ఏళ్లుగా అందని ‘ప్రోత్సాహకం’

రాష్ట్రంలో ప్రోత్సాహక రాయితీలకు సంబంధించి సుమారు 25 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క పల్నాడు జిల్లాలోనే 900 మంది పారిశ్రామిక వేత్తలు ప్రోత్సాహక రాయితీ కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం

Published : 26 Sep 2022 04:38 IST

పెండింగ్‌లో సుమారు  25 వేల దరఖాస్తులు

వేల పరిశ్రమల జాడ దొరకని పరిస్థితి

ఈనాడు, అమరావతి : రాష్ట్రంలో ప్రోత్సాహక రాయితీలకు సంబంధించి సుమారు 25 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క పల్నాడు జిల్లాలోనే 900 మంది పారిశ్రామిక వేత్తలు ప్రోత్సాహక రాయితీ కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఈ నిధులు నిర్దేశిత వ్యవధిలో అందక పరిశ్రమల నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో నిర్వహణ భారంగా మారి పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఒక జిల్లాలో వివిధ పరిశ్రమల నిర్వాహకుల నుంచి సుమారు వెయ్యి దరఖాస్తులు పరిశ్రమల శాఖకు అందాయి. కొన్నేళ్లుగా అవి పెండింగ్‌లో ఉన్నాయి. వాటి ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు పరిశీలించగా సమారు 700 పరిశ్రమల జాడ దొరకలేదు. అంటే.. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం అందుకోకుండానే అవి మూతపడ్డాయి. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ఓ వైపు ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఏళ్ల కిందట పరిశ్రమలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు ప్రోత్సాహకాల కోసం జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.

కమీషన్‌ ఇస్తేనే?

పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలను అందిస్తుంది. పరిశ్రమల శాఖ నిబంధన ప్రకారం పరిశ్రమ ఉత్పత్తిలోకి వచ్చిన 6 నెలల్లోగా ప్రోత్సాహక రాయితీ కోసం ఆ శాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం, బీసీ మహిళలకు 35 శాతం, ఇతరులకు 25 శాతం పెట్టుబడి రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత 45 రోజుల్లోగా పరిశీలించి పరిశ్రమల ప్రోత్సాహక అధికారి విచారణ జరపాలి. పరిశ్రమల నిర్వాహకులు దాఖలు చేసిన బిల్లుల ప్రకారం యంత్రాలు ఉన్నాయా? వాటికి వెచ్చించిన మొత్తం వాస్తవమేనా? పరిశీలించి రాయితీ అర్హతను నిర్ణయిస్తారు. ఈ ప్రతిపాదనలను జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి (డీఐఈపీసీ) సమావేశంలో ఆమోదించి.. రాష్ట్ర పరిశ్రమల శాఖకు పంపుతుంది. వీటి ఆధారంగా ప్రోత్సాహకాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. పెట్టుబడి రాయితీ కోసం 10-15 శాతం కమీషన్‌ను అధికారులకు ముట్టజెబితేనే ఆన్‌లైన్‌లో దస్త్రం కదులుతోందని కొందరు పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్త జిల్లాల నేపథ్యంలో మళ్లీ పరిశీలన

ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న పెండింగ్‌ దరఖాస్తులను కొత్త జిల్లా సరిహద్దుల ప్రకారం విభజిస్తున్నారు. దీని ప్రకారం ప్రతి జిల్లాలో కనీసం వెయ్యి అంతకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి ప్రస్తుత పరిస్థితి తెలుసుకోడానికి మళ్లీ పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో కొన్ని యూనిట్ల జాడ తెలియడం లేదు. కొన్ని యూనిట్లు మూతపడ్డాయి. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి పేర్కొన్నారు. పరిశీలన పూర్తి చేసిన దరఖాస్తులను ప్రోత్సాహకాల చెల్లింపు కోసం ఆన్‌లైన్‌ చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts