ఆమ్యామ్యాలకు అమాత్యుని పేషీ ఒత్తిళ్లు?

‘మాది ఏముంది.. కిందిస్థాయి ఇంజినీర్లుగా పనిచేస్తున్నాం. మా ఈఎన్‌సీలు, సీఈలకే దిక్కులేదు. వాళ్లుచూసే సబ్జెక్టులే మార్చేసేందుకు చూస్తున్నారు.

Published : 31 May 2023 04:28 IST

ఈఎన్‌సీలు, సీఈల విభాగాలూ  మార్చేస్తామంటూ హెచ్చరికలు!
ఎన్‌హెచ్‌లో ఎస్‌ఈ, ఈఈ పోస్టులకు అధిక డిమాండ్‌
ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆర్‌అండ్‌బీలో ఆగని వసూళ్లు?

ఈనాడు, అమరావతి: ‘మాది ఏముంది.. కిందిస్థాయి ఇంజినీర్లుగా పనిచేస్తున్నాం. మా ఈఎన్‌సీలు, సీఈలకే దిక్కులేదు. వాళ్లుచూసే సబ్జెక్టులే మార్చేసేందుకు చూస్తున్నారు. అమాత్యుని పేషీ నిర్ణయించిన రేటు ఇవ్వకపోతే ఏదైనా జరుగుతుంది..’ ఇది ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లలో జరుగుతున్న చర్చ. ఆ శాఖలో ప్రస్తుతం జరుగుతున్న బదిలీల వ్యవహారంలో అమాత్యుని పేషీ ఏ స్థాయిలో ఒత్తిళ్లు చేస్తోందనడానికి ఇదో ఉదాహరణ. ఎన్ని ఆరోపణలు వచ్చినాసరే ఆర్‌అండ్‌బీలో ఇంజినీర్ల బదిలీల్లో వసూళ్ల దందా ఆగటంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వంలో ఇవే చివరి బదిలీలు కావడంతో వీలైనంత మేరకు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని సొమ్ము రాబడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

విభాగాలు మార్చేసేందుకు ప్రయత్నాలు

ఆర్‌అండ్‌బీలో ఇద్దరు ఈఎన్‌సీలు, అయిదుగురు సీఈలు ఉన్నారు. వీరిలో కొందరి విభాగాలను మార్చాల్సిందేనని అమాత్యుని పేషీ పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇటీవల ఆయా విభాగాధిపతులతో అమాత్యుని పేషీ సంప్రదింపులు చేసిందని, వారు అదే విభాగాల్లో కొనసాగేందుకు ఎంతోకొంత ఇవ్వాలనేలా మాట్లాడారని, అందుకు వాళ్ల నుంచి స్పందన లేకపోవడంతో.. వారి విభాగాలను మార్చేందుకు ఒత్తిళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఏపీఆర్‌డీసీ-రాష్ట్ర రహదారులకు కలిపి ఓ సీఈ ఉండగా, దీనిని రెండుగా విభజించి కొత్తగా వేరొకరికి సీఈ పోస్టు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

ఉండాలన్నా.. వెళ్లాలన్నా.. రేటే

* కొందరు ఇంజినీర్లు ప్రస్తుత స్థానంలో కొనసాగాలన్నా, తమకు నచ్చినచోటికి బదిలీ కావాలనుకున్నా.. అమాత్యుని పేషీ నిర్ణయించిన మొత్తం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం.

* ప్రస్తుతం రాష్ట్రంలో కోట్లాది రూపాయల జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ విభాగంలో పోస్టింగ్‌లకు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడింది.

* రాయలసీమ ఎన్‌హెచ్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా వెళ్లేందుకు, వైయస్‌ఆర్‌ జిల్లా రెగ్యులర్‌ విభాగం ఎస్‌ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అనంతపురం, కర్నూలు ఎన్‌హెచ్‌ ఈఈల పోస్టుల కోసం కొందరు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. విజయవాడ సర్కిల్‌ ఈఈ స్థానం కోసం కూడా పోటీ ఉన్నట్లు తెలిసింది.

* రెగ్యులర్‌ ఎస్‌ఈ పోస్టుల్లో.. రాయలసీమలో ఓ జిల్లా ఎస్‌ఈ వైయస్‌ఆర్‌ జిల్లాకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన సుదీర్ఘకాలం అదే జిల్లాలో ఈఈగా పనిచేశారు. మళ్లీ అక్కడికే పోస్టింగ్‌ కోసం చూస్తున్నట్లు సమాచారం.

* ఉత్తరాంధ్రలో ఓ ఎస్‌ఈ.. తన కుటుంబసభ్యుల ఆరోగ్య సమస్యల నేపథ్యంలో వైద్యసదుపాయాలు ఉండేచోటికి బదిలీ కోసం ప్రయత్నించారని సమాచారం. అందుకు పెద్ద మొత్తం డిమాండ్‌ చేయడంతో ఆ అధికారి సందిగ్ధంలో పడినట్లు తెలిసింది.

* ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ ఈఈని అదే స్థానంలో కొనసాగించాలంటూ అక్కడి ఎమ్మెల్యే స్వయంగా ఫోన్‌చేసి అమాత్యునికి చెప్పినట్లు సమాచారం. అయితే అలా కొనసాగేందుకు కొంత మొత్తం ఇవ్వాలంటూ ఈఈపై పేషీ నుంచి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

* ఓ ఈఈ గత ఏడాది బదిలీల సమయంలో కొంత సొమ్ము వెచ్చించి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఓచోటుకి బదిలీపై వెళ్లారని, ఇప్పుడు ఆయన అక్కడే కొనసాగేందుకు కూడా మళ్లీ మరికొంత ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

* ప్రస్తుతం పనిచేసే స్థానంలో రెండేళ్లలోపు సర్వీసు ఉన్నవారిని ఎట్టిపరిస్థితుల్లో బదిలీ చేయొద్దని ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ ఇటువంటి 20 మంది ఏఈ, డీఈలను బదిలీలు చేసేందుకు ఒత్తిళ్లు చేస్తున్నారు. ఈ మేరకు వారికి రెండు రోజుల కిందట కౌన్సిలింగ్‌ కూడా నిర్వహించారు. ఇంకా వారికి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఆయా ఏఈ, డీఈల నుంచి పెద్ద మొత్తంలోనే వసూళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

గుత్తేదారు ద్వారా వసూళ్లు

బదిలీలు కోరుతున్న ఇంజినీర్ల నుంచి సొమ్ము వసూళ్లుచేసే బాధ్యత ఒకరిద్దరు గుత్తేదారులకు అప్పగించినట్లు తెలిసింది. అమాత్యుని పేషీ సూచనలతో రావులపాలేనికి చెందిన ఓ గుత్తేదారు, మరొక చోటా గుత్తేదారు ఈ వ్యవహారం చూస్తున్నట్లు చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు