సంక్షిప్త వార్తలు(4)

రాష్ట్ర ప్రభుత్వం కొందరు ఐఏఎస్‌ అధికారులను శనివారం బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కార్యనిర్వాహక సహాయకుడిగా, సాధారణ పరిపాలనశాఖలో ఉప కార్యదర్శిగా (సమన్వయం) పని చేస్తున్న ఎన్‌.తేజ్‌ భరత్‌ను తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టరుగా, అక్కడ ఉన్న శ్రీధర్‌ చామకూరిని భూపరిపాలన ప్రధాన కమిషనరు (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో విజిలెన్స్‌ విభాగం సంయుక్త కార్యదర్శిగా, ఆ పోస్టులో ఉన్న అపరాజిత సింగ్‌ సిన్సిన్వార్‌ను కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టరుగా, అక్కడ జేసీగా ఉన్న రావిరాల మహేష్‌ కుమార్‌ను పంచాయతీరాజ్‌శాఖ అదనపు కమిషనరుగా నియమించింది.

Updated : 27 Nov 2022 05:23 IST

ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొందరు ఐఏఎస్‌ అధికారులను శనివారం బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కార్యనిర్వాహక సహాయకుడిగా, సాధారణ పరిపాలనశాఖలో ఉప కార్యదర్శిగా (సమన్వయం) పని చేస్తున్న ఎన్‌.తేజ్‌ భరత్‌ను తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టరుగా, అక్కడ ఉన్న శ్రీధర్‌ చామకూరిని భూపరిపాలన ప్రధాన కమిషనరు (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో విజిలెన్స్‌ విభాగం సంయుక్త కార్యదర్శిగా, ఆ పోస్టులో ఉన్న అపరాజిత సింగ్‌ సిన్సిన్వార్‌ను కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టరుగా, అక్కడ జేసీగా ఉన్న రావిరాల మహేష్‌ కుమార్‌ను పంచాయతీరాజ్‌శాఖ అదనపు కమిషనరుగా నియమించింది. నంద్యాల సంయుక్త కలెక్టరు నారపురెడ్డి మౌర్య సెలవుపై వెళ్లారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న టి.నిశాంతిని ఆ స్థానానికి బదిలీ చేసింది. సెలవు నుంచి వచ్చిన తర్వాత సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా మౌర్యకు సూచించింది.


కేంద్ర సర్వీసుకు సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ కేంద్ర సర్వీసుకు వెళుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యదర్శిగా పని చేస్తున్న ఆయన కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగంలో సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఐదేళ్లపాటు ఆయన ఆ పోస్టులో కొనసాగుతారు.


యాంటీ బయాటిక్స్‌ కట్టడికి చర్యలు

ఈనాడు, అమరావతి: మితిమీరిన యాంటీ బయాటిక్స్‌ వినియోగం పేదలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని, వైద్య ఖర్చులనూ పెంచుతోందని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధిని తగ్గించే ప్రక్రియలో వీటి వాడకాన్ని చివరి ప్రయత్నంగా కాకుండా ఇష్టమొచ్చినట్లు వాడుతున్నారని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ‘యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌) నియంత్రణ... రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఖరారు’పై సదస్సు ముగింపు సమావేశంలో కృష్ణబాబు మాట్లాడారు. ‘ఔషధ దుకాణాల్లో మందు, మందుల చీటీ అధికారికంగా నమోదైనప్పుడే యాంటీబయాటిక్స్‌ విచ్చలవిడి వాడకాన్ని తగ్గించవచ్చు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఎంఆర్‌ కాల్‌ ఫర్‌ యాక్షన్‌’ పేరిట రూపొందించిన నివేదికను ఆవిష్కరించారు. సదస్సులో ఏఎంఆర్‌ కార్యాచరణ ప్రణాళిక బలోపేతానికి సంబంధించిన ‘విజయవాడ డిక్లరేషన్‌’ను విడుదల చేశారు.


ఇందూ ప్రాజెక్టు దివాలా ప్రక్రియలో ఎర్తిన్‌ అప్పీలు కొట్టివేత

ఈనాడు, హైదరాబాద్‌: ఇందూ ప్రాజెక్టు దివాలా ప్రక్రియలో రూ.500 కోట్లకు కంపెనీని దక్కించుకున్న ఎర్తిన్‌ కన్సార్షియానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎర్తిన్‌ సకాలంలో డబ్బు చెల్లించకపోవడంతో మరోసారి దివాలా ప్రక్రియ చేపట్టేందుకు ‘రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌’ చేసిన విజ్ఞప్తిని అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ శాఖ గతంతో ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ ఎర్తిన్‌ సంస్థ చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో అప్పీలుకు వెళ్లింది. ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ శాఖ 2022 సెప్టెంబరు 5న జారీ చేసిన ఆదేశాల్లో ఎలాంటి పొరపాట్లు లేవని, ఎర్తిన్‌ అప్పీలును కొట్టివేస్తూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ తీర్పు వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని