వ్యతిరేకత లేదు... హెచ్చరిక కాదు

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను, అన్ని వర్గాల ప్రజలను పట్టభద్రుల ఓట్లు ప్రతిబింబించవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Updated : 19 Mar 2023 07:12 IST

పట్టభద్రుల ఓట్లు అన్ని వర్గాలనూ ప్రతిబింబించవు
సంక్షేమ పథకాలతో  సంబంధం లేని వర్గం ఇది
సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను, అన్ని వర్గాల ప్రజలను పట్టభద్రుల ఓట్లు ప్రతిబింబించవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అందుకున్న ఓటర్లు సైతం పట్టభద్రుల్లో చాలా తక్కువని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఓటమిని ప్రభుత్వంపై వ్యతిరేకతగా, హెచ్చరికగా తాము భావించడం లేదన్నారు. ఈ ఫలితాలు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని స్పష్టం చేశారు. పట్టభద్ర ఓటర్లను చేరడంలో కొంత వెనుకబడినట్లు ఉన్నామని, కొన్ని వ్యూహాలు సరిగా అమలు చేయలేదేమోనని భావిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి దాన్ని భర్తీ చేస్తామన్నారు. సచివాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘పట్టభద్ర ఓటర్లు వ్యవస్థీకృత వర్గం. ప్రభుత్వ పథకాలతో సంబంధం లేని వర్గం. ఈ ఎన్నికల ఫలితాలను మొత్తానికి వర్తింపజేయడం సరైంది కాదు’ అన్నారు.

అన్ని శక్తులూ ఏకమయ్యాయి

‘కమ్యూనిస్టులు, పీడీఎఫ్‌, తెదేపా మధ్య అవగాహన కుదిరింది. వారి ఓట్లన్నీ తెదేపాకు బదిలీ చేశారు. అంతేతప్ప, ఇప్పుడు వచ్చిన ఓట్లన్నీ తెదేపావి కాదు. మేం సీరియస్‌గానే పోటీ చేశాం. ఒక వర్గానికి చెందిన ఓట్ల కోసం అన్ని శక్తులూ ఏకమయ్యాయి. పవన్‌కల్యాణ్‌తో పొత్తు వల్లనో లేదా ఇంకో పార్టీ పొత్తు వల్లనో బలం పెరిగిందని తెదేపా నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అది వారి ఆనందం. ఇది ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదు’ అని వ్యాఖ్యానించారు.

ఉపాధ్యాయులు వైకాపాను ఆదరించారు

‘పట్టభద్రుల ఎన్నికలు 9 లక్షల ఓట్లకే సంబంధించినవి. సాధారణంగా కమ్యూనిస్టులు, ఇతరులు ఇందులో క్రియాశీలకంగా ఉంటారు. ప్రధాన పార్టీలు మద్దతిస్తాయి. మొదటిసారి మేం ఈ ఎన్నికల్లో ప్రయోగం చేశాం. ఉపాధ్యాయులు వైకాపాను ఆదరించారు. అందుకే రెండు ఎమ్మెల్సీ స్థానాలను తొలిసారి గెలుచుకున్నాం. పట్టభద్రుల ఎన్నికల్లో వైకాపాకు తక్కువ ఓట్లేమీ రాలేదు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఓట్ల కట్టల్లో గందరగోళం చేశారు. రీకౌంటింగ్‌ చేయాలని ఫిర్యాదు చేశాం’ అని వెల్లడించారు.

సంఖ్యాబలం లేకున్నా తెదేపా పోటీ

‘ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపాకు సంఖ్యాబలం లేదు. తెలంగాణలో గతంలో చేసినట్లే ఇక్కడా చేయాలనుకుంటున్నట్లున్నారు. అక్కడ ఏదో చేయబోయి దొరికారు. నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ పార్టీతో లేరు. అయినా పోటీపెట్టారు. ఈ ఎన్నికలకు విప్‌ జారీచేయాల్సిన అవసరం ఉందని మేమైతే అనుకోవడం లేదు’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని