11 మద్యం దుకాణాల్లోనే నగదు రహిత చెల్లింపుల విధానం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎట్టకేలకు నగదు రహిత చెల్లింపుల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

Published : 04 Feb 2023 07:36 IST

ఏడాది పాటు కసరత్తు చేసినా..
పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టలేకపోయిన ఎక్సైజ్‌ శాఖ

ఈనాడు-అమరావతి, విజయవాడ సిటీ-న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎట్టకేలకు నగదు రహిత చెల్లింపుల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వాకిన్‌ స్టోర్స్‌తో కలిపి 2,934 మద్యం దుకాణాలుండగా.. వాటిల్లో 11 చోట్ల మాత్రమే ఈ విధానాన్ని ప్రారంభించగలిగింది. మద్యం దుకాణాల్లో మరో 15 రోజుల్లో నగదు రహిత చెల్లింపు విధానాన్ని ప్రవేశపెడతామని ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ గతేడాది మార్చి 20న ప్రకటించారు. దాదాపు ఏడాది తర్వాత కేవలం 0.37 శాతం దుకాణాల్లోనే దీన్ని ప్రారంభించలిగారు. రోడ్డు పక్కన తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారు, చిల్లరకొట్లల్లో సైతం గూగుల్‌ పే, ఫోన్‌ పే తదితర నగదు రహిత చెల్లింపులకు అవకాశం ఉండగా దాదాపు ఏడాది పాటు కసరత్తు చేసిన తర్వాత, భారీ యంత్రాంగం ఉండి కూడా ఎక్సైజ్‌ శాఖ మొత్తం మద్యం దుకాణాల్లో ఈ విధానాన్ని తీసుకురాలేకపోయింది. అన్ని దుకాణాల్లో దశలవారీగా ఈ విధానాన్ని ప్రవేశపెడతామని.. అందుకు మరో రెండు మూడు నెలల సమయం పడుతుందని రజత్‌భార్గవ శుక్రవారం ప్రకటించారు.

* విజయవాడ టిక్కిల్‌రోడ్డులోని మద్యం వాకిన్‌ స్టోర్‌లో నగదు రహిత చెల్లింపుల విధానాన్ని రజత్‌ భార్గవ శుక్రవారం ప్రారంభించారు. దీంతో పాటు నగరంలో మరో 10 వాకిన్‌ స్టోర్స్‌ల్లో ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రెడిట్‌ కార్డుతో చెల్లించేవారికి అదనపు రుసుములు పడతాయని, డెబిట్‌ కార్డు, యూపీఐ ద్వారా చెల్లించేవారికి అవి ఉండబోవని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు