సీఎం సభ.. సామాన్యుల అవస్థలు

కొవ్వూరులో ‘జగనన్న విద్యాదీవెన’కు వచ్చిన వారు తీవ్ర అసౌకర్యాలకు లోనయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చినవారిని ఉదయం 8.45 నుంచే వేదిక వద్ద లోపలకు పంపించారు.

Updated : 25 May 2023 09:44 IST

న్యూస్‌టుడే బృందం: కొవ్వూరులో ‘జగనన్న విద్యాదీవెన’కు వచ్చిన వారు తీవ్ర అసౌకర్యాలకు లోనయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చినవారిని ఉదయం 8.45 నుంచే వేదిక వద్ద లోపలకు పంపించారు. ముఖ్యమంత్రి జగన్‌ 10.40 గంటలకు వేదికపైకి వచ్చారు. అప్పటివరకు ఉండలేక జనాలు ఆపసోపాలు పడ్డారు. పూర్తి స్థాయిలో కుర్చీలు లేక చాలామంది నిల్చునే ఉన్నారు. నీళ్ల ప్యాకెట్ల కోసం ఎగబడటంతో తోపులాట జరిగింది. ఉదయం 9 గంటలకే కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు, రాజమహేంద్రవరానికి చెందిన స్వయంసహాయక సంఘాల మహిళలు రోడ్‌షోలో పువ్వులు చల్లేందుకు భరించలేని ఎండలో నిల్చోవాల్సి వచ్చింది. వేదిక సమీపంలో మూడుగంటల పాటు వేడి భరించలేక సీఎం ప్రసంగం మధ్యలోనే వెనుక వైపు గ్యాలరీ నుంచి ప్రజలు బయటకు వచ్చేయడం కనిపించింది. వారిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వాగ్వాదమేర్పడింది.

*  కొవ్వూరు గామన్‌ వంతెనపై నుంచి కొవ్వూరు ప్రవేశ మార్గాన్ని నిలిపేయడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. విద్యా దీవెన సందర్భంగా పట్టణంలో పలుచోట్ల నీడలేని ప్రాంతాల్లో పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మండే ఎండలో చిన్నారులు అవస్థలు పడ్డారు.

*  తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలలోని వివిధ డిపోలనుంచి 40 బస్సుల చొప్పున, ఏలూరు జిల్లా నుంచి 37 బస్సులను తరలించడంతో ఆయా మార్గాల్లో ఆర్టీసీ సర్వీసులు లేక ప్రయాణికులు అష్టకష్టాలను అనుభవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని