YS Jagan: సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, ఆయన బంధుగణానికి, వివిధ కంపెనీలకు వేల కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూరేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన పాలసీలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో గురువారం హైకోర్టు పలువురికి నోటీసులు జారీచేసింది.

Updated : 24 Nov 2023 08:14 IST

విజయసాయిరెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి, వాసుదేవరెడ్డిలకూ తాఖీదులు
సీబీఐ, జగతి పబ్లికేషన్‌, వివిధ కంపెనీలు, ప్రభుత్వ కార్యదర్శులకూ జారీ
అనుచిత లబ్ధి నిర్ణయాలపై ఎంపీ రఘురామ వేసిన పిల్‌పై విచారణ
కౌంటర్లు దాఖలు చేసేందుకు ప్రతివాదులకు హైకోర్టు అవకాశం  
డిసెంబరు 14కు విచారణ వాయిదా

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి(YS Jagan), ఆయన బంధుగణానికి, వివిధ కంపెనీలకు వేల కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూరేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన పాలసీలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో గురువారం హైకోర్టు పలువురికి నోటీసులు జారీచేసింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి సహా వివిధ శాఖల కార్యదర్శులకు, కంపెనీల డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చింది. పిల్‌ విచారణకు స్వీకరించే ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడం మంచిదని వ్యాఖ్యానిస్తూ.. 41 మందికి నోటీసులు జారీచేసింది. పిల్‌ విచారణార్హతపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను డిసెంబరు 14కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ ఎం.కిరణ్మయిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. సీఎం జగన్‌, ఆయన బంధుగణానికి లబ్ధి చేకూరేలా జరిగిన అక్రమాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా దర్యాప్తు రఘురామ ఈ పిల్‌లో కోరారు. ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని తేల్చే బాధ్యతను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థించారు.

నోటీసులు జారీ చేసింది వీరికే..

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నుంచి లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగతి పబ్లికేషన్స్‌ డైరెక్టర్‌ వేమిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఇందిరా టెలివిజన్‌ డైరెక్టర్‌ కల్వ రాజప్రసాద్‌, భారతి సిమెంట్‌ డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీ, సాగర్‌ సిమెంట్స్‌ డైరెక్టర్‌ ఒంటెద్దు రేఖ, ఇండియా సిమెంట్స్‌ డైరెక్టర్‌ శ్రీనివాసన్‌, దాల్మియా సిమెంట్‌ (భారత్‌) డైరెక్టర్‌ భరత్‌ భూషణ్‌ మెహతా, పెన్నా సిమెంట్‌ డైరెక్టర్‌ పుత్తంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మైహోం ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ రామేశ్వర్‌రావు, శ్రీజయజ్యోతి సిమెంట్స్‌, భారతి పాలిమర్స్‌ ఇండియా, అరబిందో ఫార్మా ఫౌండేషన్‌, అరబిందో రియాల్టీ, జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌, రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌, ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌, గ్రేసన్‌ డిస్టిలరీస్‌, అదాన్‌ డిస్టిలరీస్‌, సన్‌రే బాట్లింగ్‌ అండ్‌ బెవరేజెస్‌, ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ (బాట్లింగ్‌), బీ 9 బెవరేజెస్‌, సెంటినీ బయో ప్రొటెక్ట్స్‌, ఆర్‌.ఆర్‌.గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థల డైరెక్టర్లు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాలు, గనులు, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు సహా వైద్య ఆరోగ్యశాఖ, మౌలిక, పెట్టుబడులు (పోర్టు) శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌, గనుల శాఖ డైరెక్టర్‌.

పిటిషన్‌లో ఆరోపణలు ఇవీ..

జగన్‌మోహన్‌రెడ్డి, సమాచార పౌర సంబంధాల ముఖ్యకార్యదర్శి పక్షపాత ధోరణితో ప్రభుత్వ సంబంధ వార్తలు, ప్రకటనలను ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌కు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం కల్పించారు. భారతి, దాల్మియా, పెన్నా, మరో అయిదు కంపెనీలకు సింహభాగం సిమెంట్‌ కొనుగోలు ఆర్డర్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌, గనులశాఖ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు అక్రమ నిర్ణయాలు తీసుకున్నారు. జగన్‌ తన హాదాను దుర్వినియోగపరిచారు. 104, 108 అంబులెన్సుల నిర్వహణను అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు అప్పగించడంలో జగన్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అవినీతికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు, కాకినాడ సీ పోర్టులను అరబిందో రియాల్టీ సంస్థకు అప్పగించే విషయంలో ముఖ్యమంత్రి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు (పోర్టు)శాఖ ప్రత్యేక సీఎస్‌ అక్రమాలకు పాల్పడ్డారు. జగన్‌, గనుల శాఖ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు అవినీతికి పాల్పడి ఇసుక తవ్వకాలను చెన్నైకి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పగించారు. ‘పేదలకు ఒక సెంటు స్థలం’ ముసుగులో ప్రైవేటు సంప్రదింపుల ద్వారా అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రైవేటు వ్యక్తుల భూములతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. కొన్ని మద్యం కంపెనీలకే ఎక్కువ భాగం మద్యం కొనుగోలు ఆర్డర్లను అప్పగించే విషయంలో జగన్‌, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కమిషనర్‌, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి జగన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కార్యదర్శులు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పటికీ కేంద్ర హోంశాఖ మౌనం వహిస్తోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేసేలా సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించాలి.

విచారణార్హతపై ఏజీ అభ్యంతరం

అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ ఈ పిల్‌ విచారణ అర్హతపై అభ్యంతరం లేవనెత్తారు. రిట్‌ రూల్స్‌కు విరుద్ధంగా ఉందన్నారు. పూర్తి వివరాలను ప్రస్తావించలేదన్నారు. పిటిషనర్‌ను అనర్హులుగా ప్రకటించాలని వైకాపా విప్‌ స్పీకర్‌కు లేఖ రాశారని.. ఆ విషయాన్ని పిల్‌ డిక్లరేషన్లో పేర్కొనలేదని తెలిపారు. పిటిషనర్‌ డైరెక్టర్‌గా ఉన్న ఓ కంపెనీ రూ. 700 కోట్లు చెల్లించడంలో విఫలమైందని, ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయాన్ని పిల్‌లో పేర్కొనలేదన్నారు. పిల్‌ దాఖలు తర్వాత ‘ముఖ్యమంత్రిని వదలను’ అని మీడియా ముందు ప్రకటన చేశారన్నారు. దురుద్దేశంతో, రాజకీయ వైరంతో పిటిషన్‌ వేశారని ఆరోపించారు. ఎంపీ రఘురామ తరఫు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ ఏజీ చెబుతున్న కారణాలు పిల్‌ దాఖలుకు అడ్డంకి కాదని తెలిపారు.

ప్రతివాదులకు నోటీసులు: ధర్మాసనం

ఈ దశలో ధర్మాసనం స్పందిస్తూ.. పిల్‌ విచారణకు స్వీకరించే ముందు ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని ప్రతిపాదించింది. విచారణార్హత గురించి తేల్చాక లోతుల్లోకి వెళ్తామని పేర్కొంది. ఏజీ స్పందిస్తూ.. విచారణార్హతను తేల్చకముందే నోటీసు ఇవ్వడం సరికాదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఇలాంటి వ్యాజ్యంలో వాదనలు చెప్పుకొనేందుకు న్యాయస్థానం తమకు అవకాశం ఇవ్వలేదని వారు భావించే అవకాశం ఉందని పేర్కొంది. అందుకు వీల్లేకుండా నోటీసులు ఇవ్వడం ఉత్తమం అని వ్యాఖ్యానించింది.


రికార్డులను ధ్వంసం చేస్తున్నారు
-రఘురామ తరఫు న్యాయవాది మురళీధరరావు

ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ.. ఇసుక, మద్యం పాలసీ వ్యవహారాలపై రికార్డులను సీజ్‌ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. పిల్‌ దాఖలు చేసిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేశారన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో కోర్టులో రికార్డులను మాయం చేసిన ఘటన గతంలో చోటు చేసుకుందని గుర్తుచేశారు. ఈ దశలో రికార్డుల సీజ్‌కు ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. పిల్‌ విచారణ అర్హతతోపాటు అనుబంధ పిటిషన్లను తర్వాత పరిశీలిస్తామని తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని