దుకాణాలన్నీ కొనసాగిస్తుంటే.. మద్యనిషేధం ఇంకెప్పుడు?

రెండేళ్లకో, మూడేళ్లకో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మన ప్రభుత్వంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం. 5 నక్షత్రాల హోటళ్లు మినహా ఇంకెక్కడా మద్యం లభించకుండా చేస్తాం.

Updated : 01 Oct 2022 07:52 IST

దుకాణాలు మరో ఏడాది యథాతథం

వరుసగా మూడో ఏడాదీ వాటి సంఖ్య తగ్గింపు ఊసే లేదు

పర్యాటక కేంద్రాల్లో లిక్కర్‌ అవుట్‌లెట్లు, వాకిన్‌ షాప్‌ల ఏర్పాటుకు అనుమతి

ఇప్పుడున్న వాటికి ఇవి అదనం!

2022-23కు విధానం ఖరారు చేసిన ప్రభుత్వం

ఈనాడు - అమరావతి

రెండేళ్లకో, మూడేళ్లకో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మన ప్రభుత్వంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం. 5 నక్షత్రాల హోటళ్లు మినహా ఇంకెక్కడా మద్యం లభించకుండా చేస్తాం.

- ప్రతిపక్ష నేత హోదాలో విజయవాడలో 2015 డిసెంబరు 8న విలేకర్లతో జగన్‌ మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు

కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే మేం అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ఆ తర్వాత కేవలం 5 నక్షత్రాల హోటళ్లలోనే మద్యం దొరికేలా చేస్తాం.

- 2019 ఎన్నికల ప్రణాళికలో వైకాపా హామీ

మద్యంపై వచ్చే ఆదాయాన్ని ఒకేసారి పూర్తిగా తీసేయలేం. అందుకే దశలవారీ మద్యనిషేధం అమలు చేస్తాం. దానిపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తాం. 2024 ఎన్నికల నాటికి కేవలం 5 నక్షత్రాల హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తాం. ఆ తర్వాతే ఓట్లడుగుతాం.

- ఎన్నికల్లో గెలిచాక దిల్లీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో 2019 మే 26న జగన్‌

మద్యనిషేధం హామీకి వైకాపా ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. మన ప్రభుత్వంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని ప్రతిపక్ష నేత హోదాలోనూ, దశలవారీ మద్యనిషేధాన్ని అమలు చేస్తామని ఎన్నికల్లో గెలిచాక దిల్లీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఇప్పుడు నాలుక మడతేసి అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మద్యనిషేధానికి నీళ్లొదిలేసినట్లేనని తన చర్యల ద్వారా చెప్పకనే చెబుతున్నారు. 2022-23కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఖరారు చేసిన నూతన మద్యం విధానమే అందుకు తార్కాణం. ఇప్పుడున్న మద్యం దుకాణాల సంఖ్య ఒక్కటి కూడా తగ్గించకుండా వాటన్నింటినీ మరో ఏడాది యథాతథంగా కొనసాగిస్తామని తాజాగా ప్రకటించింది. ఈ విధానం నేటి నుంచి 2023 సెప్టెంబరు 30 వరకూ అమల్లో ఉంటుందని ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

తొలి ఏడాదే తగ్గింపు.. తర్వాత ఆ ఊసే లేదు
* వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకూ ఏడాదికి ఒకటి చొప్పున నాలుగుసార్లు మద్యం విధానాల్ని ఖరారు చేసింది. అయితే మద్యం దుకాణాల సంఖ్య తగ్గింపు మాత్రం తొలి ఏడాదికే పరిమితమైంది. తర్వాత ఆ ఊసే లేదు. 2020 మార్చి 22 నుంచి ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క మద్యం దుకాణాన్ని కూడా తగ్గించలేదు. తాజా ఉత్తర్వుల ప్రకారం మరో ఏడాది కూడా ఇప్పుడున్న దుకాణాల సంఖ్యలో మార్పు ఉండదు. దశలవారీ మద్యనిషేధం అంటే ఏటా దుకాణాల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ వెళ్లాలి. కానీ అలా చేయలేదు.

* వైకాపా అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో నాటికి 4,380 మద్యం దుకాణాలు ఉండేవి. 2019 అక్టోబరు 1 నుంచి 2020 వరకూ అమలైన విధానంలో వాటిని 3,500కు తగ్గించింది. 2020 మార్చి 22 వరకూ అవి అలాగే కొనసాగాయి. మొదటి దశ లాక్‌డౌన్‌ తర్వాత 2020 మే నెలలో వాటి సంఖ్యను 2,934కు తగ్గించింది. ఆ తర్వాత నుంచి తగ్గింపు అనే మాటే లేదు.

* 2020 అక్టోబరు 1 నుంచి 2021 సెప్టెంబరు 30 వరకూ అమలైన విధానంలోనూ దుకాణాల సంఖ్యను తగ్గించలేదు. అంతకు ముందున్న 2,934 కొనసాగాయి. కొన్ని నెలల ముందే తగ్గించినందున మళ్లీ తగ్గించాల్సిన అవసరం లేదని అప్పట్లో ఎక్సైజ్‌ అధికారులు ప్రకటించారు.

* 2021 అక్టోబరు 1 నుంచి 2022 సెప్టెంబరు 30 వరకూ అమలైన విధానంలోనూ, తాజాగా 2023 సెప్టెంబరు 30 వరకూ కాలపరిమితితో ప్రకటించిన విధానంలో కూడా దుకాణాల తగ్గింపు ఊసే లేదు.

చిత్తశుద్ధి ఉంటే.. ఈపాటికే దాదాపు తగ్గాలి కదా!
జగన్‌ హామీ ఇచ్చినట్లు, వైకాపా ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్లు 2024 నాటికి స్టార్‌ హోటళ్లకే మద్యం పరిమితం కావాలంటే... ఏటా కనీసం 33 శాతం చొప్పున మద్యం దుకాణాలను తగ్గించుకుంటూ పోవాలి. వైకాపా అధికారంలోకి వచ్చి ఇప్పటికే మూడున్నరేళ్లయింది. ఆ లెక్కన చూసినా ఇప్పటికే దుకాణాలు నామమాత్రంగా ఉండాలి. కానీ తొలి ఏడాదిలో 33 శాతం మేర దుకాణాల తగ్గింపు మినహా ఆ దిశగా తగిన చర్యలు లేవు. శుక్రవారం ఖరారు చేసిన మద్యం విధానం 2023 సెప్టెంబరు 30 వరకూ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ప్రస్తుత వైకాపా ప్రభుత్వ కాలపరిమితి మరో ఆరేడు నెలలే ఉంటుంది. మద్యనిషేధంపై చిత్తశుద్ధి, సంకల్పం నిజంగా  ఉంటే తాజాగా ఖరారు చేసిన విధానంలోనే దుకాణాల సంఖ్యను గణనీయంగా తగ్గించి ఉండాలి. కానీ జగన్‌ ప్రభుత్వానికి అది పట్టలేదు. మద్యనిషేధం హామీకి తూట్లు పొడవటానికే ఇలా చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

పారదర్శకత, అక్రమాల నిరోధం మాటలు ఇప్పుడేమయ్యాయి?
‘ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనూ ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెడతాం. లావాదేవీల్లో పారదర్శకత, అక్రమాల నిరోధం కోసం డిజిటల్‌ చెల్లింపుల్ని అమలు చేస్తాం’ అని 2021-22 మద్యం విధానంలో ప్రభుత్వం పేర్కొంది. కానీ అమలు చేయలేదు. తాజాగా 2022-23కి ఖరారు చేసిన విధానంలో అసలు డిజిటల్‌ చెల్లింపుల ప్రస్తావనే లేదు. దీని ఆంతర్యమేంటి? అంటే ఇప్పుడు పారదర్శకత వద్దనా? అక్రమాల నిరోధం వద్దనా? ఎన్ని విమర్శలు వస్తున్నా సరే ప్రభుత్వం నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అందుబాటు తగ్గించాల్సింది పోయి.. ఎలైట్‌ షాపులా?
మద్యనిషేధం అంటే వీలైనంత వరకూ మద్యం అందుబాటును తగ్గించాలి. కానీ ప్రభుత్వ తీరు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. మద్యం వాకిన్‌  షాప్‌ (ఎలైట్‌ షాప్‌)ల పేరిట మద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకొస్తోంది. అంతకు ముందులాగే ఈ ఏడాది కూడా ఎలైట్‌ షాపులు పెట్టుకోవడానికి అనుమతిచ్చింది. అయితే వీటితో కలిపినా మొత్తం దుకాణాల సంఖ్య 2,934కు మించకూడదని పేర్కొంది. మరింత ఆదాయం రాబట్టుకోవటమే లక్ష్యంగా వాకిన్‌ షాపులకు మళ్లీ అనుమతిచ్చింది.

మద్యనిషేధమే లక్ష్యమైతే.. పర్యాటక కేంద్రాల్లో ఏర్పాటుకు ఎందుకు అనుమతిస్తున్నట్లు?
ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల సంఖ్యే యథాతథంగా కొనసాగుతుందని ఓవైపు చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు పర్యాటక కేంద్రాల్లో లిక్కర్‌ అవుట్‌లెట్లు, వాకిన్‌ షాప్‌ల ఏర్పాటుకు తాజా విధానంలో అనుమతిచ్చింది. అంటే మరిన్ని మద్యం దుకాణాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ అనుమతితో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. మద్యనిషేధమే ప్రభుత్వ లక్ష్యమైతే మరి వీటి ఏర్పాటుకు ఎందుకు అనుమతిస్తున్నట్లు? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని