మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూత

రాజ్యసభ మాజీ సభ్యుడు, రాష్ట్ర మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి (92) బుధవారం సాయంత్రం భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.

Published : 30 Mar 2023 04:10 IST

ఉండి, న్యూస్‌టుడే: రాజ్యసభ మాజీ సభ్యుడు, రాష్ట్ర మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి (92) బుధవారం సాయంత్రం భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన నారాయణస్వామి 1931లో ఏప్రిల్‌ 30న జన్మించారు. ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఆయన 1959లో ఉప్పులూరు సర్పంచిగా రాజకీయ అరంగేట్రం చేశారు. 1972-98 మధ్య ఎమ్మెల్సీగా, 1976-78 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర లఘు పరిశ్రమలశాఖ మంత్రిగా వ్యవహరించారు. 1984లో తెదేపాలో చేరి ఆ పార్టీ తరఫున రెండు సార్లు తాడేపల్లిగూడెం శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తెదేపా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగానూ పనిచేశారు. పోలవరం ప్రాజెక్టు సాధన కమిటీ ఛైర్మన్‌గా సేవలందించారు. దశాబ్దకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గురువారం ఉప్పులూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి

తెదేపా సీనియర్‌ నాయకుడు యర్రా నారాయణస్వామి మృతిపై పార్టీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని