పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!

ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్‌ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్‌లో ఫిడేల్‌ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి?

Published : 03 May 2024 05:22 IST

70 పట్టణ తాగునీటి ప్రాజెక్టులకు నీళ్లొదిలిన సీఎం జగన్‌
తెదేపా ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయన్న అక్కసు
ఈనాడు, అమరావతి

ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్‌ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్‌లో ఫిడేల్‌ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి?

పట్టణ ప్రజల తాగునీటి సరఫరాకు ఇబ్బంది రానివ్వనని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్‌... తెదేపా ప్రభుత్వంలో ప్రారంభించిన అనేక తాగునీటి పథకాలకు నిధులివ్వకుండా పాడుబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎలాగూ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ వాటానూ ఇతర అవసరాలకు వినియోగించి పథకాలకు పాతరేశారు. మూర్ఖత్వంతో పట్టణ ప్రాంత ప్రజలను సమస్యల సుడిగుండంలోకి నెట్టేసి... నిస్సిగ్గుగా ప్రతి పట్టణాన్నీ మార్చేశానని టముకేసుకుంటున్నారు. బిందెడు నీటి కోసం ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే ..మీ చావు మీరు చావండని విషపు నవ్వులు నవ్వుతున్నారు. పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గత తెదేపా ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్‌ పథకం, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) సాయంతో 70 తాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రారంభించాయి. రూ.6,526 కోట్ల విలువైన ఈ పనులను జగన్‌ ప్రభుత్వం కేవలం అక్కసుతో పక్కనపెట్టింది. ప్రజల తాగునీటి అవసరాలు గుర్తించకుండా వీటిని పూర్తి చేస్తే తెదేపాకి పేరొస్తుందేమోనన్న దుగ్ధతో పాడుబెట్టింది. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఈపాటికే అమృత్‌లో ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాలి. వైకాపా సర్కారు బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో 52 పథకాల్లో నాలుగే పూర్తయ్యాయి. ఏఐఐబీ సాయంతో చేపట్టిన వాటిని 2024 జూన్‌ 30కి పూర్తిచేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్కదాన్నీ పూర్తిచేయలేదు. దాదాపు రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో ఎక్కువ చోట్ల గుత్తేదారులు పనులు నిలిపివేశారు. వీటిలో సగమైనా పూర్తిచేసి ఉంటే వేసవిలో పట్టణాల్లో తాగునీటి సమస్య తలెత్తేదే కాదు. ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చే అవసరం తప్పేది.


ఇది కాదా నిర్లక్ష్యం!

నంద్యాల జిల్లా ఆత్మకూరులో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి గత తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.116 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టు పనులకు జగన్‌ ప్రభుత్వం గ్రహణం పట్టించింది. బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులను అసంపూర్తిగా నిలిపివేశారు. వెలుగోడు జలాశయం నుంచి ఆత్మకూరు వరకు పైపులైన్‌ ఏర్పాటు, వేంపెంట, కరివేన వద్ద రెండు నీటి శుద్ధి కేంద్రాలు, పట్టణంలో నాలుగు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించాలన్నది ప్రణాళిక. తెదేపా హయాంలో మొదలుపెట్టిన పనులను యథావిధిగా పూర్తి చేస్తే పట్టణంలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించేది. జగన్‌ ప్రభుత్వం అక్కసుతో వీటిని పక్కన పెట్టి ప్రజలకు కష్టాలుే మిగిల్చింది.


చీమకుర్తి పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే పనులకు జగన్‌ ప్రభుత్వం పక్కనపెట్టింది. రామతీర్థం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి పైపులైన్‌ ద్వారా పట్టణ ప్రజలకు రక్షిత తాగునీరు అందించాలన్నది ప్రణాళిక. రూ.63 కోట్ల ఏఐబీబీ సాయంతో తెదేపా ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక రెండేళ్లపాటు పనులు నిలిపివేశారు. 2022లో మళ్లీ ఇదే పథకానికి అప్పటి పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. పనులైతే ఇప్పటికీ పూర్తికాలేదు. రెవెన్యూ కార్యాలయం సమీపంలో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకు పనులూ అసంపూర్తిగా ఉన్నాయి. పైపులైన్ల ఏర్పాటు పనులు సర్వేకే పరిమితమయ్యాయి.


నెల్లూరు జిల్లా కావలిలోని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుకు సంగం బ్యారేజీ నుంచి నీటిని రప్పించేందుకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.150 కోట్లతో ప్రారంభించిన పైపులైన్‌ పనులను జగన్‌ ప్రభుత్వం పాడు బెట్టింది. 20 శాతం పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. వైకాపా సర్కార్‌ వచ్చాక బిల్లులు చెల్లించకపోవడం తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతానికి పనులు నిలిచిపోయి ఎక్కడి సామగ్రి అక్కడే పడి ఉంది. సంగం బ్యారేజీ నుంచి పైపులైన్‌ ఏర్పాటు చేస్తే పట్టణ ప్రజల అవసరాలకు సరిపడా తాగునీరు అందించే వీలుంటుంది. ఎంతో ముఖ్యమైన పనులను పక్కన పెట్టడంతో కావలి ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.


పుత్తూరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.138 కోట్ల ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) సాయంతో చేపట్టిన పనులు జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పట్టణంలో రూ.55 కోట్లతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుని అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగుగంగ నీటిని తీసుకొచ్చేందుకు పనులు ప్రారంభించారు. కేవీబీపురం మండలం పవనివారి కండ్రిగ వద్ద వ్రవహిస్తున్న తెలుగుగంగ కాలువ నుంచి 57 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుని నీటితో నింపాలన్నది లక్ష్యం. పవనివారి కండ్రిగ, రాయపేడు వద్ద రెండు పంపుహౌస్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. పైపులైను పనులు 60 శాతం పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం రూ.20 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో పనులు నిలిచిపోయాయి.


గండికోట ప్రాజెక్టు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ ప్రజలకు తాగునీటిని అందించేందుకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో అమృత్‌ పథకంలో పనులు ప్రారంభించారు.  రూ.145 కోట ఈ ప్రాజెక్టును  వైకాపా సర్కార్‌ అటకెక్కించింది. 37 కిలోమీటర్ల మేర వేయాల్సిన పైపు లైన్‌ వేయాల్సి ఉండగా దాదాపు 32 కిలో మీటర్లు మాత్రమే పూర్తయ్యాయి. రోజూ 45 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేసే కేంద్రం నిర్మాణ పనులు సజ్జలదిన్నె వద్ద ప్రారంభమయ్యాయి.  కానీ ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణ పనులను గత ప్రభుత్వ హయాంలో చేసిన పనుల బిల్లులు చెల్లించలేదని గుత్తేదారులు మధ్యలోనే నిలిపివేశారు. గండికోట రిజర్వాయర్‌, తాడిపత్రి శివారులో పైనులైను పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. నీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు ఇంకా మొదలేకాలేదు.


పుంగనూరులో దెబ్బతిన్న పైపులైనుకు ప్రత్యామ్నాయంగా కొత్తది ఏర్పాటు చేస్తే పట్టణంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. కానీ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లుగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రజలను కష్టాలపాల్జేసింది. పుంగమ్మ చెరువులో రూ.33 కోట్లతో పుష్కరం క్రితం నిర్మించిన సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నుంచి పుంగనూరుకు నీరందించేలా వేసిన పైపులైను  దెబ్బతింది. అప్పటి నుంచి పట్టణ ప్రజలకు బోర్ల ద్వారా రోజు విడిచి రోజు నీరందిస్తున్నారు. తీరా ఎన్నికల ముందు తెరపైకి ప్రతిపాదనలు తెచ్చి... ప్రత్యామ్నాయంగా మరో పైపులైన్‌ ఏర్పాటుకు ఉపక్రమించారు. ఈ పనులు పూర్తయితే పట్టణానికి తాగునీరు రానుంది.


కర్నూలులో తాగునీటి కొరతను అధిగమించేందుకు 2021లో రూ.82 కోట్లతో ప్రారంభించిన పైపులైను పనులు మూలకు చేరాయి. ప్రాజెక్టు పనుల నిర్వహణకు అనుమతించిన జగన్‌ ప్రభుత్వం సరిగా నిధులు విడుదల చేయలేదు. సుంకేశుల జలాశయం నుంచి మునగాలపాడులోని నగరపాలక సంస్థకి చెందిన సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు వరకు 23 కిలో మీటర్ల మేర పైపులైన్‌ ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. దీనివల్ల జల చౌర్యం, తీవ్రమైన ఎండల సమయంలో నీటి ఆవిరి వంటి నష్టాలను అధిగమించొచ్చన్నది ప్రధాన ఉద్దేశం. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో మిగిలిన పనులు చేయడానికి గుత్తేదారులు ఆసక్తి చూపని కారణంగా ఈపాటికే పూర్తి చేయాల్సినవి మందకొడిగా సాగుతున్నాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు