తెదేపా సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్ర

తెదేపా కంచుకోటైన బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు, తటస్థుల ఓట్లు తొలగించే కుట్ర కొనసాగుతోంది.

Published : 22 Sep 2023 04:48 IST

వారికి తెలియకుండానే భారీగా ఫారం-7 దరఖాస్తులు
పర్చూరు నియోజకవర్గంలో వైకాపా నాయకుల బరితెగింపు

ఈనాడు, అమరావతి: తెదేపా కంచుకోటైన బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు, తటస్థుల ఓట్లు తొలగించే కుట్ర కొనసాగుతోంది. కచ్చితంగా తెదేపాకే ఓటేస్తారనుకునే వారిని ముందే గుర్తించి, జాబితా నుంచి వారి ఓట్లు తొలగించాలంటూ వైకాపా నాయకులు భారీగా ఫారం-7 దరఖాస్తులు చేయిస్తున్నారు. తెదేపా సానుభూతిపరుల సంతకాలు ఫోర్జరీ చేసి.. ఓటు తొలగింపునకు వారే దరఖాస్తు చేసుకున్నట్లు ఈ ఫారం-7లు పెడుతున్నారు. ఈ అక్రమాలు కొన్ని నెలలుగా కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లావ్యాప్తంగా ఓట్ల తొలగింపు కోసం మొత్తం 38,311 ఫారం-7లు అందగా. వాటిలో పర్చూరు నియోజకవర్గానివే 13,952 ఉన్నాయి. వైకాపా నాయకులే ఈ కుట్ర నడిపిస్తున్నారని తెదేపా ఆరోపిస్తోంది.

కుట్రకు సాక్ష్యాలివిగో...

  • మార్టూరు మండలం తెలుగుమహిళ అధ్యక్షురాలు ఉప్పుటూరు రమాదేవి ఓటు తొలగించాలంటూ ఆమె పేరిటే గుర్తుతెలియని వ్యక్తి దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తు ఎవరు చేశారో తేల్చాలని అధికారులను ఆమె డిమాండు చేశారు.
  • యద్దనపూడి మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒకరికి ఆయన స్వగ్రామంలో ఓటు ఉంది. జాబితా నుంచి ఆయన పేరు తీసేయాలంటూ మరో వ్యక్తి ఫారం-7 సమర్పించారు. ఓటు తొలగింపు నోటీసు అందుకున్న ఆ ఉపాధ్యాయుడు విచారణకు హాజరై.. తన ఓటు ఎలా తీసేస్తారని అధికారులను ప్రశ్నించారు.
  • యద్దనపూడి మండలం గంగవరానికి చెందిన నాదెండ్ల చంద్రశేఖర్‌కి అదే ఊళ్లో ఓటు ఉంది. దాన్ని తొలగించాలంటూ ఆయన పేరిట ఎవరో దరఖాస్తు చేశారు.
  • మార్టూరులో 20 ఏళ్లుగా ఉంటున్న చెప్పుల వ్యాపారి రామినేని శ్రీనివాసరావు దంపతుల ఓట్లను తొలగించాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు దరఖాస్తు చేశారు. విచారణకు హాజరైన ఆ దంపతులు అసలు తాము దరఖాస్తే చేసుకోలేదని చెప్పారు.
  • జైభీమ్‌ భారత్‌ పార్టీ పర్చూరు నియోజకవర్గ కన్వీనర్‌ జెట్టి శివ ఓటు తొలగించాలంటూ ఆయన పేరిట ఎవరో దరఖాస్తు చేశారు. తానెందుకలా దరఖాస్తు చేస్తానని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి ఉదంతాలు పర్చూరు నియోజకవర్గంలో లెక్కలేనన్ని.

తెదేపాను అడ్డుకునేందుకే పన్నాగం

పర్చూరు నుంచి తెదేపా తరఫున ఏలూరి సాంబశివరావు ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాబోయే ఎన్నికల్లో ఆయన విజయాన్ని అడ్డుకోవాలనే వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతూ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వైకాపా నాయకులు అడ్డగోలుగా ఫారం-7 దరఖాస్తులు చేయిస్తుండటంతో ఇప్పటికే కొన్ని ఓట్లు అదృశ్యమయ్యాయి. తమ ఓటు లేదని తెలుసుకున్న అనేకమంది తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నందున వారి ఓట్లు తీసేయించేలా వారికి తెలియకుండానే దరఖాస్తులు పెడుతున్నారు.

కేసులు ఎందుకు పెట్టట్లేదు?

ఫోర్జరీ సంతకాలు, తప్పుడు సమాచారంతో ఓట్ల తొలగింపు కోసం ఎవరైనా దరఖాస్తు చేసినా, ఒకే వ్యక్తి తప్పుడు సమాచారంతో పదికి మించి ఫారం-7 దరఖాస్తులు చేసినా బాధ్యుల్ని ఎన్నికల అధికారులు గుర్తించి కేసులు నమోదుచేయాలి. పర్చూరులో మాత్రం ఒక్కరిపైనా కేసు పెట్టలేదు. వాటి వెనక వైకాపా నాయకులు ఉండటమే దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని