Telangana News: ‘షెడ్యూల్‌ 9’ సంస్థల విభజన వద్దు

రాష్ట్ర విభజన సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర సర్కారు ఎదుట గట్టి వాదనలు వినిపించింది. హెడ్‌క్వార్టర్‌ అన్న అంశానికి కోర్టు నుంచి స్పష్టమైన నిర్వచనం వెల్లడయ్యేంతవరకు షెడ్యూల్‌ 9లోని సంస్థల విభజన జోలికి వెళ్లకూడదని కోరింది.

Updated : 28 Sep 2022 06:57 IST

 కోర్టు స్పష్టత ఇచ్చేంతవరకు ఆ అంశం జోలికి వెళ్లవద్దు

‘షెడ్యూల్‌ 10’ సంస్థలను ప్రాంత ప్రాతిపదికన పంచాల్సిందే

11 ‘విభజన అంశాల’పై తెలంగాణ గట్టి వాదనలు

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర విభజన సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర సర్కారు ఎదుట గట్టి వాదనలు వినిపించింది. హెడ్‌క్వార్టర్‌ అన్న అంశానికి కోర్టు నుంచి స్పష్టమైన నిర్వచనం వెల్లడయ్యేంతవరకు షెడ్యూల్‌ 9లోని సంస్థల విభజన జోలికి వెళ్లకూడదని కోరింది. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి షెడ్యూల్‌ 10లోని సంస్థలను ప్రాంత (లొకేషన్‌) ప్రాతిపదికన, వాటి నగదును జనాభా ప్రాతిపదికన పంచుకోవడానికి తాము సిద్ధమేనని, అందుకు విరుద్ధమైతే అంగీకరించబోమని స్పష్టం చేసింది. దిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. సుమారు 1.50 గంటలపాటు జరిగిన ఈ సమావేశ ఎజెండాలోని 11 అంశాలపై తన వాదనలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగా, ఏపీ సర్కారు మాత్రం వెల్లడించలేదు. తెలంగాణ లేవనెత్తిన అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తగు సూచనలు చేశారు. కొన్నిటిని న్యాయశాఖ పరిశీలనకు పంపాలని తమ సిబ్బందిని ఆదేశించారు. తెలంగాణ బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వం వహించారు. ఇంధన, ఆర్థికశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్‌శర్మ, కె.రామకృష్ణారావు, పరిశ్రమలు వాణిజ్యశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, రహదారులు- భవనాలశాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, సింగరేణి డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, దిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు.

ఇవీ తెలంగాణ వాదనలు

1. షెడ్యూల్‌ 9లోని సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీల విభజన: విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9లో ఉన్న 91 సంస్థలను విభజించాల్సి ఉంది. షీలా భిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ 90 సంస్థలకు సంబంధించి సిఫార్సులు చేసింది. ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాన్ని హెడ్‌క్వార్టర్‌గా పరిగణించనున్నట్లు 2017 మే నెలలో కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం షీలా భిడే కమిటీ సిఫార్సులను పూర్తిస్థాయిలో ఆమోదించాలని కోరింది. కొన్ని సంస్థలకు సంబంధించిన కేసులు కోర్టులో ఉన్నందున అవి పరిష్కారమయ్యేవరకు తదుపరి చర్య తీసుకోవడం సాధ్యం కాదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. హెడ్‌క్వార్టర్‌ అంశం కూడా కోర్టు ముందున్నట్లు తెలిపింది.

* షెడ్యూల్‌ 9లోని సంస్థ ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్రహోంశాఖకు కానీ ఎలాంటి న్యాయ పరిధీ లేదని ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కేసులో హైకోర్టు చెప్పిన విషయాన్ని తెలంగాణ అధికారులు గుర్తుచేశారు.

2. ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఏపీఎస్‌ఎఫ్‌సీ): ఈ సంస్థ పాలకమండలిని పునర్వ్యవస్థీకరించాలని తెలంగాణ ప్రభుత్వం 2016 మే నెలలోనే కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేసినా అది జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన పాలకమండలి ఏకపక్షంగా ఈ సంస్థ విభజన ప్రణాళికను తయారుచేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ఈ సంస్థకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న 238 ఎకరాల భూమిని తెలంగాణ స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 2015 నవంబరులో హైకోర్టు దీనిపై యథాతథ (స్టేటస్‌కో) ఉత్తర్వులిచ్చింది.

3. 10వ షెడ్యూల్‌లోని ఆస్తుల విభజన: పదో షెడ్యూల్‌లో 142 సంస్థలున్నాయి. ఏపీ ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ సంస్థల నగదు నిల్వలను జనాభా నిష్పత్తి ప్రకారం, ఆస్తులను అవి ఉన్న ప్రాంతం ప్రకారం పంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం మౌఖిక ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కేంద్ర హోంశాఖ జారీచేసిన ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలి తప్ప, పునస్సమీక్షించడానికి వీల్లేదు.

4. సింగరేణి బొగ్గు గనులు, ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ విభజన: సింగరేణిలోని 51% ఈక్విటీ తెలంగాణకు దక్కుతుందని విభజన చట్టంలోనే ఉన్నందున దాని ఆస్తుల విభజన ప్రశ్నే తలెత్తదని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ హెవీ మెషినరీ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ సింగరేణికి అనుబంధ సంస్థగా ఉన్నందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఈక్విటీని మాత్రమే విభజించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

5.ఏపీ పౌరసరఫరాల సంస్థకు బకాయిలు: పౌరసరఫరాల కార్పొరేషన్‌ విభజనకు ముందు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఉపయోగించుకున్న క్యాష్‌క్రెడిట్‌ బకాయి అంశంపై వివాదం ఉంది. కేంద్రం విడుదల చేసే ఆహారసబ్సిడీ మొత్తాన్ని తెలంగాణకు బదిలీ చేస్తామని ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్‌ హామీ ఇస్తేనే ఆ క్యాష్‌ క్రెడిట్‌కు సంబంధించిన అసలును చెల్లిస్తామని తెలంగాణ షరతు విధించింది.

6. చట్టంలో చెప్పని సంస్థల విభజన: చట్టంలో ఎక్కడా పేర్కొనని 12 సంస్థలను విభజించాలని ఏపీ ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రస్తావించింది. అందుకు తెలంగాణ అభ్యంతరం చెబుతూ.. అలా చేస్తే చట్టాన్ని సవరించినట్లవుతుందని అభ్యంతరం తెలిపింది.

7. క్యాష్‌, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ విభజన: కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఉమ్మడి సంస్థల ఖర్చులు, విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాల పంపిణీపై కాగ్‌ సాయం తీసుకోవడానికి రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి.

8. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదలలో జాప్యం: తెలంగాణ విజ్ఞప్తి మేరకు ఆ నిధులను విడుదల చేయాలని హోంశాఖ కార్యదర్శి ఆర్థికశాఖ అధికారులకు సూచించారు.

9. గిరిజన విశ్వవిద్యాలయం: గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయాన్ని తెలంగాణ ప్రధాన కార్యదర్శి ప్రస్తావించారు. ఇందుకు భూమిని కూడా కేటాయించినట్లు తెలిపారు.

10. రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ: రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 150 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలంగాణ ప్రతినిధులు తెలిపారు.

11. పన్ను విషయాల్లో లోపాల దిద్దుబాటు: విభజన చట్టంలోని సెక్షన్‌ 50, 51, 56 కింద ఉన్న పన్ను విషయాల్లోని లోపాలను సరిదిద్దుతూ విభజన చట్టాన్ని సవరించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత చట్టాన్ని సవరించడం కుదరదని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని