Amaravati: సెంటు భూమి తళతళ.. రైతుల ప్లాట్లు వెలవెల

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా రాజధానిలో ఇతరులకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం శరవేగంగా పనులు చేస్తోంది. 25 లే ఔట్లను సీఆర్డీఏ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Updated : 24 May 2023 09:51 IST

స్థలాల పంపిణీపై శ్రద్ధ అమరావతి అభివృద్ధిపై ఏది?

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తుళ్లూరు: ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా రాజధానిలో ఇతరులకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం శరవేగంగా పనులు చేస్తోంది. 25 లే ఔట్లను సీఆర్డీఏ అధికారులు సిద్ధం చేస్తున్నారు. రోజుల వ్యవధిలోనే యంత్రాలతో జంగిల్‌ క్లియరెన్స్‌, నేల చదును చేసి అంతర్గత రహదారులు వేశారు. లెవెలింగ్‌, సెంటరింగ్‌, మార్కింగ్‌ పనులు చేపట్టి, హద్దు రాళ్లు వేసి వాటిపై నంబర్లు వేశారు. ఈ నెల 26న సీఎం జగన్‌ చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పంపిణీ ఉన్నందున.. ఆలోపు పనులు పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నారు.

మరోవైపు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధిని మాత్రం పట్టించుకోవట్లేదు. ఆ ప్రాంతమంతా గుబురుగా పెరిగిన ముళ్ల కంపలతో అడవిని తలపిస్తుంది. భూసమీకరణలో భాగంగా రాజధాని రైతులకు 63,462 (నివాస, వాణిజ్య) ప్లాట్లు కేటాయించింది. భూములు ఇచ్చినవారిలో ఎక్కవ మంది సన్న, చిన్నకారు రైతులే. మేం పేదలం కాదా..? మా ప్లాట్లను ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయట్లేదు? సీఎం జగన్‌ పట్టించుకోరా అని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమకు కౌలు ఇవ్వట్లేదని ఎసైన్డ్‌ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో పేదలకు ఇచ్చే పింఛను రూ.5వేలకు పెంచుతామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఇంతవరకూ లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అప్పగించలేదు. అమరావతిని అభివృద్ధి చేయకుండా వేరే ప్రాంతాల నుంచి 50 వేల మంది పేదలను తీసుకొచ్చి.. వారికి ఉపాధి ఎలా కల్పిస్తారని రాజధాని పేదలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని