Andhra News: ఆ జీవోపై అత్యవసర విచారణెందుకు?

సంక్రాంతి సెలవుల సమయంలో ఎలాంటి అంశాలపై విచారించాలో పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా జీవో 1పై వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ఆక్షేపించింది.

Updated : 24 Jan 2023 08:07 IST

వెకేషన్‌ బెంచ్‌ వ్యవహరించిన తీరు సరికాదు  
హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
గందరగోళం సృష్టించారని పిటిషనర్‌పై వ్యాఖ్యలు
పార్టీలను అడ్డుకునేందుకే జీవో తెచ్చిందన్న పిటిషనర్‌ జీవో1 పై హైకోర్టులో ధాటిగా వాదనలు

ఈనాడు, అమరావతి: సంక్రాంతి సెలవుల సమయంలో ఎలాంటి అంశాలపై విచారించాలో పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా జీవో 1పై వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ఆక్షేపించింది. ఇది హైకోర్టు సీజేను అవమానించడమేనని ఘాటు వ్యాఖ్య చేసింది. ఇదే పద్ధతిని కొనసాగనిస్తే ప్రతి వెకేషన్‌ జడ్జి.. డిఫ్యాక్టో ప్రధాన న్యాయమూర్తిలా (సీజే) భావించి విచారణలు చేపడతారని, ఇలాంటి చర్య న్యాయ వ్యవస్థకు మంచిది కాదని ఘాటుగా పేర్కొంది. ఇది తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదంది. ప్రధాన న్యాయమూర్తికే సొంతమైన అధికారాల విషయంలో తాను కచ్చితంగా వ్యవహరిస్తానని సీజే తేల్చి చెప్పారు. అసలు ఈ జీవోపై అత్యవసరంగా విచారణ కోసం వెకేషన్‌ బెంచ్‌ను కోరాల్సిన అవసరం ఏమొచ్చిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అశ్వినీ కుమార్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. కొంత సమయం వేచి చూస్తే ఆకాశమేం ఊడిపడదు కదా? అని పేర్కొంది. గందరగోళ పరిస్థితులకు, వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చేందుకు కారణమయ్యారని తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. మధ్యంతర ఉత్తర్వులు పొందాక ఈ పది రోజుల్లో కార్యక్రమాలేం చేయలేదు కదా.. అని గుర్తుచేసింది. సోమవారం విచారణలో సీపీఐ రామకృష్ణ తరఫు సీనియర్‌ న్యాయవాది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీల హోరాహోరీ వాదనలు సాగాయి. ఇదే జీవోను సవాలు చేస్తూ మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ దాఖలు చేసిన వేర్వేరు వ్యాజ్యాలపై మంగళవారం విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం స్పష్టంచేసింది.

కొన్ని సందర్భాల్లో విచారించొచ్చు
- సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌

పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘అడ్మినిస్ట్రేటివ్‌, పాలసీ నిర్ణయాలపై వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టకూడదని హైకోర్టు పేర్కొన్నప్పటికీ.. ప్రభుత్వ నిర్ణయాలు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉంటే వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టవచ్చు. జీవో 1 కార్యనిర్వహణ సూచనలకు సంబంధించింది. కాబట్టి ఆ బెంచ్‌ వినడంలో తప్పులేదు’ అని పేర్కొన్నారు.  ‘ఆ జీవో రహదారులపై రాజకీయ పార్టీలు చేపట్టే సమావేశాలు, పాదయాత్రలు, ర్యాలీలు ఇతర కార్యక్రమాలను అడ్డుకునేలా ఉంది. తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తోంది’ అని రాజు రామచంద్రన్‌ పేర్కొన్నారు. ఆయన వాదనలు కొనసాగిస్తూ.. ‘అరుదైన సందర్భం, ప్రత్యేక పరిస్థితుల్లోనే సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వాలని ఆ జీవో పోలీసులను నిర్దేశిస్తోంది. ఆ కారణం చెప్పి వారు ప్రతిపక్షాలకు అనుమతి నిరాకరిస్తారు. ఇది వివక్ష చూపడం, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. ప్రజలకు దూరంగా ఉండే మైదానాలు, సమావేశ మందిరాల్లో సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలనడం సరికాదు. పార్టీలు కార్యకలాపాలు పట్టణాలు, నగరాల మధ్యలో నిర్వహించాలి తప్ప.. ప్రజలకు దూరంగా కాదు. ‘వీధులనేవి రాజకీయ కార్యకలాపాలకు క్షేత్రాలు’ అనే విషయాన్ని సుప్రీం కోర్టు గుర్తించింది. సమావేశాలు నిర్వహించి రాజకీయ అభిప్రాయం తెలియజేసేందుకు వీధులు సహజ వేదికలని స్పష్టం చేసింది. కూడళ్లలో నిర్వహించే సమావేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థ లక్షణం. ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి వీల్లేదు. ఆడిటోరియంలో సమావేశం కంటే రోడ్‌ షోల ద్వారా ఎక్కువ మంది ప్రజలను చేరుకునే అవకాశం ఉంటుంది. సమావేశం ఎక్కడ నిర్వహించుకోవాలనే హక్కు నిర్వాహకులకే ఉండాలి. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదు. జీవో 1 పోలీసు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికే పోలీసు చట్టం ఉంది. అలాంటప్పుడు జీవో 1 ఎందుకు? అనుమతి తీసుకోవాలనే షరతు విధించి పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాలను నిషేధిస్తోంది. జీవో 1కు రాజ్యాంగ బద్ధత లేదు. దాని అమలును నిలిపివేయండి’ అని సీనియర్‌ న్యాయవాది కోరారు.

నిషేధం విధించే ఉద్దేశం లేదన్న ఏజీ

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘హైకోర్టు నోటిఫికేషన్‌కు విరుద్ధంగా వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. ఆ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదనే విషయాన్ని బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కనీసం వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదు. అత్యవసర విచారణ కోసం కృత్రిమ కారణాలను పిటిషనర్‌ తెర పైకి తెచ్చారు. ఊరేగింపులు, పాదయాత్రలు, రోడ్‌ షోలపై నిషేధం విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు’ అని వాదనలు వినిపించారు.


సెలవుల్లో ఏం జరిగింది?

రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల గొంతు నొక్కడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2న జీవో1 తీసుకొచ్చిందని పేర్కొంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్‌ వేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి సెలవుల్లో ఈనెల 12న వెకేషన్‌ బెంచ్‌ దీనిపై విచారణ జరిపింది. ఆ జీవో పోలీసు చట్టం సెక్షన్‌ 30కు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడుతూ ఈనెల 23 వరకు దానిని సస్పెండ్‌ చేసింది. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజే స్పందిస్తూ.. ‘సీజే ఉత్తర్వులకు విరుద్ధంగా వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. ఆ రోజు ఏం జరిగిందో రిజిస్ట్రీ ఎప్పటికప్పుడు నాకు చెబుతూనే ఉంది. ఏం తెలియదనుకోవడం పొరపాటే’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని