‘స్మార్ట్‌’పైనా అక్కసే

అమరావతి స్మార్ట్‌ సిటీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన పనుల్లో సగం వరకు కోత పెట్టింది. నిధులు సరిగా విడుదల చేయక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

Published : 06 Feb 2023 04:44 IST

అమరావతి స్మార్ట్‌ సిటీపై నిర్లక్ష్యం
జూన్‌ లోపే పూర్తికావాలన్న కేంద్రం  
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులూ గాలికే
గత ప్రభుత్వం ప్రారంభించినవి 10 వెనక్కి
నిధులు విడుదల చేయక పనుల్లో జాప్యం  
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తుళ్లూరు గ్రామీణం

అమరావతి స్మార్ట్‌ సిటీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన పనుల్లో సగం వరకు కోత పెట్టింది. నిధులు సరిగా విడుదల చేయక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ ఏడాది జూన్‌తో అయిపోతుంది. అంటే నాలుగు నెలలే ఉన్నట్లు.. మరి ఈలోపు అవి పూర్తవుతాయా అనేది అనుమానంగానే కనిపిస్తోంది. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు స్మార్ట్‌ సిటీల్లో అమరావతి ఒకటి. ఇందులో అభివృద్ధి పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా చెరో రూ. 100 కోట్ల (మొత్తం రూ. 200 కోట్లు) చొప్పున ఐదేళ్లలో రూ. 1,000 కోట్లు ఖర్చు చేయాలి. గత ప్రభుత్వం చొరవ తీసుకొని అమరావతి స్మార్ట్‌ సిటీలో రూ.2,046 కోట్లతో 21 ప్రాజెక్టుల పనులు ప్రతిపాదించింది. సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రూ.560 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.100 కోట్ల విలువైన పనులకే పరిమితమయ్యారు.

10 పనులు వెనక్కి.. 11 అసంపూర్తి

ప్రస్తుత ప్రభుత్వం అమరావతిలో వివిధ దశల్లో ఉన్న పనుల్లో పదింటిని పూర్తిగా వెనక్కి తీసుకుంది. అప్పటివరకు పూర్తయిన వాటిని నిలిపివేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కేటాయించిన రూ. 1,000 కోట్ల పనులకే పరిమితం కావాలని అధికారులను ఆదేశించింది. అప్పటివరకు పూర్తయిన పనులకు సీఆర్‌డీఏకి దాదాపు రూ. 570 కోట్లు విడుదల చేసింది. మరో రూ. 87 కోట్ల వరకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది.స్మార్ట్‌ సిటీ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అవసరాలకు మళ్లించకుండా కేంద్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్‌ నుంచి సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ (ఎన్‌ఎన్‌ఏ) ఖాతా తెరిచి అందులో నిధులు జమ చేయాలని ఆదేశించింది. అది రాష్ట్రంలో పూర్తిగా అమలు కావడంలేదు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించినా రాష్ట్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని సీఎఫ్‌ఎంఎస్‌కి అనుసంధానించిన స్మార్ట్‌సిటీ పీడీ ఖాతాల్లోని నిధులు ఎన్‌ఎస్‌ఏకి జమ చేయలేదు. అమరావతికి సంబంధించి సుమారు రూ. 223 కోట్లు జమ చేయకుండా కాలయాపన చేస్తోంది. ఈ కారణంగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోగా, అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు గుత్తేదారు సంస్థలు ముందుకు రావడం లేదు. స్మార్ట్‌ సిటీ పరిధిలోని అనేక ప్రాంతాల్లో విలువైన పైపులు, ఇతర నిర్మాణ సామగ్రి వృథాగా పడి ఉన్నాయి. అమరావతి స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పురోగతిపై ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా చేయడంలేదు.


స్మార్ట్‌ సిటీ పనులేవీ?

- కె.వరలక్ష్మి, మందడం

‘గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులు తప్పితే స్మార్ట్‌ సిటీ కింద కొత్తగా చేసిందేమీ లేదు. అప్పటి పనులనూ పూర్తి చేయడం లేదు. చాలాచోట్ల విలువైన నిర్మాణ సామగ్రి దొంగలపాలవుతోంది. రోడ్లు కూడా తవ్వుకుపోతున్నారు.  


పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి

- ఎన్‌.రామారావు, అనంతవరం

‘పొరుగు రాష్ట్రాల్లో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులను చక్కగా అమలు చేసి నగరాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. మన దగ్గర అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ చూసైనా నేర్చుకోవాలి


అభివృద్ధి అంటే ఉన్న రోడ్లు ధ్వంసం చేయడమా?

- కె.అరుంధతి, తుళ్లూరు

‘స్మార్ట్‌ సిటీ అభివృద్ధి అంటే ఉన్న రోడ్లును ధ్వంసం చేసి మెటీరియల్‌ తరలించుకుపోవడమా? ప్రస్తుత ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరచలేదు’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని