CM Jagan: మధ్య తరగతికి మహా ‘టోపీ’!

అవసరాలను ఆసరాగా చేసుకోవడం... లేని ఆశలను రేకెత్తించడం... ఆపై నమ్మించి, నిలువునా మోసం చేయడం... ఆయనకు వెన్నతో పెట్టిన విద్య... సొంతింటి కలలను సాకారం చేస్తామంటూ జగన్‌... మధ్య తరగతి కుటుంబాలను దగా చేశారు.

Updated : 20 Mar 2024 08:29 IST

ప్లాట్ల పేరిట జగన్‌ పచ్చి దగా
ఎంఐజీ లేఅవుట్లు వేస్తున్నామంటూ రూ.కోట్లు వసూలు
రెండున్నరేళ్లలో ఒక్కటీ అందుబాటులోకి రాలేదు
ప్రభుత్వాన్ని నమ్మి అప్పులపాలైన కుటుంబాలు
ఈనాడు - అమరావతి

అవసరాలను ఆసరాగా చేసుకోవడం... లేని ఆశలను రేకెత్తించడం... ఆపై నమ్మించి, నిలువునా మోసం చేయడం... ఆయనకు వెన్నతో పెట్టిన విద్య... సొంతింటి కలలను సాకారం చేస్తామంటూ జగన్‌... మధ్య తరగతి కుటుంబాలను దగా చేశారు... డబ్బులు వసూలు చేసి ముంచేశారు...

పేదలకు ఇళ్లు కాదు... గ్రామాలే నిర్మిస్తున్నామని సీఎం జగన్‌ ఊరూవాడా డప్పు కొట్టి చెప్పారు. చివరకు పిచ్చుకగూళ్లను కూడా కట్టలేదు. మరోవైపు మధ్య తరగతి వారికి తక్కువ ధరకే ఇళ్ల స్థలాలిస్తామని ఆర్భాటం చేసి, చివరకు వేల కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేశారు. ఇంటి స్థలం రాక, చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక బాధిత కుటుంబాలు అల్లాడుతున్నాయి. రాజీవ్‌ స్వగృహ ప్రాజెక్టు పేరిట గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్‌, ఎంఐజీ స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల పేరిట ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌... మధ్య తరగతిని ముంచేశారు. మధ్యాదాయ వర్గాల కోసం రెండున్నరేళ్ల క్రితం పట్టణ ప్రాంతాల్లో 32 లేఅవుట్లను చేపట్టిన ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రైవేటు స్థిరాస్తి వ్యాపారులను తలదన్నేలా లేఅవుట్లలో స్థలాలిస్తానని మాటిచ్చి మోసం చేశారు. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. పనులు ప్రారంభించిన చోట పూర్తికాలేదు. చాలాచోట్ల అసలు భూమిపూజ కూడా చేయలేదు. తాను మాత్రం రూ.450 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టించి మరీ దర్జాగా రాజప్రాసాదాన్ని కట్టుకోవడం గమనార్హం. తమకు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన భవంతులేమీ వద్దని, ఒప్పందం ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే చాలని బాధితులు వేడుకుంటున్నారు. మంగళగిరి ప్యాలెస్‌లోని జగన్‌కు ఇవేవీ పట్టడంలేదు. గత ఏడాదిగా వీటిపై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. అప్పులు చేసి రూ.లక్షలను వాయిదాలుగా చెల్లించిన ప్రజలకు తీరని వేదన మిగిల్చారు.

దరఖాస్తుతోపాటే మొదలైన వసూళ్లు..

తక్కువ ధరకు అద్భుతమైన సదుపాయాలతో లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు అనగానే మధ్యతరగతి ప్రజలు ఆశపడ్డారు. దరఖాస్తుదారుల నుంచి ప్లాట్‌ విలువలో 10% మొత్తాన్ని ప్రభుత్వం అప్పుడే వసూలు చేసింది. ఆ తర్వాత ఒప్పందం చేసుకున్న వారి నుంచి  మరో మూడు వాయిదాల్లో 30% చొప్పున 90% డబ్బులను బ్యాంకు ఖాతాల్లో వేయించుకుంది. ఇక అప్పటి నుంచి వారిని తన చుట్టూ తిప్పించుకుంటోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అనేకచోట్ల ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియే పూర్తి కాలేదంటే ఇంతకంటే నిర్లక్ష్యం ఇంకేమైనా ఉంటుందా? అస్మదీయులకు వివిధ అవసరాల పేరిట వేల ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించే జగన్‌ ప్రభుత్వానికి స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు గుర్తుకు రాలేదు. లేఅవుట్ల కోసం ప్రైవేట్‌ భూములను సేకరించాలని నిర్ణయించినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి. చాలాచోట్ల భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని టౌన్‌షిప్‌ల ఏర్పాటు ప్రతిపాదనలను అధికారులు పక్కన పెట్టారు. అంటే ప్రభుత్వాన్ని నమ్మి డబ్బు చెల్లించిన కుటుంబాలు నిలువునా మునిగిపోయాయి. ప్లాట్లు వద్దని, తాము చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని దరఖాస్తుదారులు అడుగుతున్నారంటే జగన్‌ ప్రభుత్వంపై వారికి ఎంత విశ్వాసం ఉందో గ్రహించవచ్చు.

  • ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరులో బైపాస్‌ వద్ద దుర్గసాగరం సమీపంలో 15 ఎకరాల డి.పట్టా భూములను సేకరించారు. బొబ్బిలిలో లేఅవుట్‌ ఏర్పాటుకు మూడుచోట్ల స్థలాల సేకరణకు విఫల ప్రయత్నం చేశారు. రామన్నదొరవలస వద్ద 20 ఎకరాలను సేకరించాల్సి ఉండగా... రైతులు సహకరించలేదు. దాంతో మల్లంపేట వద్ద లేఅవుట్‌ ఏర్పాటుకు అధికారులు పరిశీలిస్తున్నారు. పార్వతీపురం సమీపంలోని అడ్డపుశీల వద్ద 30 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. కురుపాంలోనూ మూడుచోట్ల భూములు పరిశీలించినా ఇంకా కొలిక్కి రాలేదు.
  • విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) పరిధిలో తొమ్మిదిచోట్ల లేఅవుట్లు వేశారు. భోగాపురం-చోడేపల్లి, అడ్డూరు, గరివిడి, జియ్యమ్మవలస, పాలవలస, రఘుమండ, జీఎస్‌ అగ్రహారం-1, జీఎస్‌ అగ్రహారం-2, రామవరంలలో వెంచర్లు చేపట్టారు. వీటిలో చాలాచోట్ల అభివృద్ధి పనులు పూర్తవకపోవడంతో... ప్లాట్లను కొనేందుకు ప్రజలు ముందుకు రావడంలేదు. దీన్నే సాకుగా చూపి, వీటి అభివృద్ధినే తాత్కాలికంగా నిలిపేశారు.
  • ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డకు కి.మీ. దూరంలో 14.93 ఎకరాల్లో 154 ప్లాట్లతో, ఎమ్మిగనూరు మండలం బపవాసిలో 112 ఎకరాల్లో 1,132 ప్లాట్లతో వెంచర్లు వేశారు.

ఎక్కడ చూసినా అసంపూర్తి పనులే...!

  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడుచోట్ల జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లను ప్రతిపాదించగా... ఒక్కటీ ఆచరణలోకి రాలేదు. చిత్తూరులోని కోడిగుంటలో 35.25 ఎకరాలను ఎంపిక చేశారు. అందులో 19.18 ఎకరాలు డీకేటీ భూములు... మిగితావి ప్రైవేటు పట్టా భూములు. డీకేటీ భూములకు పరిహారం చెల్లించారు. ప్రైవేట్‌ భూములను ఇచ్చేందుకు వాటి యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో 19 ఎకరాల్లోనే లేఅవుట్‌ వేయాలని నిర్ణయించినా... ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. గంగాధర నెల్లూరు పారిశ్రామికవాడకు ఎదురుగా ఉన్న భూమిలో లేఅవుట్‌ వేసేందుకు మొదట ప్రతిపాదించి, పక్కన పెట్టారు. పూతలపట్టులో వెంచర్‌ ఏర్పాటుకు 25 ఎకరాల సేకరణకు రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో పనులు మొదలవలేదు.
  • ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట, ప్రొద్దుటూరు, పీలేరు, రైల్వేకోడూరు, బద్వేల్‌లలో లేఅవుట్ల పనులు ప్రారంభించలేదు. రాయచోటి సమీపంలోని అబ్బవరంలో 30 ఎకరాల్లో వేసిన లేఅవుట్‌లో 280 మందికిపైగా లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించినా... మౌలిక సదుపాయాల పనులింకా పూర్తవలేదు.
  • సీఆర్‌డీఏ పరిధిలోని నవులూరులో 80.46 ఎకరాల్లో లేఅవుట్‌ వేశారు. ఇక్కడ రోడ్లు, కాలువల పనులు ప్రారంభించడం, నిలిపివేయడం నిత్యకృత్యమైంది. ఇందులో 185 ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి రూ.40 కోట్ల వరకు ఆదాయం సమకూరినా... కొనుగోలుదారులకు ప్లాట్లు అప్పగించడం లేదు.

ప్లాట్ల రిజిస్ట్రేషన్లకూ తిప్పలే!

రాష్ట్రంలో 2022 మే 18న ఏలూరు శనివారపుపేటలో శంకుస్థాపన చేసిన మొట్టమొదటి జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ప్లాట్‌ మొత్తానికి పూర్తిగా డబ్బు చెల్లించిన అనేక కుటుంబాలు రిజిస్ట్రేషన్‌ చేయాలని ఏడాదిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. లేఅవుట్‌లో 383 ప్లాట్లలో ఇప్పటికీ 100కిపైగా కేటాయింపులు చేశారు. మౌలిక సదుపాయాల కల్పన పరంగా కొన్ని పెండింగ్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని