వచ్చే నెలలో ప్రయోగాత్మకంగా ‘ఫ్యామిలీ ఫిజీషియన్‌’

రాష్ట్రంలో ‘ఫ్యామిలీ ఫిజీషియన్‌’ విధానాన్ని వచ్చే నెల మొదటి వారంలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో ప్రారంభించాలని లక్ష్యంగా

Published : 19 Aug 2022 04:18 IST

సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో అమలు
‘మెంటార్లు’గా వైద్య కళాశాలలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ‘ఫ్యామిలీ ఫిజీషియన్‌’ విధానాన్ని వచ్చే నెల మొదటి వారంలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయానికి అనుగుణంగా 10,032 ఉప ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికి అనుబంధంగా మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, ఒక ఏఎన్‌ఎం, ఇద్దరు లేదా ముగ్గురు ఆశాలు పనిచేస్తున్నారు. గ్రామంలోని గర్భిణులు, బాలింతలు, రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధులతో బాధపడే వారికి చికిత్స అందుతుంది. ఈ పథకం ద్వారా 80% సేవలు గ్రామాల్లోనే అందుబాటులోకి వస్తాయి. పీహెచ్‌సీల్లో ప్రస్తుతం ఉన్న ఇద్దరు వైద్యుల్లో ఒకరు సంచార వైద్యశాల (ఎంఎంయూ)ల ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లోని ఉప ఆరోగ్య కేంద్రాల వద్దకు వెళ్లి రోగులకు చికిత్స అందిస్తారు. 67 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి’ అని కృష్ణబాబు తెలిపారు.

నవంబరు నాటికి అదనంగా మరో 434 ఎంఎంయూలు

‘ప్రస్తుతం రాష్ట్రంలో 656 మొబైల్‌ మెడికల్‌ యూనిట్స్‌ (ఎంఎంయూలు) ఉన్నాయి. మరో 434 వాహనాలు నవంబరు నెలాఖరుకు అందుబాటులోకి వస్తాయి. డిసెంబరు నుంచి ప్రతి గ్రామంలో నెలకు రెండుసార్లు చొప్పున ఈ వాహనాలు తిరుగుతాయి. తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమైన వారికి, ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి కూడా ఎంఎంయూల ద్వారా చికిత్స అందుతుంది. వైద్యుడు పాఠశాలలకు కూడా వెళ్లి విద్యార్థులను పరీక్షిస్తారు. వైద్యులకు సెల్‌ఫోన్లు అందజేసి, ఆ నంబర్లను సచివాలయాల ద్వారా ప్రజలకు తెలియపరుస్తాం. కొత్తగా రానున్న 176 పీహెచ్‌సీల్లో అవసరమైన వైద్యుల నియామక ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తాం. కొత్తగా వచ్చే వైద్య కళాశాలల ప్రాంగణాల్లోనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కార్యాలయాలు ఉంటాయి. ప్రస్తుతం జిల్లాల్లో ముగ్గురు హెచ్‌వోడీల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇవి రెండు కావచ్చు. పరిశీలన జరుగుతోంది. వైద్య కళాశాలలు జిల్లాల్లో జరిగే వైద్య శాఖ కార్యకలాపాలకు మెంటార్లుగా ఉంటాయి’ అని కృష్ణబాబు వివరించారు. విలేకర్ల సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్‌, ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts