పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్‌ అధికారులు

‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్‌లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పీవీ రమేష్‌ డిమాండ్‌ చేశారు.

Published : 03 May 2024 05:21 IST

అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి
ఆర్థిక నిపుణుడు, మాజీ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పీవీ రమేష్‌

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: ‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్‌లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పీవీ రమేష్‌ డిమాండ్‌ చేశారు. తిరుపతిలోని ఓ హోటల్‌లో గురువారం సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి’పై చర్చాగోష్ఠి నిర్వహించారు. సంస్థ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, కోశాధికారి ఫల్గుణకుమార్‌, ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయసూరి, ఏపీ హైకోర్టు న్యాయవాది రవితేజ పాల్గొన్నారు. ప్రధానవక్తగా హాజరైన రమేష్‌ మాట్లాడుతూ... ‘రాజకీయాలు ఒకప్పటిలా లేవు. రూ.వందల కోట్లున్న వారికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి చట్టసభలకు పంపుతున్నారు. మరోపక్క కుల, మత ప్రాతిపదికన రాజకీయాలు దిగజారాయి. అభివృద్ధి, సంక్షేమం అంటే కేవలం బటన్‌ నొక్కడమేనని నేటి నాయకులు భావిస్తున్నారు. ప్రజలు మౌనంగా ఉండటం వల్లే... ఇసుక, ఖనిజాలు, భూములు దోపిడీకి గురవుతున్నాయి. జనం బయటకు వచ్చి మాట్లాడాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి’ అని అన్నారు.

పాలకులు ప్రజలకు దూరమయ్యారు

‘ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే వారిని ఇబ్బందులు పెడుతోంది. ముఖ్యంగా దళితులు, మహిళలకు రక్షణ కరవైంది. శాంతిభద్రతలను కాపాడే పోలీస్‌ వ్యవస్థ ప్రజల కోసం పనిచేయాలి. వారిని చూస్తేనే భయపడే రోజులొచ్చాయి. నా 35 ఏళ్ల సర్వీసులో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నా. రోజులు మారాయి. నాలాంటి వారూ నేడు సీఎస్‌ను కలిసి మాట్లాడే పరిస్థితి లేదు. పాలకులు, అధికారులు.. ప్రజలకు దూరంగా జీవిస్తున్నారు’ అని రమేష్‌ విమర్శించారు. ‘రాష్ట్రంలో పరిశ్రమల ఊసేలేదు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మూడేళ్లుగా కాగ్‌ రిపోర్టులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేస్తోంది. ఐదు శాతమే ప్రజలకోసం వెచ్చిస్తోంది. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేస్తోందో ఎవరికీ తెలియదు’ అని దుయ్యబట్టారు.

వ్యవసాయంపై నిర్లక్ష్యం: లక్ష్మణరెడ్డి

తలసరి ఆదాయంలో ఏపీ.. దక్షిణ భారతదేశంలోనే అట్టడుగు స్థానంలో, దేశవ్యాప్తంగా 11వ స్థానంలో ఉంది. మానవాభివృద్ధిలో 25వ స్థానంలో, అక్షరాస్యత పరంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు 30వ స్థానంలో ఉన్నాం. ఏపీ ఏర్పడినప్పటి నుంచి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 15 శాతం కేటాయించి ఖర్చుపెడితే, ఐదేళ్లుగా 5 శాతమే కేటాయించి అందులోనూ 2.5 శాతమే వ్యయం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని