బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం

బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ (ఆశా) ప్రకటించింది.

Updated : 03 May 2024 06:29 IST

రేపటి నుంచి ఈహెచ్‌ఎస్‌, తరువాత ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం
ట్రస్టు సీఈవోకు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల లేఖ

ఈనాడు, అమరావతి: బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ (ఆశా) ప్రకటించింది. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు కోరుతున్నా, ప్రభుత్వం చెల్లించ లేదని పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో లక్ష్మీశకు లేఖ రాసింది. బకాయిలు రాక ఆసుపత్రుల వర్కింగ్‌ క్యాపిటల్‌ అయిపోయిందని, నిర్వహణకు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలని రుణదాతల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని వెల్లడించింది. బకాయిలు చెల్లించకపోతే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరోగ్యశ్రీ సేవలను కూడా నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. మొదటి విడతలో ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు నిలిపివేస్తామని, తరువాత ఆరోగ్యశ్రీ సేవలనూ ఆపేస్తామని ఆశా స్పష్టం చేసింది. అన్నిరకాల బకాయిలూ కలిపి నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం సుమారు రూ.1200 కోట్ల మేర చెల్లించాలి. మరోవైపు ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు వారి నుంచి వాటా సొమ్ము వసూలు చేస్తున్న ప్రభుత్వం వాటిని ఆసుపత్రులకు చెల్లించడం లేదు. తమ జీతాల నుంచి మినహాయించిన మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టుకు జమ చేయాలని గతంలో ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఈహెచ్‌ఎస్‌ కార్డులపై వైద్య సేవలు సక్రమంగా అందకపోగా, వైద్యం చేయించుకుని బిల్లులు పెట్టినా.. వాటినీ సకాలంలో చెల్లించడం లేదు. ఇలా ఉద్యోగులతో ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని