చెన్నై వ్యాపారి చెప్పిందే శాసనం

తిరుపతి జిల్లాలో సిలికా శాండ్‌ తవ్వకాలు, రవాణాలో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. చైన్నైకి చెందిన బడా వ్యాపారి ఇందులో చక్రం తిప్పుతున్నారు.

Updated : 02 Dec 2022 10:26 IST

తిరుపతి జిల్లాలో ఇష్టారాజ్యంగా సిలికా శాండ్‌ తవ్వకాలు
అనుమతికి మించి రెట్టింపు లోతున ఖనిజం వెలికితీత
లీజు బయట ప్రభుత్వ భూముల్లోనూ దోపిడీ

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- చిల్లకూరు: తిరుపతి జిల్లాలో సిలికా శాండ్‌ తవ్వకాలు, రవాణాలో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. చైన్నైకి చెందిన బడా వ్యాపారి ఇందులో చక్రం తిప్పుతున్నారు. అనేక లీజులను తమ ఆధీనంలోకి తీసుకుని.. పూర్తి స్థాయి అనుమతులు లేకపోయినా తవ్వడం, లీజు బయట ప్రభుత్వ భూముల్లోనూ వెలికితీయడం, పరిమితికి మించి ఖనిజాన్ని లోడ్‌ చేసి తరలించడం.. ఇలా అన్నింటా ఉల్లంఘనల పర్వం సాగుతోంది. వీటిపై ఆయాశాఖల అధికారులు ఎవరూ నోరెత్తడం లేదు. చిల్లకూరు, కోట మండలాల్లో ఉన్న సిలికా లీజుల్లో కొన్నింటిని చెన్నై వ్యాపారి రెండేళ్లుగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. మినరల్‌ డీలర్‌ లైసెన్సులు పొందిన ఆయన లీజుదారులకు టన్నుకు రూ.100-150 చొప్పున ఇచ్చేందుకు ఒప్పించారు. వీటిలో చాలా లీజుల్లో నిబంధనల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

* చిల్లకూరు మండలంలోని బల్లవోలులో ఎస్‌.కృష్ణారెడ్డి పేరిట ఉన్న సిలికా శాండ్‌ లీజులో తవ్వకాలు సాగిస్తున్న చెన్నై వ్యాపారి.. దాని పక్కనున్న ప్రభుత్వ భూములనూ చెరబట్టారు. ఇప్పటికే వాటిలో 20 ఎకరాల్లో సిలికా తవ్వి తరలించారు. మరో 25 ఎకరాల్లో తవ్వకాలకు సిద్ధమయ్యారు. ఇందుకు ఓ స్థానిక నేత సహకరిస్తున్నారు. ఆ నాయకుడు ప్రభుత్వ భూముల్లో వేరుశెనగ సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.2 లక్షలు చొప్పున ఇస్తామని చెబుతున్నారు. సిలికా తవ్వకాలకు అంగీకరించని రైతులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.

* అదే మండలంలోని వరగలివద్ద వై.జానకిరామిరెడ్డి పేరిట ఉన్న లీజులో రెండేళ్లుగా చెన్నై వ్యాపారి సిలికా తవ్విస్తున్నారు. దీని గడువు సెప్టెంబరుతో ముగిసింది.

రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు గనులశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం ప్రస్తుత లీజుల్లో గడువు ముగిసిన వాటికి వచ్చే మార్చి నెలాఖరు వరకు లీజు కొనసాగించే వీలుంది. దీనికి మైనింగ్‌ ప్లాన్‌ అనుమతులు రాకున్నా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఆ లీజులో వాహనాలు వెళ్లేందుకు గతంలో వేసిన దారుల కింద సిలికా తవ్వేస్తుండటం అక్రమాలకు పరాకాష్ఠ.

* ఏ లీజులో సిలికా తవ్వినా తమిళనాడు వ్యాపారి యార్డుకే తరలిస్తున్నారు. దీంతో ఇతర మినరల్‌ డీలర్‌ లైసెన్సుదారులు నేరుగా లీజుదారుల నుంచి సిలికా కొనే పరిస్థితి ఉండటం లేదు.

* గనులశాఖ నిబంధనల ప్రకారం రెండున్నర మీటర్ల వరకే సిలికా తవ్వాలి. కానీ పలు లీజుల్లో 5 మీటర్ల కంటే ఎక్కువ లోతునే తవ్వేస్తున్నారు.

* ఎక్కువగా సిలికా శాండ్‌ లీజులున్న ప్రాంతాల్లో చెన్నై వ్యాపారి అనుచరులు రోడ్డుకు అడ్డంగా డ్రమ్ములు పెట్టి. సిలికా లోడ్‌తో వెళ్లే వాహనాలను పరిశీలించి పంపుతున్నారు. సిలికా తవ్వకాలు, తరలింపు పర్యవేక్షణలో తమిళనాడు వారినే ఎక్కువగా నియమించుకుని పట్టు కోల్పోకుండా చూసుకుంటున్నారు.

ఉల్లంఘనలను పరిశీలిస్తాం: శ్రీనివాసరావు, గనులశాఖ ఏడీ

లీజు బయట ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు, మైనింగ్‌ ప్లాన్‌ అనుమతి రాకుండానే వెలికితీతను పరిశీలిస్తాం. ప్రభుత్వ భూముల్లో తవ్వినందుకు గతంలో జరిమానా విధించాం. మరోమారు తనిఖీలు  చేపట్టి చర్యలు తీసుకుంటాం.


లెక్క చూపని మొత్తం ఎటుపోతోంది?

చెన్నై వ్యాపారి.. మినరల్‌ డీలర్‌ లైసెన్సు యార్డు ద్వారా ఇతర లైసెన్సుదారులకు ఇసుక అమ్ముతున్నారు. అందులో టన్నుకు అధికారికంగా తీసుకునేది రూ.630. అనధికారికంగా నగదు రూపంలో రాబట్టేది మరో రూ.700-800. నిబంధనల ప్రకారం టన్ను సిలికా శాండ్‌కు సీనరేజ్‌ రూ.100, కన్సిడరేషన్‌ నగదు రూ.212, జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్‌), మెరిట్‌ తదితరాలు కలిపి మొత్తం రూ.345 ప్రభుత్వానికి చెల్లించాలి. దీనితోపాటు లీజుదారుకు టన్నుకు రూ.150 చొప్పున చెన్నై వ్యాపారి ఇస్తున్నారు. ఇదంతా కలిపి రూ.495 అవుతోంది. ఇతర లైసెన్సుదారులకు సిలికా సరఫరా చేసే సమయంలో ఆ వ్యాపారి జీఎస్టీతో కలిపి టన్నుకు రూ.630 చొప్పున ఆన్‌లైన్‌ చెల్లింపులు స్వీకరిస్తున్నారు. దీనికి అదనంగా టన్నుకు రూ.700-800 వరకు నగదు రూపంలో వసూలు చేస్తున్నారు. ఈ అదనపు సొమ్మంతా ఏమవుతుందంటే సమాధానం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని