించాలి.’’ అని కోటేశ్వరరావు కోరారు. ఈ ఘటనపై శనివారం రాత్రి కోటేశ్వరరావు, నాగిరెడ్డి వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం ఘటనా స్థలాన్ని సందర్శించి మాట్లాడుతూ... ఇక్కడేదో అన్యాయం జరిగిపోయినట్లుగా.. అరాచక పాలన అంటూ తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్‌ చేయడం సరికాదన్నారు. వయస్సులో పెద్దవారు కావడంతో ఆయన తన కాళ్లు పట్టుకుంటుంటే సరికాదని నెట్టే క్రమంలో ప్రమాదవశాత్తూ కోటేశ్వరరావు వెనక్కి పడిపోయారని, తానేమీ దాడి చేయలేదని నాగిరెడ్డి చెప్పారు. తన జేబులో సెల్‌ఫోన్‌ను కోటేశ్వరరావు భార్య, పలువురు మహిళలు లాక్కోవడంతో దాని కోసం పరుగెత్తగా మహిళలే తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారన్నారు.


దాడిని ఖండించిన తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి : మహిళలు, వృద్ధులపై సాక్షి విలేకరి దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్‌లో ఖండించారు. అధికారమదంతో పెట్రేగుతున్న ఇలాంటి అరాచకాలను కట్టడి చేయలేరా జగన్‌...’’ అని ప్రశ్నిస్తూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ‘‘కాళ్లు పట్టుకొని చంపొద్దని ప్రాధేయపడిన వృద్ధుడిపై సాక్షి విలేకరి దాడికి పాల్పడడం దుర్మార్గం’’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని