దేవుడి ఆస్తుల్ని దోచేస్తున్నారు

దేవాలయాల ఆస్తులను రక్షించకుండా అధికారులు పాపానికి పాల్పడుతున్నారని హైకోర్టు మండిపడింది.

Updated : 30 Mar 2023 07:18 IST

అధికారులు పాపానికి పాల్పడుతున్నారు
మంత్రుల ప్రయోజనాలు కాపాడేందుకు పనిచేస్తున్నారు
దేవాదాయ కమిషనర్‌గా హరి జవహర్‌లాల్‌ అర్హుడు కాదు
నిషేధిత జాబితా నుంచి దేవాదాయ ఆస్తులను తొలగించే అధికారం ఆయనకు లేదు
నిప్పులు చెరిగిన హైకోర్టు 

ఈనాడు, అమరావతి: దేవాలయాల ఆస్తులను రక్షించకుండా అధికారులు పాపానికి పాల్పడుతున్నారని హైకోర్టు మండిపడింది. దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తూ అధికారులు మహా పాపం చేస్తున్నారంది. దేవుడి భూములు ఎవరికీ పట్టడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయనేతల ప్రయోజనాలు కాపాడేందుకు అధికారులు పనిచేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేవాదాయ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌.. ఓ దేవస్థానానికి చెందిన భూమిని రిజిస్ట్రేషన్‌ నిషేధిత జాబితా(22ఏ) నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపట్టింది. ఇలా ఉత్తర్వులిచ్చే పరిధి తనకు లేదని తెలిసి కూడా కమిషనర్‌ వ్యవహరించారని ఆక్షేపించింది. కమిషనర్‌గా కొనసాగేందుకు ఆయన ఏమాత్రం అర్హుడు కాదని స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై దేవుడి భూముల్ని ధారదత్తం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి అధికారిని కొనసాగించడం అంటే దొంగ చేతికి తాళాలిచ్చినట్లేనని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. ఏడాది నుంచి రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తున్నామని.. దేవుడి ఆస్తుల్ని దొరికితే దోచేస్తున్నారు తప్ప.. కాపాడేవారు కరవయ్యారని తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. దేవాదాయ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేసింది. నిషేధిత జాబితా నుంచి దేవాదాయ ఆస్తులను తొలగించే అధికారం కమిషనర్‌కు లేదని తేల్చిచెప్పింది. ఏదైనా ఆస్తి పొరపాటుగా నిషేధిత జాబితాలో చేరితే దానిని తొలగించేందుకు దేవాదాయశాఖ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని చెప్పింది. ప్రస్తుత కేసులో సంబంధిత భూమి తనకు చెందినదిగా భావిస్తున్న ప్రైవేటు వ్యక్తి ఎ.వెంకటరత్నహర్ష.. దేవాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. పాత గుంటూరులోని కంచికామాక్షి ఏకాంబరేశ్వరస్వామి దేవస్థానానికి యలవర్తి కుటుంబాచార్యులు 1914లో రెండెకరాల భూమిని దానం చేశారు. ఆ భూమి అప్పటి నుంచి దేవాదాయ చట్టం కింద 43 రిజిస్టర్‌లో నమోదు చేశారు. ఆ భూమిని వెంకటరత్నహర్షకు ధారదత్తం చేసేందుకు వీలుగా దేవాదాయ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ గతేడాది జనవరిలో ఉత్తర్వులు జారీచేశారని పేర్కొంటూ జే.హేమాంగద గుప్త మరో ముగ్గురు 2022లో హైకోర్టులో పిల్‌ వేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాది పాణిని సోమయాజి వాదనలు వినిపించారు. దేవాలయ ఆస్తులను కాపాడటంలో అధికారులు విఫలమయ్యారన్నారు. కమిషనర్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.

కమిషనర్‌ను క్షమించండి: ఏజీ

దేవాదాయ కమిషనర్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) వాదనలు వినిపించారు. ఉత్తర్వులు ఇచ్చేముందు కమిషనర్‌ న్యాయసలహా తీసుకొని ఉండాల్సిందన్నారు. మొదటి తప్పుగా భావించి కమిషనర్‌ను క్షమించాలన్నారు. కమిషనర్‌పై ప్రతికూల ప్రభావం చూపే ఉత్తర్వులు ఇవ్వవద్దని అభ్యర్థించారు. కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను ఇప్పటికే అచేతనంగా ఉంచామన్నారు. దేవాలయ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అధికారులకు అదనపు అధికారాలు కల్పిస్తున్నామన్నారు. సంబంధిత ఫైల్‌ను క్యాబినెట్‌ ముందు ఉంచే ఆలోచన ఉందన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. కమిషనర్‌ ఉత్తర్వులను రద్దు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని