Ambati Rambabu: పింఛను సొమ్ముతో సంబరాలా.. రాంబాబూ?

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామంటూ లక్కీడిప్‌ టికెట్లు అంటగట్టి, పింఛను నుంచి రూ.100 చొప్పున మినహాయించుకున్నారని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం ఎస్టీకాలనీ వాసులు బుధవారం ఆవేదన వ్యక్తంచేశారు.

Updated : 11 Jan 2024 14:21 IST

లాటరీ టికెట్లు వద్దేవద్దు మా డబ్బు మాకివ్వండి
లక్కీడిప్‌ కోసం రూ.100 మినహాయింపుపై పింఛనుదారుల ఆగ్రహం
సత్తెనపల్లిలో తీరు మార్చుకోని మంత్రి అంబటి

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామంటూ లక్కీడిప్‌ టికెట్లు అంటగట్టి, పింఛను నుంచి రూ.100 చొప్పున మినహాయించుకున్నారని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం ఎస్టీకాలనీ వాసులు బుధవారం ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెలలో రూ.3 వేలు చొప్పున పింఛను వచ్చిందనుకుంటే అందులో కోతలు వేశారని, అదేమని ప్రశ్నించినా మినహాయించుకున్న డబ్బును వెనక్కి ఇవ్వలేదని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు వాపోయారు. తనకు వృద్ధాప్య పింఛను రూ.3 వేలు రాగా.. రూ.2,800 మాత్రమే ఇచ్చారని స్థానికుడు కె.ఆంజనేయులు చెప్పారు. తమవద్ద రూ.100 చొప్పున తీసుకున్నారని వృద్ధురాలు కోటేశ్వరమ్మ తెలిపారు. కొందరి నుంచి రూ.500 దాకా వసూలు చేసినట్లు వాపోయారు. లక్కీ డ్రాలు మాకెందుకు? పింఛను పూర్తిగా ఇవ్వకుండా కోతలు పెట్టడం ఏంటి? అని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.

అధికారులు ఏం విచారించినట్లు?

సంక్రాంతి సంబరాల పేరుతో సత్తెనపల్లి నియోజకవర్గంలో పింఛనుదారులకు బలవంతంగా లక్కీడిప్‌ టికెట్లు అంటగట్టడంపై ‘పింఛను సొమ్ముతో లక్కీడిప్‌ టికెట్‌’ శీర్షికన ‘ఈనాడు’లో ఈ నెల 8న కథనం ప్రచురితమైంది. దీనిపై విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని డీఆర్‌డీఏ అధికారులను సెర్ప్‌ సీఈవో ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పింఛనుదారుల దగ్గరకు వెళ్లకుండానే... అలాంటిదేమీ లేదని అధికారులు విచారణ నివేదిక ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. గ్రామాలు, వార్డులకు వెళ్లి అధికారులు ఏం విచారించారో తెలియని పరిస్థితి.

అందరికీ అంటగట్టేస్తున్నారు..

పింఛనుదారులనే కాకుండా అందరికీ బలవంతంగా లక్కీడిప్‌ టికెట్లు అంటగడుతున్నారు. 50 టికెట్లు ఉన్న నాలుగైదు పుస్తకాల్ని స్థానిక వ్యాపారులకు ఇచ్చి, ఆ మేరకు నగదు చెల్లించాలని కొందరు అధికార పార్టీ నాయకులు అడుగుతున్నారు. ఒకరిద్దరు కౌన్సిలర్లు బలవంతంగా వ్యాపార, వాణిజ్యవర్గాల నాయకులకు టికెట్లను అంటగట్టి నగదు ఇవ్వాల్సిందేనంటూ బెదిరించినట్లు సమాచారం. కొన్నిశాఖల ఉద్యోగులకూ వసూళ్ల లక్ష్యాల్ని విధించారు. కొందరు ఉద్యోగులు టికెట్ల పుస్తకాల్ని తీసుకునేందుకు ఇష్టపడక పోవడంతో ఓ కౌన్సిలర్‌ భర్త  సచివాలయానికి తాళం వేసి మరీ బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. వాహనాల తనిఖీల పేరుతోనూ కొందరి నుంచి రూ.100 చొప్పున వసూలు చేయడం చూస్తుంటే అక్రమ వసూళ్లు ఏస్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. గతేడాది సంక్రాంతి లక్కీడ్రా వ్యవహారంపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదైనప్పటికీ ఈసారీ ప్రజల సొమ్ముతో సంబరాలకు దిగడం అంతటా చర్చనీయాంశమైంది.

అంబటి తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు

సత్తెనపల్లిలోని వావిలాల స్మృతివనంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. స్మృతివనం 6 వేల మందికే సరిపోతుంది. ఎంట్రీపాసుల పేరుతో లక్షకు పైగా టికెట్లను ఒక్కొక్కటి రూ.100 చొప్పున అమ్ముతున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని వైకాపా నాయకుడు, ముప్పాళ్ల మండల మాజీ జడ్పీటీసీ ఇందూరి నరసింహారెడ్డి... మంత్రి అంబటి రాంబాబు తీరును విమర్శించారు. సంక్రాంతి సంబరాల కోసం లక్కీడిప్‌ పేరుతో వసూళ్లను నిరసిస్తూ బుధవారం ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. జనం సొమ్ముతో సంక్రాంతి సంబరాలు చేయడం ఏమిటని అంబటిని ప్రశ్నించారు. గతేడాది ఇదే విషయంలో కేసు నమోదైనా తీరు మార్చుకోకపోవడంతో ప్రజల్లో చులకన అవుతున్నట్లు వాపోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని