కారుణ్య మరణానికి అనుమతించండి

కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంనకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని గొట్టిపాటి సుధారాణి సీఎం క్యాంపు కార్యాలయానికి తన కుమారుడు కార్తీక్‌, కుమార్తె సుమహారికతో కలిసి శనివారం పాదయాత్రగా వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

Published : 19 Mar 2023 03:46 IST

ప్రభుత్వ ఉపాధ్యాయిని ఆవేదన
సీఎం క్యాంపు కార్యాలయానికి  వస్తుండగా పోలీసుల అడ్డగింత

తాడేపల్లి, న్యూస్‌టుడే: కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంనకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని గొట్టిపాటి సుధారాణి సీఎం క్యాంపు కార్యాలయానికి తన కుమారుడు కార్తీక్‌, కుమార్తె సుమహారికతో కలిసి శనివారం పాదయాత్రగా వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె అద్దంకి మండలం గోపాలపురం ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నారు. తన ఇంటి దారి విషయమై కొంతమంది అడ్డు పడుతున్నారంటూ గతేడాది జూన్‌ 18న వీల్‌ఛైర్‌పై కుటుంబ సభ్యులతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తుండగా... కొలనుకొండ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సమస్య పరిష్కరిస్తామని వెనక్కి పంపారు. అప్పటి నుంచి సమస్య పరిష్కారం కాలేదు. తరచూ ఆ వ్యక్తుల వల్ల మనోవ్యథకు గురవుతున్నానని, ఆ బాధ భరించలేకపోతున్నందున తనకు, కుటుంబ సభ్యులకు కారుణ్య మరణానికి అనుమతివ్వాలని మళ్లీ పాదయాత్రగా తాడేపల్లికి బయలుదేరారు. అదే అంశాన్ని ప్లకార్డులపై రాసి మెడలో వేసుకుని వస్తుండగా కుంచనపల్లి వద్ద పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని నెట్టుకుంటూ పాత టోల్‌గేట్‌ కూడలికి చేరుకున్నారు. సీఐలు శేషగిరిరావు, సాంబశివరావు తమ సిబ్బందితో వారిని అడ్డగించి వాహనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేయగా ప్రతిఘటించారు. చివరకు ముగ్గురినీ తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ‘సమస్య పరిష్కారం కానప్పుడు మీరైనా చంపేయండి. లేదంటే... మేము చనిపోవడానికి అనుమతి ఇవ్వండి ’ అంటూ అడ్డుకున్న సీఐలను సుధారాణి కోరారు. సుధారాణి కుమారుడు పశు వైద్యుడు కాగా కుమార్తె వైద్య విద్య అభ్యసిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు