సేవలు మృగ్యం.. నిలవని ప్రాణం!

ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తిని రక్షించుకోవాలని ప్రభుత్వాసుపత్రికి తీసుకొస్తే ఐసీయూలో కాదుకదా.. కనీసం మెడికల్‌ వార్డులోనూ పడక కేటాయించలేని దయనీయ స్థితి కాకినాడ జీజీహెచ్‌లో కనిపించింది. తూర్పుగోదావరి జిల్లా

Published : 19 Aug 2022 04:18 IST

ఈనాడు, కాకినాడ: ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తిని రక్షించుకోవాలని ప్రభుత్వాసుపత్రికి తీసుకొస్తే ఐసీయూలో కాదుకదా.. కనీసం మెడికల్‌ వార్డులోనూ పడక కేటాయించలేని దయనీయ స్థితి కాకినాడ జీజీహెచ్‌లో కనిపించింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడికి చెందిన గుణ్నం సాయిరాం (25) పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తొలుత రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మెరుగైన చికిత్సకు బుధవారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. అత్యవసర విభాగంలో ప్రాథమిక చికిత్స చేశాక.. ఐసీయూలో వైద్యం చేయాల్సి ఉన్నా పడకలు ఖాళీ లేక మూడో మెడికల్‌ వార్డులోకి తరలించారు. ఇక్కడ ఎదురైన పరిస్థితులు సాయిరాం తల్లిదండ్రులను మరింత వేదనకు గురిచేశాయి. అప్పటికే వార్డులో బెడ్లన్నీ నిండిపోయాయి. ఒక్కో దానిపై ఇద్దరేసి చికిత్స పొందుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో స్పృహలో లేని సాయిరాంను మంచాల మధ్యే పడుకోబెట్టి చికిత్స అందించారు. దీంతో సెలైన్‌ పైపు సరిగ్గా అందక కదిలినప్పుడల్లా ఊడిపోయి రక్తం బయటికి రావడంతో అది చూసి రాత్రంతా తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మంచాల మధ్య ఉండటంతో గాలి ఆడటం లేదని వారే ఓ పంకాను ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న సాయిరాం గురువారం మధ్యాహ్నం 12.40 గంటలకు మృతి చెందాడు. ఈ హృదయవిదారక ఘటన చూసి ఆ వార్డు ఉన్నవారు కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకటబుద్ధ వద్ద ప్రస్తావించగా ‘ఐసీయూలో పడకలు ఖాళీ లేక వార్డులోకి తరలించాం. ఆసుపత్రిలో 1,150 పడకలు ఉండగా ప్రస్తుతం 1,450 మంది చికిత్స పొందుతున్నారు. సీజనల్‌ వ్యాధుల వల్ల ఎక్కువ మంది వస్తుండటంతో ఒక పడకపై ఇద్దరికి చికిత్స అందించాల్సి వస్తోంది’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని