Andhra News: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.. ప్రమాదమా.. ఆత్మహత్యా?

పేద కుటుంబంలో జన్మించినా.. చదువులో రాణించిన కుమారుడికి విదేశాల్లో ఉన్నతవిద్యను అందించాలన్న కన్నవారి కలలు కల్లలయ్యాయి.

Updated : 12 Mar 2023 09:12 IST

స్వగ్రామానికి  మృతదేహం తరలింపు

మార్టూరు, న్యూస్‌టుడే: పేద కుటుంబంలో జన్మించినా.. చదువులో రాణించిన కుమారుడికి విదేశాల్లో ఉన్నతవిద్యను అందించాలన్న కన్నవారి కలలు కల్లలయ్యాయి. కన్న కొడుకు నిర్జీవంగా ఇంటికి రావడంతో ఆ కుటుంబీకుల రోదనలను ఆపడం ఎవరి తరమూ కాలేదు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళికి చెందిన గోవాడ నాగసాయి గోపి అరుణ్‌కుమార్‌ (23)కు ఉన్నతవిద్యపై ఉన్న మక్కువను గుర్తించిన తల్లిదండ్రులు.. తమ ఆస్తులను కుదువ పెట్టి మరీ అమెరికాలో ఎంఎస్‌ చేసేందుకు ఏడు నెలల క్రితం పంపించారు. అక్కడికి వెళ్లిన అరుణ్‌కుమార్‌ ఈ నెల ఒకటి నుంచి కనిపించడంలేదని స్నేహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదుచేశారు. 4వ తేదీన అతను ఉండే నివాసానికి సమీపంలోని సరస్సులో అరుణ్‌ మృతదేహం పోలీసులకు లభించిందని సన్నిహితులు వెల్లడించారు. మృతదేహానికి అమెరికా పోలీసులు శవపరీక్షలు నిర్వహించి, అక్కడి స్నేహితుల సహకారంతో ఇండియాకు పంపారు.

అరుణ్‌కుమార్‌ సరస్సులో మృతదేహమై తేలడం చర్చనీయాంశమైంది. ముందు ప్రమాదంగా చెప్పి, తర్వాత ఆత్మహత్య అనడంతో తల్లిదండ్రులు సింగయ్య, సుబ్బాయమ్మ ఖిన్నులయ్యారు. చేతికి అందివచ్చిన కొడుకు దేశంకాని దేశం వెళ్లి శవమై ఇంటికి చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాలు సరిగా తెలియక కుటుంబసభ్యులు ఆందోళనలో మునిగిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని