Viveka Murder Case: వివేకా హత్యలో ఇద్దరిదీ కీలక పాత్ర

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతోపాటు, సాక్ష్యాలు ధ్వంసం చేయడంలోనూ వైఎస్‌ భాస్కరరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కీలక పాత్ర పోషించారంటూ సీబీఐ గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.

Updated : 25 Aug 2023 07:49 IST

కోర్టు విచారణకు అడ్డంకులు సృష్టిస్తారు
వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల బెయిలు పిటిషన్లపై విచారణలో సీబీఐ
ముగిసిన వాదనలు.. తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతోపాటు, సాక్ష్యాలు ధ్వంసం చేయడంలోనూ వైఎస్‌ భాస్కరరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కీలక పాత్ర పోషించారంటూ సీబీఐ గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. నిందితులు పలుకుబడి ఉన్నవారని, సాక్షులను ప్రభావితం చేయగలరని, అందువల్ల బెయిలు మంజూరు చేయరాదని విజ్ఞప్తి చేసింది. గతంలో దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, ఇప్పుడు బెయిలిస్తే విచారణను సాఫీగా సాగనివ్వరని తెలిపింది. వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు బెయిలును తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ వైఎస్‌ భాస్కరరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ గురువారం విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది అనిల్‌ తోమర్‌ వాదనలు వినిపిస్తూ దస్తగిరి వాంగ్మూలంతోపాటు దానికి తగ్గ పలు ఆధారాలను పరిశీలించిన తర్వాతే కేసులో వీరిని నిందితులుగా పేర్కొన్నట్లు తెలిపారు.

సంఘటనలో పాల్గొన్న దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంపై అభ్యంతరాలు చెప్పే ఇది సమయం కాదని, విచారణ సమయంలో క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసుకోవచ్చన్నారు. వివేకా హత్యకు రూ.40 కోట్ల ఒప్పందం కుదిరిందని, ఇందులో భాగంగా రూ.కోటి అడ్వాన్సుగా దస్తగిరికి ఇవ్వాల్సి ఉందని చెప్పారు. సునీల్‌యాదవ్‌ రూ.25 లక్షలు ఉంచుకుని దస్తగిరికి రూ.75 లక్షలు ఇచ్చారన్నారు. వీటితో విల్లా కొనాలని దస్తగిరి ప్రయత్నించారని తెలిపారు. ఇందులో రూ.40 లక్షలను దస్తగిరి స్నేహితుడు మున్నాకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి సీబీఐ స్వాధీనం చేసుకుందన్నారు. రూ.40 లక్షలు ఖాతాలో ఉంచుకునే స్తోమత మున్నాకు లేదన్నారు. దస్తగిరికి కింది కోర్టు ఇచ్చిన క్షమాభిక్షను ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించాయన్నారు. హత్యకు ముందు, తరువాత నిందితులైన సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలు వైఎస్‌ భాస్కరరెడ్డి/ అవినాష్‌రెడ్డి నివాసంలో ఉన్నారని గూగూల్‌ టేకౌట్‌ ద్వారా తేలిందన్నారు.

వివేకా అల్లుడి సోదరుడు ఎన్‌.శివప్రకాశ్‌రెడ్డి ఉదయం 6.26 గంటలకు అవినాష్‌రెడ్డికి ఫోన్‌లో వివేకా హత్య గురించి సమాచారం అందించగా, రెండు నిముషాల్లో వివేకా ఇంటి వద్ద ఉన్నారన్నారు. హత్య గురించి ముందే తెలిసిన అవినాష్‌రెడ్డి తదితరులు సమాచారం కోసం ఎదురుచూశారన్నారు. ఎన్నికల కార్యక్రమం కోసం అవినాష్‌రెడ్డి కడప వెళుతున్నారన్నది అవాస్తవమని రామచంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో తేలిందన్నారు. సంఘటన గురించి ఎవరికీ తెలియక ముందే ఉదయ్‌కుమార్‌రెడ్డి తన తల్లికి వివేకా హత్య గురించి చెప్పారన్నారు. వివేకా హత్య రోజున ఉదయ్‌కుమార్‌రెడ్డి రాత్రంతా పులివెందుల వీధుల్లో తిరుతుగూ అవినాష్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారన్నారు. వైఎస్‌ భాస్కరరెడ్డి సంఘటన స్థలంలోకి ఎవరూ వెళ్లకుండా తలుపులు మూసివేసి సాక్ష్యాధారాలను చెరిపివేయించారన్నారు. వివేకా మృతదేహాన్ని చూస్తే హత్య అని తెలుస్తున్నా గుండెపోటుతో చనిపోయారని కట్టుకథ చెప్పారన్నారు. బ్యాండేజీ, పూలతో వివేకా దేహంపై గాయాలను కప్పిపెట్టారన్నారు.

నేరం మోపడానికి ఆధారాల్లేవు

తొలుత భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కేవలం దస్తగిరి వాంగ్మూలం తప్ప నేరం మోపడానికి ఎలాంటి ఆధారాల్లేవని తెలిపారు. రెండున్నర నెలలు దిల్లీలో సీబీఐ వద్ద ఉన్న దస్తగిరి ఎలాంటి వివరాలు వెల్లడించలేదన్నారు. ముందస్తు బెయిలు ఇవ్వగానే నేరాన్ని అంగీకరిస్తూ అన్ని వివరాలు వెల్లడించారని చెప్పారు. బెయిలు ఇచ్చిన వెంటనే దస్తగిరి క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేశారని, దాన్ని కడప కోర్టు ఆమోదించిందన్నారు. మొత్తం రికార్డు పులివెందుల కోర్టులో ఉంటే.. దాన్ని పరిశీలించకుండానే కడప కోర్టు క్షమాభిక్షపై నిర్ణయం తీసుకున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గూగుల్‌ టేకౌట్‌ ఆధారాలు చట్టపరంగా చెల్లవన్నారు. సీబీఐ అధికారి రాంసింగ్‌పై పలు ఆరోపణలున్నాయని, ఆయన పలువురిని కొట్టడంతో కేసులు కూడా నమోదయ్యాయన్నారు.

చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు నుంచి ఆయన్ను తప్పించారన్నారు. రాజకీయ విభేదాలంటున్నారని, అప్పటికే అవినాష్‌ రెడ్డి ఎంపీగా ఉన్నారని, వివేకా ప్రచారం చేశారని అలాంటప్పుడు రాజకీయ శత్రుత్వం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. వివేకా కుమార్తె కూడా.. అవినాష్‌రెడ్డి విజయానికి వివేకా కృషి చేశారని చెప్పిందన్నారు. వివేకా ఇంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాల గురించి గానీ, ఆయన రాసిన లేఖ గురించి గానీ సీబీఐ దర్యాప్తు చేయలేదన్నారు. భూవివాదాలు, ఇతరత్రా ఉండగా కేవలం రాజకీయ కోణంలోనే అదీ ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేసిందన్నారు. నిందితులు నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారని, భాస్కరరెడ్డి అనారోగ్యంతో సతమతమవుతున్నారని బెయిలు మంజూరు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

శివశంకర్‌రెడ్డి బెయిలు పిటిషన్‌పై 29న నిర్ణయం

వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయి అభియోగపత్రం దాఖలు చేసిన నేపథ్యంలో తనకు బెయిలు మంజూరు చేయాలని కేసులో 5వ నిందితుడైన శివశంకర్‌రెడ్డి వేసిన బెయిలు పిటిషన్‌పై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిల అనుచరుడైన శివశంకర్‌రెడ్డి ఎమ్మెల్సీ టికెట్‌ను ఆశించి విఫలమైన నేపథ్యంలో వివేకాపై కక్ష పెంచుకున్నారని చెప్పారు. వివేకా హత్య కేసులో, సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందువల్ల బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 29కి వాయిదా వేశారు.


నా డ్రైవర్‌నే బెదిరించారు: సీబీఐ న్యాయవాది

నిందితులు పలుకుబడి ఉన్న వ్యక్తులని, ఏపీలో తాను కేసు విచారణకు వెళ్లినప్పుడు తన డ్రైవర్‌ను బెదిరించారని సీబీఐ న్యాయవాది తెలిపారు. తాను ఫిర్యాదు చేస్తే ఎలాంటి సంఘటన జరగలేదని పోలీసులు దాన్ని మూసివేశారన్నారు. అలాంటప్పుడు ప్రైవేటు ఫిర్యాదు ఎందుకు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీబీఐ న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ గతంలో గంగాధర్‌రెడ్డి, సీఐ శంకరయ్య తదితరులను బెదిరించారన్నారు. దర్యాప్తును పక్కదోవ పట్టించడానికి అన్ని ప్రయత్నాలు చేశారని, ఇప్పుడు విచారణ ప్రక్రియను ప్రభావితం చేస్తారని బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తరఫున సీనియర్‌ న్యాయవాది బి.నళిన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ నేరంలో భాస్కరరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిల పాత్రపై ప్రత్యక్ష ఆధారాలున్నాయన్నారు. బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసి, విచారణ ప్రక్రియను సాఫీగా సాగనివ్వరని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని