ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అభాండాలు

‘కాగ్‌ తన నివేదికలో 2020-21 ఆర్థిక సంవత్సరంతో పాటు 2015-16 నుంచి చోటు చేసుకున్న ఆర్థిక వ్యవహారాలపైనా వ్యాఖ్యలు చేసింది. తెదేపా హయాంలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను

Updated : 24 Sep 2022 12:41 IST

ఎఫ్‌ఆర్‌బీఎం ఉల్లంఘించింది తెదేపానే

ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

ఈనాడు, అమరావతి: ‘కాగ్‌ తన నివేదికలో 2020-21 ఆర్థిక సంవత్సరంతో పాటు 2015-16 నుంచి చోటు చేసుకున్న ఆర్థిక వ్యవహారాలపైనా వ్యాఖ్యలు చేసింది. తెదేపా హయాంలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ఉల్లంఘించి రూ.17వేల కోట్లు అధికంగా అప్పు చేస్తే దాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తప్పు పట్టింది. ఇప్పుడు మా హయాంలో అప్పులు చేయకూడదని నిర్దేశించింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువగా ఎవరు అప్పులు చేశారో ప్రజలు గ్రహించలేరనుకుంటున్నారా’’ అని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభాండాలు వేస్తున్నారని, ప్రత్యేక బిల్లుల్లో నగదు లావాదేవీలు జరగబోవని, అది కేవలం పుస్తకాల్లో సర్దుబాట్లేనని ఆయనకు తెలుసునని కూడా బుగ్గన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘2018-19లో రూ.98,049 కోట్లను ప్రత్యేక బిల్లుగా చూపించిన విషయం యనమల మరచిపోయారా? అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నది ఆయనే కదా’ బుగ్గన అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన లావాదేవీల నిబద్ధతను కాగ్‌ ప్రశ్నించనే లేదన్నారు. కేవలం విధానపరమైన విషయంలో మాత్రమే వారు అభ్యంతరం లేవనెత్తారని చెప్పారు. సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థలో ప్రాథమిక లోపాల వల్లే ప్రత్యేక బిల్లుల ప్రక్రియ చేపట్టవలసి వచ్చిందన్నారు. కాగ్‌ నివేదికలో రూ.8,891 కోట్ల మంజూరుకు సంబంధించి ఎలాంటి ఆర్డరూ లేకుండానే కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి డెబిట్‌ అయ్యాయనేది మరో అంశంగా పేర్కొంటూ దీనికి కాగ్‌కు వివరణ కూడా ఇచ్చామని బుగ్గన తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో సింగిల్‌ నోడల్‌ అకౌంట్‌ విధానం అమల్లోకి రావడం వల్ల ఇలాంటి లావాదేవీలు చేయాల్సిన అవసరం ఉండదని కూడా పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన ప్రొవిజన్‌ మేరకే పంచాయతీల విద్యుత్తు బకాయిలకు ఆ నిధులు వాడుకున్నామని వివరించారు. తాము చేసిన పనిని కేంద్ర ఆర్థికశాఖ కూడా సమర్థించిందని తెలిపారు. 2021-22లో కరోనా వల్ల అతి తక్కువ వృద్ధి రేటు నమోదైందన్నారు. కాగ్‌ కూడా ఆ విషయం ప్రస్తావించిందని బుగ్గన వెల్లడించారు. ద్రవ్యలోటు 39 శాతం నుంచి 59 శాతానికి చేరిందని యనమల చెబుతున్న లెక్కలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో కూడా తెలియదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని