YS Vijayamma: వైఎస్‌ విజయమ్మకు తప్పిన ప్రమాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి విజయమ్మకు కర్నూలు శివారులో 44వ నంబరు జాతీయ రహదారిపై గురువారం పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా

Updated : 12 Aug 2022 05:54 IST

పేలిన కారు టైర్లు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి విజయమ్మకు కర్నూలు శివారులో 44వ నంబరు జాతీయ రహదారిపై గురువారం పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా గుత్తిలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆమె కుటుంబసభ్యులతో కలిసి తిరిగి హైదరాబాద్‌ బయలుదేరారు. మార్గమధ్యలో కర్నూలు నగరం బి.క్యాంపులో ఉంటున్న డాక్టర్‌ అయ్యపురెడ్డి (వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి స్నేహితుడు) ఇంటికి వెళ్లాలనుకున్నారు. కర్నూలు శివారులోని ఆర్టీసీ కాలనీ వద్దకు చేరుకోగానే కారు ఎడమవైపు ఉన్న రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. వాహనం పరిమిత వేగంతో వెళ్తుండటంతో డ్రైవర్‌ బాబు అప్రమత్తమై వెంటనే పక్కకు నిలిపారు. తర్వాత ఎస్కార్ట్‌ వాహనంలో ఆమె అయ్యపురెడ్డి ఇంటికి వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను పరామర్శించారు. కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్‌, కాటసాని రాంభూపాల్‌రెడ్డికి సమాచారం ఇవ్వగా వారు వాహనాన్ని పంపారు. అనంతరం ఆమె ఏపీఎస్పీ రెండో పటాలంలోని అతిథిగృహానికి వెళ్లారు. ఈలోపు కర్నూలు నాలుగో పట్టణ సీఐ శంకరయ్య వాహనం టైర్లు మార్పించగా విజయమ్మ అదే వాహనంలో హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఈ వాహనం ఆరు నెలల క్రితమే కొనుగోలు చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని