Sharmila - Vijayamma: పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయిచేసుకోవడం వివాదానికి దారితీసింది.

Updated : 25 Apr 2023 09:31 IST

అరెస్టు..14 రోజుల రిమాండ్‌
జూబ్లీహిల్స్‌ లోటస్‌ పాండ్‌ వద్ద ఉద్రిక్తత
మహిళా సిబ్బందిపై విజయమ్మ దురుసు ప్రవర్తన
పోలీసులు అనుచితంగా వ్యవహరించారు: షర్మిల

జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, అబిడ్స్‌, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయిచేసుకోవడం వివాదానికి దారితీసింది. ఒక మహిళా కానిస్టేబుల్‌ చెంపపై కొట్టడంతో పాటు ఒక ఎస్సైని వెనక్కి నెట్టారు. పోలీసులు నిలువరిస్తున్నా ఆగకుండా వాహనాన్ని ఆమె డ్రైవర్‌ ముందుకు పోనివ్వడంతో ఒక కానిస్టేబుల్‌ కాలిపైకి టైరు ఎక్కింది. బంజారాహిల్స్‌ పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆమెను కలవడానికి ఠాణాకు వచ్చిన తల్లి విజయమ్మ కూడా ఓ మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. కాగా 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అక్రమంగా అరెస్టు చేశారని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రిమాండ్‌ను రద్దు చేయాలని కోర్టును కోరారు.ఇరుపక్షాల వాదనల అనంతరం సోమవారం రాత్రి 9.30 గంటలకు రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో ఆమెను నాంపల్లి కోర్టు నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఉదయం నుంచి హైడ్రామా

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని లోటస్‌పాండ్‌ వద్ద సోమవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. షర్మిల టీఎస్‌పీఎస్‌స్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై సిట్‌ అధికారులను కలిసేందుకు వెళ్తున్నారనే సమాచారంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఆమెను గృహనిర్బంధం చేశారు. అడ్డుకున్న పోలీసులను నెట్టుకుంటూ ముందుకెళ్లారు. తాను ఎలాగైనా సిట్‌ అధికారులను కలుస్తానంటూ షర్మిల ఇంటి బయటకు వచ్చి కారు ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కారు ఎక్కకుండా అడ్డగించిన బంజారాహిల్స్‌ ఎస్సై రవీందర్‌ను ఆమె నెట్టేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ కొద్దిదూరం వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. ఆమె చుట్టూ పోలీసులు ఉండటంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. మీకు ఏం పనిలేదా.. లేకపోతే వెళ్లి గాడిదలు కాసుకోండంటూ దూషించారు. అక్కడి నుంచి తరలించే క్రమంలో షర్మిల ఓ మహిళా కానిస్టేబుల్‌ చెంపపై కొట్టారు. అనంతరం అడ్డుకోవాలంటూ సిబ్బందిని ఆదేశిస్తున్న ఎస్సై రవీందర్‌ చేయి పట్టి నెట్టేశారు. పోలీసుల వద్ద ఉన్న మ్యాన్‌ప్యాక్‌ లాక్కొని నేలకేసి కొట్టారు. బంజారాహిల్స్‌ కానిస్టేబుల్‌ గిరిబాబు కారును అడ్డుకోబోగా డ్రైవరు అలాగే ముందుకు పోనివ్వడంతో టైరు ఆయన కాలుపైకి ఎక్కింది. పరీక్షించిన వైద్యులు కాలి లిగ్మెంట్‌కు గాయమైనట్టు తేల్చారు. పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్‌ ఠాణాకు తరలించారు. కుమార్తె అరెస్ట్‌తో మధ్యాహ్నం విజయమ్మ జూబ్లీహిల్స్‌ స్టేషన్‌ వద్దకు చేరారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు.

* పోలీసులపై చేయిచేసుకున్నందుకు షర్మిలతోపాటు, ఆమె డ్రైవరు బాలు, జాకబ్‌లపై ఐపీసీ సెక్షన్‌ 332, 353, 509, 427, 109, 337, రెడ్‌ విత్‌ 34 కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ తెలిపారు.  విజయమ్మపై కేసు నమోదును పరిశీలిస్తున్నామన్నారు.

నాకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా: షర్మిల

సిట్‌ కార్యాలయానికి ఒంటరిగా వెళ్లి, సిట్‌ అధికారిని కలిసి టీఎస్‌పీఎస్‌సీ దర్యాప్తు మీద వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నా. నన్ను బయటకు రాకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు...? నేనేమైనా క్రిమినల్‌నా...? నాకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా...? పోలీసులు నాపై అనుచితంగా ప్రవర్తించారు. నా మీద పడితే నేను భరించాలా...? ఆత్మరక్షణ చేసుకోవడం నా బాధ్యత.\

అందుకే ఆవేశం వచ్చింది.. విజయమ్మ

పది మంది పోలీసులు నాపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తుంటే అడ్డుకొనేందుకు ప్రయత్నించాను. ఆ నేపథ్యంలో నాకు ఆవేశం వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని