Andhra News: ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడ?

రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంత బాబు).. పూర్వ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎట్టకేలకు పోలీసులు ఎమ్మెల్సీని ప్రధాన నిందితుడిగా చేర్చారు. మొదట సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఇచ్చిన...

Updated : 11 Aug 2022 14:19 IST

అదృశ్యమైన అధికార పార్టీ నేత
గతంలో ఆయనపై రౌడీషీట్‌.. ఎత్తివేత
అరెస్టు చేయకుంటే ఉద్యమిస్తామన్న దళిత సంఘాలు
జి.మామిడాడలో డ్రైవరు సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి
ఈనాడు డిజిటల్‌-రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే-కాకినాడ మసీదు సెంటర్‌, బాలాజీచెరువు, పెదపూడి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంత బాబు).. పూర్వ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎట్టకేలకు పోలీసులు ఎమ్మెల్సీని ప్రధాన నిందితుడిగా చేర్చారు. మొదట సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినా.. తర్వాత హత్య కేసు, ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలో సెక్షన్లు జోడించారు. కలెక్టర్‌ ప్రత్యేక అనుమతితో శనివారం అర్ధరాత్రి పోస్టుమార్టం చేసి.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసు బందోబస్తు నడుమ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని అతని స్వగ్రామం పెదపూడి మండలం జి.మామిడాడకు తరలించి... అంత్యక్రియలు చేశారు. అనంతబాబును పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదనే ప్రశ్న ప్రజా, దళిత సంఘాల నుంచి వినిపిస్తోంది. ఆదివారం సాయంత్రంలోగా అరెస్టు చేయకపోతే సోమవారం నుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీపీఐ, సీపీఎం నాయకులు ప్రకటించారు.

అదిగో.. ఇదిగో అంటూ..

పోస్టుమార్టం ఆలస్యం కావడం వల్లే కేసులో తాము ముందుకు వెళ్లలేకపోయామని పోలీసులు చెబుతూ వచ్చారు. శనివారం రాత్రే పోస్టుమార్టం పూర్తయింది. ఆదివారం ఉదయం అంత్యక్రియలూ అయిపోయాయి. ఇప్పటికీ ఎమ్మెల్సీని అరెస్టు చేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం అదుపులోకి తీసుకుంటే కస్టడీలో ఉంచాలనే ఉద్దేశంతో పోలీసులు తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్సీ ఆదివారం కాకినాడలో ఓ అపార్ట్టుమెంటులో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి చూడగా, ఆయన అక్కడ లేరు. అనంతబాబు భార్య, తల్లి, ఇతర కుటుంబసభ్యులే ఉన్నారు. దీంతో పోలీసులు వారిని ఎమ్మెల్సీ గురించి విచారించారు. ఆయన ఈ రెండు రోజులూ రాజమహేంద్రవరం, కాకినాడ పరిసరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి తన ఇద్దరు గన్‌మెన్లను వదిలి వెళ్లినట్లు పోలీసువర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఎమ్మెల్సీ కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయి.

హత్య కేసులో ప్రధాన నిందితుడిగా (ఏ-1) ఎమ్మెల్సీ పేరును సవరించిన ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఇందులో ఆయనతోపాటు మరికొందరు ఉన్నట్లు పేర్కొన్నారు. వాళ్లెవరు.. అసలు ఎంతమంది పాత్ర ఉందనే విషయాలు చర్చనీయాంశమయ్యాయి. సుబ్రహ్మణ్యం ఉదంతంలో ఆరుగురు పాల్గొన్నారనీ.. వీరంతా వేరేచోట తలదాచుకున్నారని సమాచారం. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఎమ్మెల్సీ తన వాహనంలో తెచ్చినప్పుడు ఆయన ఒక్కరే వచ్చారని కుటుంబసభ్యులు చెబుతున్నా.. మిగిలినవారూ ఆ చుట్టుపక్కలే ఉండొచ్చనే అనుమానం ఉంది.

పోస్టుమార్టం నివేదికలో ఏముంది?

శనివారం అర్ధరాత్రి 1.30 గంటలకు వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేసి, నివేదికను పోలీసులకు ఇచ్చారు. తలపై రెండు గాయాలు, రెండు చేతులు విరిచిన ఆనవాళ్లు, ఒళ్లంతా తీవ్రంగా కవుకు గాయాలు, ఎడమ కాలు బొటనవేలు, కుడికాలు మడమ దగ్గర గాయాలు గుర్తించినట్లు తెలుస్తోంది. మర్మావయవం మీద కూడా గట్టిగా తన్నడంతో గాయాలైన ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం.

ఎమ్మెల్సీ అనంతబాబుపై గతం నుంచి నేరారోపణలు ఉన్నాయి. రంపచోడవరం పోలీసులు గతంలో రంగురాళ్ల కేసులో రౌడీషీట్‌ నమోదు చేశారు. మన్యంలో ఈయన చెప్పిందే వేదమని.. ఆయన చెప్పినట్లు ఎవరైనా వినకపోతే ఊరుకోరని అంటారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఉన్న రౌడీషీట్‌ను ఎత్తేశారు. మరికొన్ని ఇతర కేసులనూ ఆ తర్వాత ఉపసంహరించినట్లు సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరిలో ఈయన ప్రముఖుడు. ఈ సాన్నిహిత్యంతోనే డీసీసీబీ ఛైర్మన్‌ పదవి వరించింది. సాంకేతికంగా ఆ పదవి కోల్పోవడంతో వెంటనే ఎమ్మెల్సీ పదవి దక్కడం.. పార్టీలో ఆయనకున్న పట్టుకు సంకేతం.

రోజంతా తీవ్ర భావోద్వేగాల మధ్యే..

ఓ వైపు భర్త చనిపోయాడనే ఆవేదన.. మరోవైపు అధికార పార్టీ నాయకుల వెతుకులాట.. బేరసారాలు, రాజీ ప్రయత్నాలు... ఇంకో వైపు పోస్టుమార్టంకు ఒప్పుకోవాలని పోలీసుల ఒత్తిడి. ఇవీ శుక్ర, శనివారాల్లో సుబ్రహ్మణ్యం భార్య, కుటుంబసభ్యులకు ఎదురైన అనుభవాలు. ఎంతమంది బెదిరించినా.. ఆశచూపి బేరాలాడినా.. సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ మాత్రం చాలావరకూ పట్టు వదల్లేదు. తొలుత ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని డిమాండు చేసినా, తర్వాత 302 సెక్షన్‌ పెట్టాల్సిందేనన్నారు. ఆమెకు నచ్చజెప్పి పోస్టుమార్టం చేయాలని పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. శనివారం మధ్యాహ్నం సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని వైకాపా నేతల వద్దకు తీసుకెళ్లి రాజీ చేసినట్లు కొద్దిసేపు ప్రచారం జరిగింది. కొద్దిసేపటికే వారు తమకు న్యాయం చేయాలంటూ వీడియో విడుదల చేయడంతో.. ఆ ప్రచారం తప్పని అర్థమైంది. ఇదేతరుణంలో దళిత సంఘాలు, ప్రజాసంఘాలు బలంగా నిలబడటం అపర్ణకు ఊతమిచ్చింది. 302, ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధ సెక్షన్లు పెట్టినట్లు ఎస్పీ ప్రకటించాకే ఆమె పోస్టుమార్టంకు అంగీకరించారు. శనివారం ఉదయం నుంచి పోస్టుమార్టం జరిగే వరకూ ఉద్యమాన్ని దగ్గరుండి నడిపించడంలో హైకోర్టు న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ కీలకపాత్ర పోషించారు. కుటుంబసభ్యులకు ఇష్టం లేకుండా పోస్టుమార్టం చేస్తే పోరాటం ఉద్ధృతం చేస్తామని బైఠాయించారు. దీంతో అపర్ణ సరేనన్న తర్వాతే అర్ధరాత్రి పోస్టుమార్టం చేశారు.


నల్లమిల్లి గృహ నిర్బంధం

అనపర్తి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరు నిరంకుశంగా ఉందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ పూర్వ కారు డ్రైవరు సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఆదివారం జి.మామిడాడ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు రామకృష్ణారెడ్డిని రామవరంలో గృహనిర్బంధం చేశారు. అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెదేపా ఇంఛార్జిగా ఉన్న తాను మృతదేహాన్ని సందర్శించి, నివాళి అర్పించాల్సిన బాధ్యత ఉన్నా ఉదయం నుంచి పోలీసులు గృహనిర్బంధం చేయడం బాధాకరమని రామకృష్ణారెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని