చదువును ప్రోత్సహించేలా పథకాలు

రాష్ట్రంలో పిల్లల చదువులను ప్రోత్సహించేలా, బాల్య వివాహాలను నిరోధించేలా వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను రూపొందించామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

Updated : 01 Oct 2022 06:13 IST

కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్‌

ఆరోగ్యశ్రీ చికిత్సలను 3,254కు పెంచినట్లు వైద్య, ఆరోగ్యశాఖ సమీక్షలో వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పిల్లల చదువులను ప్రోత్సహించేలా, బాల్య వివాహాలను నిరోధించేలా వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను రూపొందించామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం ఈ రెండు పథకాలను ప్రారంభించి, మాట్లాడారు. ‘కల్యాణమస్తు, షాదీ తోఫా ప్రోత్సాహకాలను పొందాలనుకునే వధూవరులిద్దరూ కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన పెట్టడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తారు. పెళ్లి నాటికి అమ్మాయి వయసు 18 ఏళ్లు, అబ్బాయి వయసు 21 ఏళ్లు దాటి ఉండాలన్న నిబంధనతో బాల్య వివాహాలనూ నిరోధించొచ్చు. గత ప్రభుత్వంలో పెళ్లి కానుక పథకాన్ని ప్రకటించి 2018లో ఆపేశారు. 17,709 మంది లబ్ధిదారులకు రూ.68.68 కోట్ల వివాహ ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మా ప్రభుత్వం అర్హులైన వారందరికీ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం ప్రకటించిన దాని కన్నా ఇప్పుడు రెట్టింపు వివాహ ప్రోత్సాహం అందుతుంది. కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. పెళ్లైన 60 రోజుల్లో వాలంటీర్ల సాయంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన వారికి ప్రతి మూడు నెలలకోసారి పథకాన్ని వర్తింపజేస్తాం. అక్టోబరు, నవంబరు, డిసెంబరులో దరఖాస్తులు చేసుకునే లబ్ధిదారులకు జనవరిలో సాయం అందిస్తాం. ఇలా ప్రతి మూడు నెలలకోసారి అర్హులను గుర్తించి ప్రోత్సాహకాలు అందజేయనున్నాం. వివాహ ధ్రువీకరణ పత్రాలూ సచివాలయాల్లోనే జారీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

‘ఆరోగ్యశ్రీ’లోకి కొత్త సేవలు: వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ జాబితాలో కొత్త చికిత్సలను ముందుగా పేర్కొన్నట్లు అక్టోబరు 5కు బదులు 15 నుంచి అమల్లోకి తేవాలని సీఎం జగన్‌ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుతున్న 2,446 చికిత్సల సంఖ్యను 3,254కు పెంచనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్షలో సీఎం ప్రకటించారు. ‘‘ఆరోగ్యశ్రీ జాబితాలోకి కొత్త చికిత్సల చేరిక దాదాపు ఖరారైంది. కొన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. పెరిగిన చికిత్సల సంఖ్యతో ఏటా ఆరోగ్యశ్రీ కింద రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీంతో పాటు ‘ఆరోగ్య ఆసరా’ కింద రూ.300 కోట్లు, 108, 104ల కోసం రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్‌ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తాం. వైద్య కళాశాలల నిర్మాణ పనులనూ వేగవంతం చేయాలి. పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాన్ని నవంబరు నాటికి పూర్తి చేయాలి’’ అని అధికారులను ఆదేశించారు.

రోగుల ఆహార ఛార్జీల పెంపు
‘‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇచ్చే ఆహార ఛార్జీలను పెంచుతున్నాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం చేరే వారితో సమానంగా రోజుకు రూ.100 ఆహార ఛార్జీల కింద చెల్లిస్తాం. జూనియర్‌ డాక్టర్లకు ఇచ్చే ఉపకార వేతనాన్ని పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కింద ప్రకటించిన 10 అవార్డుల్లో 6 రాష్ట్రానికి వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి (కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె నివాస్‌, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీఎస్‌ నవీన్‌కుమార్‌, రాష్ట్ర వైద్య విధాన పరిషత్తు కమిషనర్‌ వినోద్‌కుమార్‌, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని