63 స్థానాల్లో అంతమంది ఓటర్లా?

ఆంధ్రప్రదేశ్‌లోని 63 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసాధారణంగా ఓటర్లు ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో జనాభాతో పోలిస్తే ఉండాల్సిన ఓటర్ల సంఖ్య సాధారణానికి మించి ఉంది. రాష్ట్రంలో ప్రతి వెయ్యి జనాభాకు సగటున 724 మంది ఓటర్లున్నారు.

Updated : 10 Nov 2022 09:55 IST

జనాభాతో పోలిస్తే ఉండాల్సినవారి కంటే చాలా ఎక్కువ..
రాష్ట్రంలో ప్రతి వెయ్యి జనాభాకు 724 మంది ఓటర్లు
20 నియోజకవర్గాల్లో మాత్రం 800 మందికి పైగా నమోదు
మరో 43 నియోజకవర్గాల్లో 750 మందికి పైగా గుర్తింపు
అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని 63 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసాధారణంగా ఓటర్లు ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో జనాభాతో పోలిస్తే ఉండాల్సిన ఓటర్ల సంఖ్య సాధారణానికి మించి ఉంది. రాష్ట్రంలో ప్రతి వెయ్యి జనాభాకు సగటున 724 మంది ఓటర్లున్నారు. దీన్నే ఎలెక్టోర్‌ టూ పాపులేషన్‌ రేషియో (ఈఆర్‌) అంటారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుత జనాభా అంచనాలను బట్టి ఎన్నికల సంఘం ఈ లెక్క తేల్చింది. ఏ నియోజకవర్గంలోనైనా ఈఆర్‌ నిష్పత్తికి కొంచెం అటు, ఇటుగా ఓటర్లు ఉంటే పర్వాలేదు. కానీ 20 నియోజకవర్గాల పరిధిలో ప్రతి వెయ్యి జనాభాకు 800 మందికి పైగా ఓటర్లు ఉండగా, మరో 43 నియోజకవర్గాల్లో ప్రతి వెయ్యి జనాభాకు 750 మందికి పైగా ఉన్నారు. జిల్లాలవారీగా చూస్తే ఏడు జిల్లాల్లో ఈ నిష్పత్తి అసాధారణంగా ఉంది. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటూ.. ఓటర్ల నమోదు సహా అన్నింటా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. 63 నియోజకవర్గాల్లో అసాధారణంగా ఓటర్లు ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరపాలని డిమాండు చేస్తున్నాయి. నకిలీ ఓటర్లను ఏరివేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే.


పరిశీలించాలని ఆదేశించాం

- ముకేష్‌కుమార్‌ మీనా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

నాభాతో పోలిస్తే ఉండాల్సిన ఓటర్లు అసాధారణంగా ఉన్న నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ కేంద్రాల వారీగా ప్రత్యేకంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించాం. చనిపోయినవారి పేర్లు, వేరే చోటకు తరలిపోయిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించకపోవటంవల్లా ఎక్కువమంది ఓటర్లు ఉండొచ్చు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని