బొగ్గు రవాణాకు రైల్వే రేక్‌ల కొరత

ఏజీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలైన వీటీపీఎస్‌, ఆర్‌టీపీపీలో రెండు రోజుల విద్యుత్‌ ఉత్పత్తికి సరిపడా బొగ్గు మాత్రమే ఉంది.

Updated : 09 Dec 2022 06:28 IST

కోటా బొగ్గునూ తెచ్చుకోలేని జెన్‌కో

ఈనాడు-అమరావతి: ఏజీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలైన వీటీపీఎస్‌, ఆర్‌టీపీపీలో రెండు రోజుల విద్యుత్‌ ఉత్పత్తికి సరిపడా బొగ్గు మాత్రమే ఉంది. మహానది కోల్‌ఫీల్డ్స్‌లో బొగ్గు అందుబాటులో ఉన్నా.. రైల్వే రేక్‌ల కొరత కారణంగా తీసుకొచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. బొగ్గు రవాణాకు రోజుకు 22 రేక్‌లు అవసరం ఉంటే.. 15 రేక్‌లు మాత్రమే రైల్వే శాఖ అందిస్తోంది. ఈ కారణంగా కోటా ప్రకారం థర్మల్‌ కేంద్రాలకు కేటాయించిన బొగ్గును కూడా తెచ్చుకోవడం జెన్‌కోకు సాధ్యం కావడం లేదు. విజయవాడ వీటీపీఎస్‌కు రోజుకు సుమారు 30-32 వేల టన్నులు, ఆర్‌టీపీపీకి 26 వేల టన్నులు, కృష్ణపట్నంలో 24 వేల టన్నుల బొగ్గు అవసరం. అంటే నిత్యం 80 వేల టన్నుల బొగ్గు రావాల్సి ఉంటే.. రేక్‌ల కొరత కారణంగా 50-55 వేల టన్నులకు మించి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో థర్మల్‌ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వ పెంచుకోవడం సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం వీటీపీఎస్‌ దగ్గర 60 వేల టన్నులు, ఆర్‌టీపీపీలో 40 వేల టన్నులు, కృష్ణపట్నంలో 1.40 లక్షల టన్నుల బొగ్గు ఉంది.

రేక్‌ల కోసం కేంద్రానికి లేఖ

రోజువారీ ఉత్పత్తిని కొనసాగిస్తూ బొగ్గు నిల్వలు పెంచుకోవాలంటే ప్రస్తుతం వస్తున్న రేక్‌లతో పాటు అదనంగా మరో 5-6 రేక్‌లు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అప్పుడే ప్రస్తుతం రోజుకు వస్తున్న బొగ్గుతో పాటు అదనంగా 20-25 వేల టన్నులను తీసుకురావడం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈమేరకు కనీసం 10రోజులకు సరిపడా నిల్వలు ఉంచడం సాధ్యం అవుతుందని అధికారులు తెలిపారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన అన్ని రాష్ట్రాల ఇంధనశాఖ అధికారులతో కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో కూడా రేక్‌ల కొరత గురించి అధికారులు ప్రస్తావించినా పరిష్కారం కాలేదు.   

* కృష్ణపట్నంలో కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడో యూనిట్‌కు బొగ్గును కేంద్ర ప్రభుత్వం కేటాయించినా.. దాన్ని రవాణా చేయడానికి వీలుగా రేక్‌లను కేటాయించలేదు. దీంతో ఉత్పత్తి ప్రారంభించినా..రోజుకు 8 వేల టన్నుల బొగ్గును తీసుకురాలేని పరిస్థితి నెలకొంది. దీనికోసం కనీసం రెండు రేక్‌లను అదనంగా కేటాయించాలని అధికారులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని