Botsa Satyanarayana: బొత్స కుటుంబానికి బొనాంజా

విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఏపీఐఐసీ గ్రోత్‌సెంటర్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన సత్య బయోఫ్యూయల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 30 ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టింది.

Updated : 18 Aug 2023 12:22 IST

బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో కారుచౌకగా భూమి కేటాయింపు
డిస్టిలరీ ఏర్పాటు కోసం సత్య బయో ఫ్యూయల్స్‌కు 30 ఎకరాలు
ఆ కంపెనీ డైరెక్టర్లు ఇద్దరూ మంత్రి బొత్స సోదరులే
ఎకరం రూ.82 లక్షలున్న భూమి రూ.10 లక్షలకే
రూ.21.56 కోట్ల అనుచిత లబ్ధి
చుట్టుపక్కల బహిరంగ మార్కెట్‌లో ఎకరం సుమారు రూ.3 కోట్లు
ఈనాడు - అమరావతి

విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఏపీఐఐసీ గ్రోత్‌సెంటర్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన సత్య బయోఫ్యూయల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 30 ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టింది. ఏపీఐఐసీ లెక్కల ప్రకారం ఎకరం రూ.81.93 లక్షల ధర ఉన్న భూమిని రూ.10 లక్షలకే ధారాదత్తం చేసేసింది. బొత్స సోదరులు సతీష్‌కుమార్‌, ఆదినారాయణ డైరెక్టర్లుగా ఉన్న ఆ కంపెనీ ప్రభుత్వం కేటాయించిన భూమిలో డిస్టిలరీ, ఇథైల్‌ ఎసిటేట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఇందులో తయారుచేసే ఇథనాల్‌ను మద్యం ఉత్పత్తిలోనూ, ఫార్మా తదితర పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు. ఈ పరిశ్రమలకు భూ కేటాయింపునకు సంబంధించి జులై 21న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో గురువారం వెలుగులోకి వచ్చింది. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో సత్య బయో ఫ్యూయల్స్‌కు ఎకరం రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం భూమి కేటాయించింది. ఇక్కడ ఏపీఐఐసీ నిర్ణయించిన ధర చదరపు మీటరుకు రూ.2,025. ఆ లెక్కన ఎకరం విలువ రూ.81.93 లక్షలు. కానీ బొత్స కుటుంబ కంపెనీకి ప్రభుత్వం ఎకరం రూ.10 లక్షల చొప్పున కేటాయించడం వల్ల సుమారు రూ.21.56 కోట్ల అనుచిత ప్రయోజనం చేకూర్చినట్టయింది. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌కు చుట్టుపక్కల బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి ధర రూ.2-3 కోట్ల వరకు ఉంది. పరిశ్రమలకు ప్రభుత్వం రాయితీలివ్వాల్సిందే. పెట్టుబడుల్ని ప్రోత్సహించాల్సిందే. వెనుకబడిన ఉత్తరాంధ్రకు పరిశ్రమలు రావడాన్ని మరింతగా స్వాగతించాల్సిందే. కానీ ముఖ్యమంత్రి జగన్‌ తన మంత్రివర్గ సహచరుడి కుటుంబానికి చెందిన కంపెనీకి... ప్రభుత్వ విధానం ప్రకారం నిర్ణయించిన ధర కంటే కూడా బాగా తగ్గించి, కారుచౌకగా భూమి కట్టబెట్టడంపైనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఆగమేఘాల మీద కేటాయింపు

బొత్స కుటుంబ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపు ప్రక్రియను ఆగమేఘాల మీద పూర్తి చేసింది. రాయితీపై భూమి కేటాయించాల్సిందిగా ఆ కంపెనీ సీఈఓ ఈ ఏడాది జూన్‌ 21న ముఖ్యమంత్రి కార్యాలయానికి దరఖాస్తు పెట్టుకున్నారు. అయిదు రోజుల్లోనే జూన్‌ 26న ముఖ్యమంత్రి కార్యదర్శి దాన్ని పరిశ్రమల శాఖకు పంపించారు. ఆ పరిశ్రమకు వేగవతి నది నుంచి నీరు కేటాయిస్తూ మర్నాడే (జూన్‌ 27) జలవనరులశాఖ జీవో జారీ చేసింది. జులై 10న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) సమావేశం ఆ కంపెనీకి భూమి కేటాయింపునకు సిఫారసు చేసింది. జులై 11న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన పరిశ్రమల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జులై 27న జీవో ఇచ్చేశారు.


వెయ్యి లీటర్ల నీళ్లు రూ.5

త్య బయో ఫ్యూయల్స్‌ సంస్థ రూ.235.30 కోట్లతో రోజుకు 200 కిలో లీటర్ల ఉత్పాదక సామర్థ్యంతో ‘గ్రెయిన్‌ బేస్డ్‌ డిస్టిలరీ ప్లాంట్‌’, రూ.14.70 కోట్లతో ‘ఇథైల్‌ ఎసిటేట్‌ ప్లాంట్‌’ ఏర్పాటు చేయనున్నట్టు ఆ జీవోలో పేర్కొన్నారు. దాని వల్ల 200 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. వేగవతి నది నుంచి రోజుకు 1600 కిలోలీటర్ల (కిలోలీటర్‌ అంటే 1000 లీటర్లు) చొప్పున సంవత్సరానికి 0.013 టీఎంసీల జలాల్ని ఆ పరిశ్రమలో ఇథనాల్‌ తయారీ కోసం కేటాయించినట్లు జీవోలో పేర్కొన్నారు. కిలో లీటరు నీటిని రూ.5కే ఇవ్వనున్నారు. సత్య బయోఫ్యూయల్స్‌ కంపెనీని 2013 సెప్టెంబరు 6న ఏర్పాటు చేశారు. కంపెనీ రిజిస్టర్డ్‌ కార్యాలయం హైదరాబాద్‌లోని బేగంపేట చిరునామాతో ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని