పేదల ఇళ్లపై పిడుగు!

సభ, సమావేశం.. వేదిక ఏదైనా సరే పేదలపై తమకే పేటెంట్‌ హక్కు ఉందనేలా పదే పదే మాట్లాడే ముఖ్యమంత్రి జగన్‌.. అదే పేదలకు గూడు లేకుండా చేస్తున్నారు.

Updated : 07 Jun 2023 06:07 IST

46 వేల మంది గృహాల రద్దు?
ఆ స్థానంలో అమరావతి లబ్ధిదారులకు కేటాయింపు
కేంద్రానికి నివేదించాలని నిర్ణయం
ఇప్పటికే వేల సంఖ్యలో రద్దు జాబితాలోకి
ఈనాడు - అమరావతి

సభ, సమావేశం.. వేదిక ఏదైనా సరే పేదలపై తమకే పేటెంట్‌ హక్కు ఉందనేలా పదే పదే మాట్లాడే ముఖ్యమంత్రి జగన్‌.. అదే పేదలకు గూడు లేకుండా చేస్తున్నారు. మాటెత్తితే 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. 22 లక్షల గృహాల్ని కట్టిస్తున్నామని చెప్పే ఆయన ఆర్థిక స్తోమత లేక కట్టుకునేందుకు ముందుకురాని 46 వేల మంది కడు పేదలకు కేటాయించిన ఇళ్లను రద్దు చేయబోతున్నారు. గడిచిన రెండేళ్లలో ఇప్పటికే పలుమార్లు కొన్ని వేల మంది పేదల ఇళ్లను రద్దు చేశారు. అది కనిపించకుండా వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను చేర్చి ‘లెక్క’ సరిచేస్తున్నారు. 2020 డిసెంబర్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ప్రభుత్వమే ఇళ్లు కట్టించాలని లబ్ధిదారులు అడిగితే నిర్మించి తాళాన్ని వారి చేతికి ఇస్తామని చెప్పిన జగన్‌.. ఆ తర్వాత చేతులెత్తేశారు. తమకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదని బడుగు, బలహీనవర్గాలు మొరపెట్టుకుంటున్నా కనికరించడం లేదు. నిర్దాక్షిణ్యంగా రద్దు జాబితాలో చేర్చేస్తున్నారు. పేదల పక్షాన నిలవడమంటే ఇదేనా అని ఆ అభాగ్యులు ప్రశ్నిస్తున్నారు. రద్దు చేయబోతున్న ఈ ఇళ్ల స్థానంలోనే రాజధాని అమరావతిలో స్థలాలు కేటాయించిన వారికి మంజూరు చేయాలని కేంద్రానికి నివేదించనున్నారు. కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు.

53 వేల కొత్త ఇళ్ల మంజూరుకు ప్రతిపాదన

‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం పర్యవేక్షణకు సెంట్రల్‌ శాంక్షనింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (సీఎస్‌ఎంసీ) సమావేశాన్ని నెలకోసారి నిర్వహిస్తుంది. ఈ కమిటీ ఆమోదిస్తేనే ఈ పథకం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మినహా ఇంటి నిర్మాణానికి దాదాపుగా కేంద్ర ప్రభుత్వ సాయంపైనే ఆధారపడింది. ఈ నేపథ్యంలో ఇళ్ల మంజూరుకు సీఎస్‌ఎంసీ ఆమోదం తప్పనిసరి. అయితే ఈ పథకం కింద వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు మంజూరు చేసిన ఇళ్లను 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం నిర్దేశించింది. కొన్ని నెలలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఇళ్లు మంజూరు చేయాలని కోరినా ససేమిరా అంటోంది. దీంతో కొత్త ఎత్తుగడ వేసిన జగన్‌ ప్రభుత్వం.. వివిధ కారణాలతో ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు రాని పేదల పేరిట మంజూరైనవి రద్దు చేసి, కొత్తగా ఎంపిక చేసిన వారి పేరు మీద కేటాయించాలని కోరుతోంది. ఆ ప్రకారమే కేంద్రం కూడా అనుమతి ఇస్తోంది.

తాజాగా రాజధానేతరులకు అమరావతిలో 50 వేల ఇళ్ల స్థలాలు కేటాయించింది. వీరి ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. జులైలో ఇక్కడ ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఈ నెలలో దిల్లీలో జరిగే సీఎస్‌ఎంసీ సమావేశంలో కేంద్రం నుంచి అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి పొందేలా అధికారులు నివేదిక సిద్ధం చేశారు. 46,928 ఇళ్లను రద్దు చేసి వాటి స్థానంలో 53,011 గృహాల్ని కొత్తగా మంజూరు చేయాలని కోరబోతున్నట్లు తెలిసింది. కొత్త మంజూరులో ఎన్టీఆర్‌ జిల్లాలో 23,821, గుంటూరు జిల్లాలో 23,196, వైయస్‌ఆర్‌ జిల్లాలో 2,431, ప్రకాశం జిల్లాలో 1,866, మిగతావి కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఉన్నాయి.

రద్దు జాబితాలో సీఎం సొంత జిల్లాకు 2వ స్థానం

మొత్తంగా 148 ప్రాజెక్టుల పరిధిలోని 46,928 గృహాల్ని రద్దు చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో అత్యధికంగా నంద్యాల జిల్లాలో 8,959 ఉండగా.. ఆ తర్వాత స్థానం ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వైయస్‌ఆర్‌దే. ఇక్కడ 15 ప్రాజెక్టుల పరిధిలో 8,126 ఇళ్లను రద్దు జాబితాలో చేర్చారు. అనకాపల్లి జిల్లాలో 4,806, పల్నాడులో 3,094 ఇళ్లు ఆ జాబితాలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని