కోర్టు ధిక్కరణ కేసులపై వ్యాఖ్యానించను

కోర్టు ధిక్కరణ కేసులపై తానేమీ వ్యాఖ్యానించబోనని న్యాయశాఖ కార్యదర్శి సత్యప్రభాకరరావు అన్నారు.

Updated : 08 Feb 2023 05:51 IST

కోర్టుల్లో రికార్డుల భద్రతకు ఢోకా లేదు
న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకరరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులపై తానేమీ వ్యాఖ్యానించబోనని న్యాయశాఖ కార్యదర్శి సత్యప్రభాకరరావు అన్నారు. రాష్ట్రంలో కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయని,. ప్రభుత్వమే ఎక్కువగా ఉల్లంఘిస్తోందని, దాన్ని ఎలా చూడాలంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. సచివాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. న్యాయస్థానాల్లో రికార్డుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని, వాటి పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని తెలిపారు. ఎక్కడో ఒక చోట జరిగినదాన్ని అన్నిచోట్లా ఆపాదించనవసరం లేదన్నారు. జూనియర్‌ న్యాయవాదులకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చేందుకు అకాడెమీ ఏర్పాటు విషయాన్ని సీఎం, హైకోర్టు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ను సంప్రదించి చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయవాదులు ఎక్కువగా ఫీజులు తీసుకుంటారనేది అపోహ మాత్రమేనన్నారు. జూనియర్‌ న్యాయవాదులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైఎస్సార్‌ లా నేస్తం పథకం కింద నెలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోందన్నారు. దీని కింద ఇప్పటివరకు 65,537 మందికి రూ.34.39 కోట్ల సాయాన్ని అందించామన్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధి కింద రూ.100 కోట్లు కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని