నిధులొచ్చే మార్గమున్నా.. నీళ్లిచ్చే మనసు లేదు

జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పథకం కోసం నిధులిచ్చాం. 2021-22 తర్వాత ఒక్క పైసా కూడా వినియోగించుకోలేకపోయిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఇది అత్యంత విచారకరం.

Updated : 06 Aug 2023 08:50 IST

పేదల దప్పిక తీర్చడంలో జగన్‌ సర్కారు నిర్లక్ష్యం
జల్‌జీవన్‌ మిషన్‌ పథకంపై అలసత్వం
జాతీయ స్థాయిలో అట్టడుగున రాష్ట్రం
ఇటీవలే రాజ్యసభలో కడిగేసిన కేంద్రమంత్రి
ఈనాడు, అమరావతి

జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పథకం కోసం నిధులిచ్చాం. 2021-22 తర్వాత ఒక్క పైసా కూడా వినియోగించుకోలేకపోయిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఇది అత్యంత విచారకరం.

రాజ్యసభ సాక్షిగా జులై 24న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పిన మాట ఇది.


ఈ పథకం ఎందుకోసం అంటే:

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలి. 2024 చివరి నాటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకుని, రోజూ తలా ఒక్కింటికి 55 లీటర్ల రక్షిత తాగునీటిని సరఫరా చేయాలి.

నిధుల కేటాయింపు:

మొత్తం అంచనా వ్యయం రూ. 26,309 కోట్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా భరించాలి.

వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా?:

కేంద్రం నిధులిచ్చినా మన రాష్ట్ర వాటా ఇవ్వటం లేదు. కనీసం కేంద్ర నిధులనైనా ఖర్చు చేసిందా? అంటే అదీ లేదు. ఈ పథకం అమల్లో జాతీయ స్థాయిలో అట్టడుగున నిలిచి రాష్ట్ర పరువును తీసేసింది.


మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుసు. ఏటా వేసవి వచ్చిందంటే మైళ్ల దూరం నడిచి వెళ్లి, నీళ్లు తెచ్చుకుంటున్న జనం కష్టాలను చూస్తున్నాం. పొలాలు, వాగులు, చెరువుల్లోని కలుషిత నీటితో గొంతు తడుపుకుంటున్న వైనాన్నీ వింటున్నాం. కలుషిత నీరు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న గ్రామీణుల అవస్థలు మనసున్న ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నా... సీఎం జగన్‌ను మాత్రం కదిలించలేకపోయాయి. వారి దాహాన్ని తీర్చేందుకు ఉద్దేశించిన జేజేఎం పథకాన్ని వినియోగించుకోలేని అసమర్ధత కారణంగా ప్రజలు బలైపోవాల్సిన దుస్థితికి కారకులెవరు? ఉన్న నిధులనూ ఎందుకు వినియోగించుకోలేకపోయారు? అనవసర విషయాల్లో గొంతెత్తి గోల చేసే మంత్రులు.. అవసరమైన అంశాల్లో ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు? తెల్లారి లేస్తే విపక్షాల నేతలపై అక్రమ కేసులు పెట్టి ఎలా వేధించాలి? అమరావతిని ఎలా ధ్వంసం చేయాలన్న ఆలోచనలే తప్ప.. ప్రజలకు మంచి చేసే పనులపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు?


ప్రాజెక్టులే లేవు.. అనుసంధానమెలా?

జేజేఎంలో భాగంగా రూ. 8,395 కోట్లతో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రతిపాదించిన భారీ తాగునీటి ప్రాజెక్టుల్లో ఇంతవరకు కదలిక లేదు. పనులెప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే సర్వే చేస్తున్నారు.  ఇవి పూర్తయ్యాకే పైపులైన్ల ద్వారా గ్రామాల్లోని రక్షిత తాగునీటి పథకాలకు నీరివ్వాల్సి ఉంటుంది.


తెలంగాణకు ప్రథమ బహుమతి

తెలంగాణలోని గ్రామాల్లో 53.98 లక్షల ఇళ్లకు  కనెక్షన్లు ఇచ్చారు. వేసవిలోనూ ఇబ్బంది లేకుండా ప్రజలకు తాగునీరిస్తున్నారు. గ్రామాల్లో వంద శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించి జల్‌జీవన్‌ అవార్డు-2022 కింద ప్రథమ బహుమతి అందించింది. రూ. 36,900 కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు కృష్ణా, గోదావరి నీళ్లు అందిస్తున్నారు.


మనం అధోగతి

రాష్ట్రంలోని గ్రామాల్లో 95,54,840 ఇళ్లుండగా.. జేజేఎం ప్రారంభమైన నాటికి 30.74 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. ఈ పథకం మొదలయ్యాక ఇప్పటి వరకు 36.21 లక్షల ఇళ్లకు కొత్తగా ఇచ్చారు. ఇంకా 28.50 లక్షల ఇళ్లకు ఎపుడిస్తారో ఆ దేవుడికే తెలియాలి. బాపట్ల జిల్లాలో 39.20%, శ్రీకాకుళంలో 31.30%, పల్నాడులో 30.90% ఇళ్లకు మాత్రమే కనెక్షన్లున్నాయి.


కనెక్షన్ల సంఖ్య సరే... నీళ్లేవీ?

రాష్ట్రంలో 36.21 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినా.. వీటిని గ్రామాల్లో ఇప్పటికే ఉన్న రక్షిత తాగునీటి పథకాలకు అనుసంధానిస్తున్నారు. ఆ నీరు సరిపోక అత్యధిక ప్రాంతాల్లో కుళాయిలు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. ఉమ్మడి ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.


మనకంటే చిన్న రాష్ట్రాలే నయం

చిన్న రాష్ట్రాలు సైతం జల్‌జీవన్‌ మిషన్‌ను చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. కేంద్రంతో సమానంగా రాష్ట్ర వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ పనులు సజావుగా సాగేలా చూస్తున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రజల గొంతు తడపగలుగుతున్నాయి.

  • 9 రాష్ట్రాలు వందశాతం ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చి ప్రజలకు తాగునీటిని అందిస్తున్నాయి.
  • ఛత్తీస్‌గఢ్‌లో జేజేఎం పనులకు ఏపీలోని గుంటూరు జిల్లా నుంచి కూలీలు వెళ్తుతున్నారు. ఈ రాష్ట్రంలోని గ్రామాల్లో 50,11,392 ఇళ్లుండగా జేజేఎం పథకానికి ముందు కేవలం 3,19,741 ఇళ్లకే కుళాయిలున్నాయి. పథకం వచ్చాక ఇప్పటివరకు 23,88,543 ఇళ్లకు కొత్తగా కుళాయి కనెక్షన్లు ఇచ్చారు.
  • ఒడిశా గ్రామీణ ప్రాంతాల్లో జేజేఎం కింద 52,21,615 ఇళ్లకు కొత్తగా కుళాయిలిచ్చారు.
  • దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ జేజేఎం పథకాన్ని అక్కడి ప్రభుత్వం చక్కగా ఉపయోగించుకుంటోంది. పథకం ప్రారంభం నాటికి గ్రామాల్లో 5,16,221 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. జేజేఎం ద్వారా 1,37,40,286 కొత్త కనెక్షన్లు ఇవ్వగలిగారు.

రూ. 3,514.68 కోట్లు పోయినట్టే!

  • మన రాష్ట్రంలో జేజేఎం పనులు మొదలైంది 2019-20లో. అంచనా వ్యయం రూ. 26,309 కోట్లు.
  • 2019-20లో కేంద్రం ఇచ్చింది రూ. 372.64 కోట్లు.  
  • 2020-21లో కేంద్రం మంజూరు చేసిన మొత్తం రూ. 790.48 కోట్లు. జగన్‌ సర్కారు సకాలంలో ఖర్చు చేయకపోవటం, రాష్ట్ర వాటా ఇవ్వకపోవటంతో కేంద్రం రూ. 297.62 కోట్లనే ఇచ్చింది.
  • 2021-22లో కేంద్రం రూ. 3,812.88 కోట్లు మంజూరు చేసింది. తొలి విడతగా రూ. 791.06 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలో రూ. 40 కోట్లను ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో జత చేసింది. దీంతో 2021-22 సంవత్సరానికి కేంద్రం ఇవ్వాల్సిన మిగిలిన మొత్తం ఇక రానట్టే లెక్క.
  • మొత్తమ్మీద 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3,514.68 కోట్లను రాష్ట్రం కోల్పోయినట్టయింది.
  • 2022-23 సంవత్సరానికి కేంద్రం రూ. 3,458.20 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు ఆ నిధులేమీ ఇవ్వలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని