ఓటర్ల జాబితా ప్రక్షాళనకు సువర్ణావకాశం

ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉంటే.. భార్యకు ఉండదు. దశాబ్దాల తరబడి ఒకే చిరునామాలో నివసిస్తున్నవారి పేర్లు ఆ ప్రాంత ఓటర్ల జాబితాలో కనిపించవు.

Published : 16 Jul 2023 03:40 IST

21 నుంచి నెలరోజులపాటు బీఎల్వోల ఇంటింటి పరిశీలన
ప్రతిపక్షాలు శ్రద్ధ చూపితే దొంగ ఓట్లకు చెక్‌
తొలగించిన ఓట్లు తిరిగి చేర్పించొచ్చు
ఓటుందో లేదో చూసుకోవాల్సిన  బాధ్యత ఓటర్లదే

ఈనాడు- అమరావతి: ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉంటే.. భార్యకు ఉండదు. దశాబ్దాల తరబడి ఒకే చిరునామాలో నివసిస్తున్నవారి పేర్లు ఆ ప్రాంత ఓటర్ల జాబితాలో కనిపించవు. బతికున్నవారికి ఓట్లు ఉండవు.. ఏళ్ల కిందట చనిపోయినవారికి మాత్రం ఓటు హక్కు కొనసాగుతుంటుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసిన వారి పేర్ల జాడ ప్రస్తుత జాబితాలో దొరకనే దొరకదు. ఒకే కుటుంబంలోని కొందరి ఓట్లు ఒక పోలింగ్‌ కేంద్రం పరిధిలో మరికొందరి పేర్లు మరో పోలింగ్‌ కేంద్రంలో ఉంటాయి. మరికొన్ని కుటుంబాల్లో అందరి ఓట్లు గల్లంతైపోయాయి. ఒకే డోర్‌ నంబర్‌లో వందల సంఖ్యలో ఓటర్లున్నట్లు నమోదు చేయడం మరింత విచిత్రం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గ ఓటర్ల జాబితా చూసినా ఇలాంటి అవకతవకలు, అక్రమాలు కోకొల్లలు. అధికార వైకాపా నాయకులు వాలంటీర్ల ద్వారా ప్రతిపక్ష పార్టీలకు చెందిన అర్హుల ఓట్లు తొలగించారని, తమకు అనుకూలించేలా పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు చేర్పించారన్న ఫిర్యాదులున్నాయి. పలు నియోజకవర్గాల్లో ‘ఈనాడు’ వీటిని ఆధారాలతో బయటపెట్టింది. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలపైన ఉంది. అలాగే ఓటర్ల జాబితాలో పేరుందా లేదా అని తనిఖీ చేసుకోవటం ఓటర్లందరి కనీస బాధ్యత. ఏ మాత్రం అలక్ష్యం చేసినా.. రాబోయే ఎన్నికల్లో ఓటేసే అవకాశం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

వాలంటీర్లను కచ్చితంగా దూరంగా ఉంచితేనే..

ఓటరు నమోదు సహా ఎన్నికల పనులేవీ వాలంటీర్లకు అప్పగించొద్దని ఎన్నికల సంఘం పలుమార్లు ఆదేశాలిచ్చింది. అవేవీ క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు. ఓటరు నమోదు, తొలగింపు, ఓటుకు ఆధార్‌ అనుసంధానం తదితర పనులన్నింటిలో చాలా చోట్ల వాలంటీర్లదే కీలకపాత్ర. తెదేపా సహా ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల ఓట్లను వారికి తెలియకుండానే తొలగించటంతో పాటు అధికార పార్టీ మద్దతుదారుల ఓట్లను పెద్ద ఎత్తున చేర్పిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో తెదేపా మద్దతుదారుల ఓట్లు తొలగించటంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు వచ్చి విచారణ జరిపారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తొలగించారని, వీటిలో అత్యధికం తెదేపా సానుభూతిపరులవేనన్న ఫిర్యాదులున్నాయి. గుంటూరు పశ్చిమ, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గాల్లో ఒకే ఇంటి చిరునామాతో వందల కొద్దీ దొంగ ఓట్లు నమోదై ఉండటం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల ఓట్ల నమోదులోనూ వాలంటీర్లు భారీగా దొంగ ఓట్లు నమోదు చేయించారు. సంతకం చేయటం రానివారు కూడా పట్టభద్రుల ఓటేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే త్వరలో జరిగే ఇంటింటి తనిఖీల ప్రక్రియ దరిదాపులకు కూడా వాలంటీర్లు రాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉంది. అందుకు విరుద్ధంగా ఎవరైనా పాల్గొంటే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఏ తేదీల్లో ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తారో షెడ్యూల్‌ కూడా ముందస్తుగానే విడుదల చేయాలి. ఆ సమాచారాన్ని ప్రతిపక్ష పార్టీలకు కచ్చితంగా ఇవ్వాలి. అప్పుడే ఈ ప్రక్రియ మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.


అక్రమాలు బట్టబయలు చేయొచ్చు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ- 2024లో భాగంగా ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకూ నెల రోజుల పాటు బూత్‌ స్థాయి అధికారు (బీఎల్వో)లతో ఎన్నికల సంఘం ఇంటింటి తనిఖీలు నిర్వహించనుంది. ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీల ఏజెంట్లు బీఎల్వోల వెంట వెళ్లి తనిఖీల్లో పాల్గొనేందుకు వీలు కల్పించింది. ఈ నెల రోజులపాటు ప్రతిపక్ష పార్టీలు శ్రద్ధ పెడితే క్షేత్రస్థాయిలో వారు గుర్తించిన అక్రమాలను సరిచేయించొచ్చు. అర్హులు ఓటు హక్కు కోల్పోకుండా చూడొచ్చు.

  • ఓటర్ల జాబితాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలను బయటపెట్టి అవి లేకుండా చేయటానికి ప్రతిపక్ష పార్టీలకు ఇది మంచి అవకాశం.
  • మృతులు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఇతర నకిలీ ఓట్లను ఆధారాలు చూపి, జాబితా నుంచి తొలగించేలా చేయొచ్చు.
  • అర్హులకు ఓటు హక్కు లేకపోతే వారి వివరాలు నమోదు చేయించొచ్చు.
  • అర్హులైనా ఓటు తొలగించి ఉంటే వారితో మళ్లీ దరఖాస్తు చేయించొచ్చు.
  • ఒకే డోర్‌ నంబర్‌తో వందల సంఖ్యలో బోగస్‌ ఓట్లు ఉంటే వాటినీ తొలగింపజేయొచ్చు.
  • వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో అక్టోబరు 17న ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తుంది. అందులోనూ ఇవే అవకతవకలు కొనసాగి, అర్హులకు ఓటు లేకపోతే అక్టోబరు 17 నుంచి నవంబరు 30 వరకూ క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సమర్పించొచ్చు.
  • అవన్నీ పరిగణనలోకి తీసుకుని 2024 జనవరి 5న ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తుంది. దానిలో లోపాలున్నా కూడా దరఖాస్తు చేసుకుని సరిచేయించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని