గోదావరికి వీడని వరద

గోదావరి ప్రవాహ ఉద్ధృతి కొద్దిగా తగ్గినా.. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద మాత్రం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది.

Published : 14 Aug 2022 05:28 IST

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

ఈనాడు, అమలాపురం- న్యూస్‌టుడే-చింతూరు, ఎటపాక, కూనవరం: గోదావరి ప్రవాహ ఉద్ధృతి కొద్దిగా తగ్గినా.. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద మాత్రం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం 15.10 అడుగులున్న బ్యారేజీ నీటిమట్టం రాత్రి 8 గంటలకు 14.90 అడుగులకు తగ్గింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో కడలికి 14,74,377 క్యూసెక్కులను వదిలారు. వరద ఉద్ధృతితో గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో లోతట్టు భూములు జలమయమయ్యాయి. పి.గన్నవరం, మామిడికుదురు, ఐ.పోలవరం, సఖినేటిపల్లి, ఐ.పోలవరం మండలాల్లో లంక గ్రామాలచుట్టూ వరద చేరడం, కాజ్‌వేలు నీట మునగడంతో రాకపోకలకు ఆటంకమేర్పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు ప్రాంతాల్లో రహదారులపైకి వచ్చిన వరద నీరు ఇంకా తగ్గలేదు. దీంతో ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచాయి. వారం రోజులుగా అంతకంతకూ పెరుగుతూ వచ్చిన వరద శుక్రవారం సాయంత్రం భద్రాచలంవద్ద 52 అడుగుల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అనంతరం రాత్రి నుంచి నెమ్మదిగా తగ్గుముఖం పట్టినప్పటికీ వేలేరుపాడు మండలంలోని 30 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.


పరిహారం కోసం ఆందోళన

తమ గ్రామాలను 41.5 కాంటూరులో చేర్చి పరిహారం ఇప్పించాలని వరద బాధితులు ఆందోళన చేపడుతున్నారు. కూనవరం మండలం కోతులగుట్ట, నర్సింగపేట, టేకుబాక, కూటూరు గ్రామాల్లో ముంపు బాధితులు వరద నీటిలో నిరసన తెలిపారు. ఏటా వరదలతో ఇబ్బంది పడుతున్నామని, తమకు పరిహారం అందిస్తే వేరే ప్రాంతానికి వెళ్లిపోతామని వివరించారు.


వైద్యం అందక గిరిజనుడి మృత్యువాత

వేలేరుపాడు, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తూర్పుమెట్ట గ్రామానికి చెందిన గిరిజనుడు చిచ్చడి కన్నయ్య (56) వైద్యం అందక శనివారం మృతిచెందారు. ఆయన 2రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆశా కార్యకర్త ఇచ్చిన మందు బిల్లలు వేసుకున్నారు. జ్వరం తగ్గకపోవడంతో శుక్రవారం రెండుసార్లు మూర్ఛ వచ్చింది. శనివారం ఉదయం సమీపంలోని కొత్తూరు గ్రామంలోని గ్రామీణ వైద్యుడిని తీసుకొచ్చి వైద్యం చేయించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇంటి వద్దే చనిపోయారు. మృతదేహాన్ని ఖననం చేసేందుకు స్థలం లేక గుట్టపైనున్న చెట్లను తొలగించి గుంతలో పూడ్చిపెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని