ఆదాయం మెరుగు.. సేవలే తరుగు!

రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉండే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కొన్నింటిలో ఒక్క అధికారినే కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి.

Updated : 29 May 2023 05:09 IST

కీలక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఒక్క అధికారి ఉండటం వెనక మతలబేంటి?
మరొకరిని నియమిస్తే వాటాదారులు పెరుగుతారని భావిస్తున్నారా?
కక్షిదారులకు అందని ఉత్తమ సేవలు

ఈనాడు, అమరావతి: రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉండే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కొన్నింటిలో ఒక్క అధికారినే కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆదాయపరంగా కీలకమైన ఈ కార్యాలయాల్లో పోస్టింగులకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో రెండో అధికారి నియామకం తప్పనిసరి అయినప్పటికీ ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఆయా కార్యాలయాల్లో మరో అధికారిని నియమిస్తే తమ వాటాలు తగ్గుతాయన్న ఉద్దేశమే దీని వెనక కారణమన్న విమర్శలున్నాయి. పోస్టింగులకు డిమాండ్‌, దస్తావేజుల రిజిస్ట్రేషన్ల పరంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లో కలిపి సుమారు 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కీలకంగా ఉన్నాయి. శాఖకు వచ్చే ఆదాయంలో సింహభాగం ఈ కార్యాలయాలే సమకూరుస్తున్నాయి.

ఆయా కార్యాలయాల్లో అదనంగా ఒకరిద్దరు సబ్‌రిజిస్ట్రార్లను నియమిస్తే కక్షిదారులకు సేవలు మరింత సులభమవుతాయి. ఈ విషయంలో అడపాదడపా చర్చిస్తున్నప్పటికీ కార్యాచరణలో మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. విజయవాడ పటమట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ద్వారా ఏటా రూ.200 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఆదాయపరంగా ఎన్టీఆర్‌ జిల్లాలో ఈ కార్యాలయం అగ్రస్థానంలో ఉంది. సబ్‌రిజిస్ట్రార్‌ సెలవు పెట్టినా, కోర్టు పనిపై ఇతర ప్రాంతాలకు వెళ్లినా సీనియర్‌ అసిస్టెంట్‌కు బాధ్యతలను అప్పగిస్తున్నారు. గతంలో ఇక్కడి పోస్టింగు విషయంలోనే ముగ్గురు డీఐజీలపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. దీన్నిబట్టి ఈ కార్యాలయ ప్రాధాన్యం స్పష్టమవుతుంది. ఇంతకంటే కాస్త తక్కువగా రిజిస్ట్రేషన్లయ్యే కొన్ని కార్యాలయాల్లో ఇద్దరు చొప్పున సబ్‌రిజిస్ట్రార్లు ఉన్నారు.

విశాఖ, తిరుపతి, గుంటూరు జిల్లాల్లోనూ..

విశాఖ జిల్లాలో ఎనిమిది సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఏడాది కిందట జరిగిన బదిలీల తరువాత మధురవాడ, భీమిలి కార్యాలయాలను ఒక్కొక్కరితోనే కొన్నాళ్లు కొనసాగించారు. కొద్ది నెలల కిందట మధురవాడలో మాత్రమే రెండో సబ్‌రిజిస్ట్రార్‌ను నియమించారు. పెందుర్తి కార్యాలయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.69.87 కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది. ఇక్కడ ఒక సబ్‌రిజిస్ట్రార్‌ మాత్రమే ఉన్నారు. గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా అవుతున్నా రెండో అధికారిని నియమించడంపై చొరవ చూపడం లేదు. జిల్లా అధికారులు ఉండేచోట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మాత్రం ఇద్దరిని నియమిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు