Botsa: తెలంగాణది బోగస్‌ జీవో.. కావాలంటే చెక్‌ చేసుకోండి: మంత్రి బొత్స

ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో బోగస్‌ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Updated : 16 Jun 2023 12:23 IST

విజయనగరం, న్యూస్‌టుడే: ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో బోగస్‌ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కావాలంటే వెళ్లి పరిశీలించుకోవాలని వైద్యారోగ్యశాఖ ఒప్పంద ఉద్యోగులపై మండిపడ్డారు. వివిధ జిల్లాల నుంచి పలు శాఖలకు చెందిన ఒప్పంద ఉద్యోగులు గురువారం విజయనగరం చేరుకుని మంత్రిని కలిసి, తమను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో 960 మందికే ఉద్యోగాలు వచ్చాయి. ఇక్కడ పదివేల మందికి ఇస్తాం. ఒకవేళ ఇప్పుడు అవ్వకపోయినా.. మళ్లీ జగన్‌ సీఎం అయ్యాక 2026లో క్రమబద్ధీకరిస్తాం’ అని పేర్కొన్నారు. బోధనేతర సిబ్బందికి ఈలోపు ఉద్యోగోన్నతులు వస్తే 2026 వరకు తమ ఉద్యోగాలు ఉండవని కొందరు వాపోగా.. తెలియకుండా మాట్లాడొద్దని ఆగ్రహించారు. ‘ఒప్పంద ఉద్యోగాలు పోవు.. దీనికి నేను గ్యారంటీ. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు చేస్తాం’ అన్నారు. ఈ క్రమంలో కొందరు తెలంగాణ జీవోను ప్రస్తావించగా.. అది బోగస్‌ జీవో అని, కావాలంటే డబ్బులిచ్చి ఇద్దరిని పంపిస్తా.. పరిశీలించుకోవాలని బదులిచ్చారు.


కోట్లు అంటే ఉలెన్‌ కోట్లు అనుకున్నారేమో

ఈనాడు, విశాఖపట్నం: ‘‘రాష్ట్రంలో రూ.5లక్షల కోట్ల అవినితి జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అనడం తప్పు. కోట్లు అంటే ఉలెన్‌ కోట్లు అనుకున్నారేమో. మమ్మల్ని విమర్శించాలంటే నిర్మాణాత్మకంగా మాట్లాడాలే తప్ప, నిరాధార ఆరోపణలు చేయడం కేంద్ర పెద్దలకు తగదు. విదేశాల్లో నల్లధనం ఉందని, మనిషికో లక్ష ఇస్తామని చెప్పి తెచ్చుకుని పంచుకోవడం అనుకున్నారా’’ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా పెద్దలు చేసిన ఆరోపణలు సత్యదూరమన్నారు. ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేకహోదా గురించి అడుగుతూనే ఉన్నారని.. రాష్ట్రంపై భాజపాకు అంత ప్రేమ ఉంటే ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వలేదన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగుండాలనే తాము కొన్ని అంశాల్లో సహకరించామన్నారు.

పవన్‌కు ఆ మాటలు ఎందుకు?

‘పవన్‌కల్యాణ్‌ తిరిగితే మాకేమైంది... ఆయన యాత్ర ప్రారంభించి 24 గంటలు దాటింది. ఏమైనా ఆటంకాలు ఎదురయ్యాయా? తమకు తామే రాజకీయ లబ్ధి కోసం ఏదేదో సృష్టించుకోవడం సరికాదు. రక్తపు మరకలు ఎవరికి అంటాయి.. ఆ మాటలు ఎందుకు..? తైతక్కలాడే పవన్‌ మనకు అవసరమా.. అని మేం కూడా అనగలం’ అని బొత్స అన్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని