ఎవరి వెలుగులకీ విద్యుత్‌ బస్సులు?

ఆర్టీసీలో కొత్తగా 4 వేల విద్యుత్‌ ఏసీ బస్సులు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్తగా అవసరమైన బస్సులన్నింటినీ విద్యుత్‌ బస్సులే తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Published : 25 Nov 2022 05:40 IST

ఆర్టీసీలో 4 వేల వాహనాలు తీసుకునేందుకు ప్రణాళిక
అత్యధికంగా అద్దె ప్రాతిపదికనే
ఇప్పుడున్న ఏసీ బస్సులకు 50% దాటని ఓఆర్‌
ఈనాడు - అమరావతి

ఆర్టీసీలో కొత్తగా 4 వేల విద్యుత్‌ ఏసీ బస్సులు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్తగా అవసరమైన బస్సులన్నింటినీ విద్యుత్‌ బస్సులే తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాత బస్సుల స్థానంలో తక్షణమే కొత్తవి అవసరమని ప్రభుత్వానికి ఆర్టీసీ కొంతకాలం కిందట తెలిపింది. దీనిపై ఇటీవల సీఎం వద్ద సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ని బస్సులు అవసరమన్నది చర్చకు రాగా.. 4 వేలు వరకు తీసుకోవాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అవన్నీ విద్యుత్‌ ఏసీ బస్సులే తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని, తక్కువ ధరకు వస్తే కొన్ని కొనుగోలు చేద్దామని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ బస్సులను నాలుగు విడతలుగా తీసుకోవడంపై అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు.

హైవేలపైనే ఏసీ బస్సులు

కొత్తగా తీసుకోవాలనుకుంటున్న ఏసీ బస్సులను ప్రధాన మార్గాలు, హైవేలపై నడిచే సర్వీసుల స్థానంలో నడపాలని భావిస్తున్నారు. ఈ బస్సులు ఒకసారి పూర్తిస్థాయిలో ఛార్జింగ్‌ పెడితే 150 నుంచి 200 కి.మీ. వరకు నడిచేందుకు వీలుంటుంది. దీంతో ఓ జిల్లా పరిధిలో, రెండు జిల్లాల మధ్య నడిపేందుకు మాత్రమే వీలుంటుంది. ఇప్పటివరకు ఆ మార్గాల్లో ఉన్న ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ తదితర సర్వీసులను గ్రామీణ ప్రాంతాల్లో పల్లెవెలుగు రూట్లకు మళ్లించాలని ప్రణాళిక తయారు చేస్తున్నారు. మున్ముందు అవసరమైతే గ్రామాలకు కూడా ఏసీ సర్వీసులు నడిపే విషయంపైనా ఆలోచిస్తున్నారు.

ఎవరికి మేలు?

వేల సంఖ్యలో విద్యుత్‌ ఏసీ బస్సులు తీసుకోవడం ద్వారా ఎవరికి ప్రయోజనం కల్పించనున్నారు అనేది ప్రశ్నార్థకం అవుతోంది. కేంద్రం ఫేమ్‌-2 పథకం కింద ఆర్థిక సాయం చేయడంతో 350 విద్యుత్‌ ఏసీ బస్సులు అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని కొంత కాలం కిందట భావించారు. చివరకు 100 బస్సులు తీసుకున్నారు. వీటిలో ఇప్పటి వరకు తిరుపతి-తిరుమల మధ్య నడపాలనుకున్న 50 బస్సుల్లో 10 వచ్చాయి. అయితే ఇదేవిధంగా నాలుగు వేల విద్యుత్‌ బస్సులు తీసుకుంటే సంస్థకు ఆర్థికంగా తీవ్ర నష్టం తప్పదనే వాదన వినిపిస్తోంది. విద్యుత్‌ బస్సులు తయారుచేసే కంపెనీలు, అద్దెకు ఈ బస్సులు నడిపే కంపెనీలకు మాత్రమే మేలు కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉన్న వాటిలోనే ప్రయాణించే వారు తక్కువ..

ప్రస్తుతం ఆర్టీసీలో 350 వరకు వివిధ రకాల ఏసీ బస్సులు (డీజిల్‌ బస్సులు) ఉండగా, వీటిలో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం సగటున ఓఆర్‌ 50% కూడా దాటడంలేదు. వీటిలో ప్రయాణించే వారు మరీ తక్కువగా ఉండటంతో ఇటీవలే వివిధ జిల్లాల ఆర్టీసీ అధికారులు టికెట్‌ ఛార్జీల్లో రాయితీలు సైతం ఇచ్చారు. విజయవాడ నుంచి బెంగళూరు మధ్య తిరిగే ఏసీ సర్వీసుల్లో వారాంతం మినహా మిగిలిన రోజుల్లో 20%, విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో 10% రాయితీ ఇచ్చి ప్రయాణికులను ఆకట్టుకునే యత్నం చేశారు. దూర ప్రాంతాలకు తిరిగే ఏసీ బస్సులకే ప్రయాణికుల నుంచి అంతగా ఆదరణ లేకపోతే.. దగ్గర ప్రాంతాలకు తిరిగే సర్వీసుల్లో ఏసీ బస్సులను ప్రవేశపెడితే ఆర్టీసీకి నష్టం తప్పదనే వాదన వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని