పాత ‘మెటీరియల్‌’ బకాయిల చెల్లింపునకే కేంద్రం సై

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద చేసిన పనులకు సంబంధించి పాత బకాయిలతో సహా కేంద్రం నుంచి రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం

Published : 28 Jun 2022 04:40 IST

2021-22 నాటి చెల్లింపులకే పరిమితమైన కేంద్రం

ఈనాడు, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద చేసిన పనులకు సంబంధించి పాత బకాయిలతో సహా కేంద్రం నుంచి రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2021-22 సంవత్సరంలో చేసిన పనులకు సంబంధించిన మెటీరియల్‌ పెండింగ్‌ నిధులు రూ.1,049.01 కోట్లు విడుదల చేసింది. అంత కంటే ముందు సంవత్సరాల నాటి పాత బకాయిల సంగతి తరువాత చూద్దామని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. పాత బకాయిలతో కలిపి దాదాపు రూ.3,500 కోట్లు రావలసి ఉందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు పక్కకు వెళ్లాయి. గత ఏడాది (2021-22), ఈ ఏడాది (2022-23)తోపాటు పరిపాలన ఖర్చులకు కలిపి మొత్తం రూ.1,370.15 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ రాష్ట్రానికి సోమవారం సమాచారం పంపింది. ఈ నిధులు ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద సుమారు రూ.400 కోట్లు జమ చేసి చెల్లించాలి. మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రాష్ట్రానికి భారీగా నిధులు రాబట్టే ఉద్దేశంతో పెద్దఎత్తున గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, పాల శీతలీకరణ కేంద్రాల భవనాల పనులు ప్రారంభించారు. ఊహించని రీతిలో కేంద్రం పాత బకాయిలను విడుదల చేయకపోవడం, ఈ ఏడాది నుంచి మెటీరియల్‌ నిధులు తగ్గనుండటంతో ప్రభుత్వ అంచనాలు తలకిందులవుతున్నాయి.

మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు తొలుత చెల్లించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్రం నుంచి నిధులు విడుదలైన 15 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను కూడా జమ చేసి చెల్లించాలని సూచించింది. నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లించరాదని కేంద్రం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని