కుటుంబ విభజనా.. పెళ్లిపత్రిక తప్పనిసరి

హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ నుంచి కుటుంబాల విభజనకు అనుమతించిన ప్రభుత్వం.. ఇందుకు మ్యారేజి సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేసింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 20-30 ఏళ్ల క్రితం వివాహమైన వారిలో చాలామంది సర్టిఫికేట్ల కోసం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

Updated : 05 Feb 2023 05:44 IST

వివాహ ధ్రువీకరణ కోసం 20-30 ఏళ్ల కిందట పెళ్లయిన వారి అవస్థలు

ఈనాడు, అమరావతి: హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ నుంచి కుటుంబాల విభజనకు అనుమతించిన ప్రభుత్వం.. ఇందుకు మ్యారేజి సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేసింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 20-30 ఏళ్ల క్రితం వివాహమైన వారిలో చాలామంది సర్టిఫికేట్ల కోసం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వివాహ ఆహ్వాన పత్రిక, పెళ్లినాటి ఫొటో, జనన ధ్రువీకరణ వంటివి సమకూర్చితే తప్ప స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మ్యారేజి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. 2019లో చేసిన హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ నుంచి కుటుంబాల విభజన ప్రక్రియను కడప నగరపాలక సంస్థతోపాటు విజయనగరం జిల్లా గరివిడి మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖను ఆదేశించింది. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ చేసిన కుటుంబాల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నా అప్పటివరకు ఆ కుటుంబానికి అందుతున్న సంక్షేమ పథకాలను నిలిపేశారు. కుమారుడు ఉద్యోగ రీత్యా భార్యాపిల్లలతో వేరేక చోట ఉంటున్నా.. తల్లిదండ్రులను సంక్షేమ ఫలాల జాబితానుంచి తొలగించారు. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో అందరినీ ఒకే కుటుంబంగా ఇప్పటికీ చూపించడమే దీనికి కారణం. మ్యాపింగ్‌నుంచి కుటుంబాలను విభజించడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మళ్లీ అర్హత సాధించగలరు. తల్లిదండ్రులు ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే.. నిరుద్యోగి అయిన కుమారుడి కుటుంబం పథకాలకు అర్హత సాధిస్తుంది.


దరఖాస్తు చేసి ఉపయోగమేంటి?

హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌నుంచి కుటుంబాల విభజనకు సచివాలయాలకు దరఖాస్తులొస్తున్నాయి. తల్లిదండ్రులతోపాటు కుమారుడు, ఆయన భార్య ఉన్న కుటుంబం నుంచి విభజనకు కుమారులు దరఖాస్తులు చేస్తున్నప్పుడు మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి చేశారు. వివాహమయ్యాక 60 రోజుల్లోపు సచివాలయాల్లో మ్యారేజ్‌ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. అంతకంటే మించితే సమీప సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం పెళ్లినాటి ఆహ్వాన పత్రిక, ఫొటోలు, జనన ధ్రువీకరణ పత్రాలు సమకూర్చాలి. 20-30 ఏళ్ల క్రితం పెళ్లయిన వారిలో చాలామంది వద్ద ఇవి లేవు. మ్యాపింగ్‌ నుంచి కుటుంబాల విభజనకు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చినట్లే ఇచ్చి మ్యారేజ్‌ సర్టిఫికేట్‌తో లింకు పెట్టడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే తప్ప సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనివల్ల కుటుంబాల విభజన మళ్లీ మొదటికే రానుంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు