పెత్తందారు పాలనలో.. పెట్రో పన్నుల బాదుడు

2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎక్కడ సభ పెట్టినా పెట్రోల్‌, డీజిల్‌పై బాదుడేబాదుడంటూ ఘోషించారు కదా? పక్క రాష్ట్రాల కంటే లీటరుపై రూ.5-7 ఎక్కువని వాపోయారు కదా?

Updated : 23 Aug 2023 09:47 IST

నాడు ఇతర రాష్ట్రాల కంటే  లీటరుకు రూ.7 ఎక్కువని గగ్గోలు
నేడు లీటరుకు రూ.15 అధికంగా ఉన్నా నోరు మెదపని సీఎం జగన్‌
దేశంలో ఏపీలోనే అత్యధిక ధరలు
చిరు వ్యాపారులు, రైతులపై  పెనుభారం
2022-23లో పెట్రో పన్నుల రాబడి రూ.16,429 కోట్లు


ముఖ్యమంత్రి జగన్‌ గారూ?

2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎక్కడ సభ పెట్టినా పెట్రోల్‌, డీజిల్‌పై బాదుడేబాదుడంటూ ఘోషించారు కదా? పక్క రాష్ట్రాల కంటే లీటరుపై రూ.5-7 ఎక్కువని వాపోయారు కదా? ఓ అన్నా, ఓ అక్కా మీకు బైకులున్నాయా? ట్రాక్టర్లున్నాయా? పెట్రోలు, డీజిల్‌ పోయించి బిల్లులు తీసుకోండి, ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దులకు వెళ్లండంటూ ప్రేరేపించారు కదా? మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే మీరు.. అవే మాటలు ఇప్పుడూ చెప్పగలరా? ఏపీలోని పెట్రోలు, డీజిల్‌ ధరలను పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూడండి అని ప్రజలకు పిలుపునివ్వగలరా? మచ్చుకు కోనసీమ జిల్లా కేసనకుర్రుతో పోల్చితే, పక్కనే యానాంలో లీటరు పెట్రోలుపై రూ.15.77, డీజిల్‌పై రూ.13.23 తక్కువ అన్న సంగతిని అంగీకరిస్తారా?


పెట్రో ధరలు మన రాష్ట్రంలో ఉన్నట్లు మరెక్కడా లేవంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాటి ప్రభుత్వంపై జగన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2019లో తానే సీఎం అయ్యాక అప్పటి వరకు పెట్రోలుపై 31%, లీటరుకు రూ.2 అదనపు సుంకం, డీజిల్‌పై 22.5%, లీటరుకు రూ.2 అదనపు సుంకాన్ని పెంచేశారు. రోడ్డు సుంకం రూపంలో రూ.1 (దీనిపై వ్యాట్‌ అదనం) చొప్పున వడ్డించారు. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అయిన జగన్‌ తన ప్రభుత్వ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలందరూ కోటీశ్వరులయ్యారునుకున్నారో ఏమో.. దేశంలో ఎక్కడా లేనంతగా పన్నుల భారాన్ని మోపారు. పెట్రో ఛార్జీలనే రాష్ట్ర రాబడికి ఇంధన వనరుగా మార్చుకున్నారు. 2019-20తో పోల్చితే 2022-23 నాటికి నాలుగేళ్లలో ప్రభుత్వ రాబడి 61.57 శాతం పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో 2014-15తో పోల్చితే 2018-19 నాటికి అయిదేళ్లలో ఈ పెరుగుదల 22.87 శాతం మాత్రమే. అలాగని వైకాపా వచ్చాక పెట్రో ఉత్పత్తుల వాడకం భారీగా పెరిగిందేమీ లేదు. నాలుగేళ్లలో 4.39% మాత్రమే పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తులపై పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.16,429 కోట్లు, గ్యాస్‌, ఇతర ఉత్పత్తులపై మరో రూ.290 కోట్లు సమకూరింది. అదనపు సుంకం, రోడ్డు సుంకం రూపంలో వసూలు చేస్తున్న సర్కారు.. రోడ్లపై గుంతలు పూడ్చక పోవడం గమనార్హం.

చిరు వ్యాపారులనూ వదలరా?

పెత్తందారు పాలనలో బాదుడంటే ఇలాగే ఉంటుందని జగన్‌ చెప్పకనే చెబుతున్నారు. చమటోడ్చే రైతులనూ, బైక్‌లపై ఊరూరా తిరుగుతూ సరకులు అమ్ముకునే చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లనూ వదల్లేదు. జనరేటర్లు వాడే ఆక్వా రైతులు, పరిశ్రమల యజమానులపై పెనుభారాన్ని మోపారు. ఇంధన ధరలు పెంచి, వారి ఆదాయానికి కత్తెరేస్తున్నారు. జగన్‌ సీఎం అయ్యే నాటికి పెట్రోలు ధర విజయవాడలో లీటరు రూ.76.89. ఇప్పుడు రూ.111.50. లీటరుపై రూ.34.60పైనే పెరిగింది. గ్రామాల్లో తిరుగుతూ వివిధ వస్తువులు అమ్ముకునే చిరు వ్యాపారి రోజుకు 2 లీటర్ల పెట్రోలు వాడినా, గతంతో పోల్చితే అదనపు ఖర్చు సుమారు రూ.70. నెలలో 25 రోజులు వ్యాపారం చేశాడనుకుంటే ఈ మొత్తం రూ.1,750. ఏడాదికి రూ.21,000. అమ్మఒడి కిందో, వాహనమిత్ర కిందో సర్కారు ఇచ్చేదెంత? సామాన్యుడి నుంచి లాగుతుంది ఎంత? అన్నది ఈ లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి.

ఆ రాష్ట్రాల స్ఫూర్తి ఏదీ..?

2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో కర్ణాటకలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు 20% పెరగ్గా, పన్నుల రూపేణా ఆదాయం 1% మాత్రమే పెరిగింది. రాష్ట్ర పన్నులు తగ్గించడమే రాబడి పెరగకపోవడానికి కారణం. అదే ఏపీలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు 6.40% మాత్రమే పెరగ్గా, పన్నుల రాబడి 11.58% పెరగడం గమనార్హం. ఆదాయం రాకున్నా సరే..సామాన్యులపై భారం మోపకూడదని పలు రాష్ట్రాలు పెట్రో పన్నుల భారాన్ని తగ్గించాయి. వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలన్నింటా ఏపీలోనే పెట్రో ఉత్పత్తులపై ఆదాయం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.

ధరలను పోలిస్తే..

ఏపీలోని సరిహద్దు గ్రామాల వారు రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ కొనలేక పొరుగున కర్ణాటక, తమిళనాడు, యానాం వెళ్లి పోయించుకుంటున్నారు. అక్కడ అమ్మకాలు పెరుగుతున్నాయి.  తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లీటరుపై రూ.5-7 ఎక్కువగా ఉంటే బాదుడే బాదుడంటూ అరచి గగ్గోలు పెట్టిన జగన్‌కు తన పాలనలో మరింత ఎక్కువగా ఉన్న విషయం తెలియదా, తెలిసీ పెత్తందారు పాలనలో ఇంతేనని సందేశమిస్తున్నారా అన్నది ప్రశ్న ?

ఇచ్చేదెంత? గుంజేదెంత?

పెట్రో పన్నుల పెంపుతో రైతులపై పడిన భారం అంతాఇంతా కాదు. డీజిల్‌ వాడే ట్రాక్టర్‌తో నాగలి తోలకమే ఎకరాకు రూ.1,300 నుంచి రూ.2 వేలకు చేరింది. గొర్రు, గుంటక సాలుకు రూ.300 వరకు పెరిగి ఎకరాకు రూ.600కు చేరింది. దమ్ము, విత్తనం వేయడం తదితర యంత్ర సేద్య పనులకు ఎకరాకు రూ.4 వేల వరకు అదనంగా ఖర్చవుతోంది. పంట ఉత్పత్తులు, కూలీల రవాణాకు వాడే ఆటోలు, ట్రాక్టర్లు, లారీల బాడుగ గతం కంటే రూ.3 వేలకు పైగా పెరిగింది.  ఈ లెక్కన ఏడాది భారం రూ.12,500పైనే. సర్కారు చెల్లించే రైతు భరోసా ఎంత? పెట్రో పన్నుల రూపంలో గుంజేదెంత అన్నది ఇప్పటికే అన్నదాతల అనుభవంలోకి వస్తోంది.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని